వరి కొయ్యలు తగలబెట్టొద్దు: తుమ్మల
వరి కొయ్యలను తగలబెట్టొద్దని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. అలా తగలబెడితే కలిగే అనర్థాలపై ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం ఖమ్మం వెళ్తూ సూర్యాపేట జిల్లాలో రైతులు వరి కొయ్యలను తగులబెట్టడం చూసి మంత్రి ఆందోళన చెంది వ్యవసాయశాఖ సంచాలకుడితో ఫోన్లో మాట్లాడారు. అనంతరం టేకుమట్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా… రేషన్ షాపుల ద్వారా నాణ్యమైన బియ్యం అందించడానికే కొనుగోలు కేంద్రాల్లో 17 శాతం తేమ నిబంధనను అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రైతుల నుంచి రూ.2,851 కోట్ల విలువైన 12.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. శనివారం ఒక్క రోజే 1.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. ఇప్పటి వరకు 1,64,191 టన్నుల పత్తిని ప్రభుత్వం కొనుగోలు చేసిందని వెల్లడించారు.
ఈరోజు సూర్యాపేట జిల్లా ఐకేపి కేంద్రాన్ని మంత్రి సందర్శించి అక్కడ రైతులతో మాట్లాడి, రైతులకు అవసరమైన ఏర్పాట్లను సమర్ధవంతంగా నిర్వహించాలని, తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంచి ధర లభించడానికి రైతులు ధాన్యాన్ని బాగా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మంత్రి సూచించారు. అలాగే, తూకం సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, తగిన సమయంలో చెల్లింపులు జరిపేలా పర్యవేక్షణ నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు క్షేత్రస్థాయి అధికారులు అందుబాటులో ఉండాలని మంత్రి స్పష్టం చేశారు.

