నిరుద్యోగులకు వ్యవసాయ, అనుబంధ రకాలు దన్నుగా నిలిచాయి
తెలంగాణా రాష్ట్రంలో గత మూడు నెలల్లో నిరుద్యోగ రేటు 6.9 నుంచి 5.7 శాతానికి తగ్గింది.. తయారీ, సేవారంగాల్లో ఉపాధి స్వల్పంగా నెమ్మదించినప్పటికీ వ్యవసాయ, అనుబంధ రంగాలు దన్నుగా నిలిచినట్లు కార్మిక బలగం సర్వే (జులై-సెప్టెంబరు, 2025) నివేదిక వెల్లడించింది. గత మూడు నెలల్లోనే ఈ రంగంలో ఉపాధి పొందిన వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు పేర్కొంది. ఇదే సమయంలో 15-29 ఏళ్ల యువతలో నిరుద్యోగం స్థిరంగా 20.2 శాతంగా (యువతుల్లో 21.7%, యువకుల్లో 19.5%) నమోదైనట్లు వెల్లడించింది. గ్రామీణ యువతలో నిరుద్యోగం 18.0 శాతం ఉంటే.. పట్టణాల్లో 22.7 శాతంగా ఉన్నట్లు తెలిపింది. గ్రామీణ మహిళల్లో నిరుద్యోగ రేటు తక్కువ ఉంటే.. పట్టణ మహిళల్లో ఎక్కువగా ఉంది. నివేదికలోని ముఖ్యాంశాలివి..
రాష్ట్రంలో వ్యవసాయరంగంలో ఉపాధి పొందుతున్నవారు జూన్ నాటికి 32.9% మంది ఉంటే.. ప్రస్తుతం 40.5% ఉన్నారు. వర్షాలు పడటం, సాగు విస్తీర్ణం పెరగడంతో మూడు నెలల్లో ఈ రంగంపై ఆధారపడిన గ్రామీణుల శాతం 50.1 (ఏప్రిల్లో) నుంచి 60.1కి (సెప్టెంబరు నాటికి) చేరింది.
పట్టణాల్లో వ్యవసాయ రంగంపై ఆధారపడిన కార్మికుల వాటా మూడు నెలల క్రితం 4.1% ఉంటే.. ఇటీవల 6.2 శాతానికి చేరింది.
రాష్ట్రంలో తయారీ, క్వారీ, మైనింగ్ రంగాల్లో ఉపాధి తగ్గింది. జూన్ నాటికి ఈ రంగాల్లో 29.1% ఉంటే.. సెప్టెంబరు నాటికి 22.2 శాతానికి పడిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా సేవారంగంలోనూ స్వల్పంగా 38 నుంచి 37.3 శాతానికి తగ్గింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని సేవా రంగాల్లో ఉపాధి రేటు 20.8 నుంచి 21.3 శాతానికి పెరిగింది.
జాతీయ స్థాయిలో పరిశీలిస్తే స్వయంఉపాధి పొందుతున్నవారి సంఖ్య పెరిగింది. జూన్ నాటికి 39% మంది స్వయంఉపాధి పొందుతుండగా.. సెప్టెంబరు నాటికి అది 40.6 శాతానికి చేరింది. పురుషుల్లో 41.3 నుంచి 43.2 శాతానికి పెరిగింది.

