పూర్తి ప్రతిభ, సమర్థత, అనుభవాల ఆధారంగా విశ్వవిద్యాలయ అధికారుల నియామకం జరిపినట్లు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆల్దాస్‌ జానయ్య తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా అధికారుల నియామకం విషయంలో తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని ఎటువంటి ఒత్తిళ్లు, ప్రభావాలు లేకుండా నియామకాలు పూర్తి చేసినట్లు వివరించారు. ఇటీవల నియమితులైన విశ్వవిద్యాలయ అధికారులు, ఇతర ఉన్నత అధికారుల పరిచయ కార్యక్రమం రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జరిగింది. ఉపకులపతి జానయ్య వీరందరినీ సమావేశానికి హాజరైన బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులకు పరిచయం చేశారు. అనేక ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి విశ్వవిద్యాలయ అధికారులని నియమింప చేసే అవకాశం తనకు లభించిందన్నారు. ఈ కొత్త బృందం ”మంచి భవిష్యత్తుకి కొత్త ఆశలు”కల్పిస్తుందని జానయ్య అన్నారు. కొన్ని విభాగాల్ని పునర్వ్యవస్థీకరించడం ద్వారా విశ్వవిద్యాలయాన్ని మరింత ప్రగతి పథంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. రానున్న ఏళ్ళల్లో దేశంలో 10 అత్యుత్తమ వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో పి.జె.టి.ఎ.యు. స్థానం సాధించడానికి అందరము కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. బోధన, బోధనేతర సిబ్బంది నిరంతర శిక్షణ, అధ్యయనం, సానుకూల దృక్పథంతో, నిజాయితీ, అంకితభావంతో పనిచేస్తే ఆ లక్ష్యాన్ని సాధించడం సాధ్యమేనని ఆయన అభిప్రాయపడ్డారు. అంతిమంగా రైతాంగ సంక్షేమం పరమావధిగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆల్దాస్‌ జానయ్య పిలుపునిచ్చారు. ఉపకులపతి సూచనలు, సలహాలతో విశ్వవిద్యాలయ స్థాయిని మరింత పెంచేందుకు కృషి చేస్తానని రిజిస్ట్రార్‌ జి.ఇ.సిహెచ్‌. విద్యాసాగర్‌ స్పష్టం చేశారు. నిజాయితీ, చిత్తశుద్ధితో ఇన్నేళ్లు బాధ్యతలు నిర్వర్తించడం వల్లనే నేడు తనకీ అవకాశం వచ్చిందని భావిస్తున్నానని ఆయనన్నారు. ఈ సందర్భంగా తమ అనుభవాలు, భవిష్యత్‌ ప్రణాళికలు గురించి కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు డీన్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ డాక్టర్‌ కె. ఝాన్సీ రాణి, డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ డాక్టర్‌ ఎం. బలరాం, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎక్స్టెన్షన్‌ డాక్టర్‌ ఎం. యాకాద్రి, డీన్‌ ఆఫ్‌ పీజీ స్టడీస్‌ డాక్టర్‌ కె.బి. ఈశ్వరి, డీన్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ అఫైర్స్‌ డాక్టర్‌ సి.హెచ్‌. వేణుగోపాల్‌ రెడ్డి, సెంటర్‌ ఆఫ్‌ డిజిటల్‌ అగ్రికల్చరల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బి. బాలాజీ నాయక్‌, ప్లానింగ్‌ అండ్‌ మానిటరింగ్‌ సెల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జె. శశికళ, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ ఎం. మల్లారెడ్డి, డైరెక్టర్‌, సెంటర్‌ ఫర్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ డెవలప్మెంట్‌ డాక్టర్‌ కె. సురేష్‌, డైరెక్టర్‌, ఇంటర్నేషనల్‌ ప్రోగ్రామ్స్‌ డాక్టర్‌ వి. రాములు, డైరెక్టర్‌, సెంటర్‌ ఫర్‌ నేచురల్‌ రిసోర్స్‌ అండ్‌ ఎన్విరాన్మెంట్‌ డాక్టర్‌ కె.పి. వాణి, డైరెక్టర్‌, అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డాక్టర్‌ జి. శ్రీనివాస్‌లు తమ అనుభవాలు, భవిష్యత్‌ ప్రణాళికలను గురించి వివరించారు. ఈ సందర్భంగా గతంలో విశ్వవిద్యాలయ అధికారులుగా పనిచేసిన డాక్టర్‌ జెల్లా సత్యనారాయణ, డి. శివాజీలను సన్మానించారు. వారి సేవల్ని కొనియాడారు.