వండని వంట…. చల్ల మిరపకాయలు

కావాల్సిన పదార్థాలు

  • 1 కిలో పచ్చి మిరపకాయలు
  • 200 గ్రాముల ఉప్పు
  • సరిపడినంత చిక్కటి పుల్లటి మజ్జిగ
  • 1 నిమ్మకాయ రసం

తయారుచేయు విధానం: మరీ కారంగా, మరీ చప్పగా కాకుండా, మోస్తరు కారంగా ఉన్న మిరపకాయలు, సైజు కూడా మధ్యస్థంగా ఉన్నవి ఎంచుకోవాలి.

మిరపకాయలను మధ్యకు సన్నగా చీల్చి, ఒక గిన్నెలో వేసుకోవాలి. వాటి పైన ఉప్పు వేసుకొని కలియ తిప్పి, మిరపకాయలు, మునిగే వరకు మజ్జిగ పోసి కలిపి, పైన ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి.

ఒక రోజు మొత్తం 24 గంటలు నాననిచ్చి, తరువాత ఎండకు ఎండపెట్టాలి. తిరిగి రాత్రికి మళ్ళీ మిగిలి ఉన్న మజ్ౙిగలో నానపెట్టాలి. ఇలా మజ్జిగ అయిపోయే వరకు చెయ్యాలి.

ఒకసారి ఎండ పెట్టి తిరిగి మజ్జిగలో వేసి కలిపేటప్పుడు కొంచెం నిదానంగా మిరపకాయలు విరగకుండా కలపాలి. ఎండకు బాగా ఎండిన తరువాత, గాలి చొరని డబ్బాలో నిలువ చేసుకోవాలి.

ఈ ఎండిన చల్లమిరపకాయలను మధ్య మధ్య ఎండపెడుతూ ఉంటే, చెడిపోకుండా, మెత్త పడకుండా, రెండు సంవత్సరాల వరకు నిలువ ఉంటాయి.

మాములుగా అయితే చల్ల మిరపకాయలు నూనెలో వేయించి, అన్నానికి అంచుకు పెట్టుకొని తింటారు. నూనెలో వేయించకుండా కూడా తినొచ్చు. పుల్ల పుల్లగా, కారం కారంగా బాగుంటాయి.

రచనః అందుకూరి గిరిజ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… సత్తుపిండి

సత్తుపిండిని కేవలం రెండే రెండు పదార్థాలతో తయారు చేస్తారు. తెలంగాణలో సద్దుల బతుకమ్మ పండుగకు కట్టుకుపోయే ‘సద్ది’లో, ఈ సత్తుపిండి ఒకటి.

సత్తుపిండిని, మొక్కజొన్నలను ‘వేపి’ తయారు చేస్తారు.
మన వండని వంటలు కాన్సెప్ట్ ప్రకారం, మొక్కజొన్నలను వేపకుండానే తయారు చేసాను.

కిలో మొక్కజొన్నలను బాగా ఎండబెట్టి, శుభ్రం చ్రేసి, మెత్తగా మర పట్టించాలి.

విసుర్రాయితో విసురుకుంటే, ‘కోల్డ్ విసుర్డ్ పిండి’ వస్తుంది, అది మరీ శ్రేష్టమైన పిండి.

మర(గిర్ని) పట్టిస్తే పిండి ఎక్కువ వేడెక్కుతుంది. ఆ మేరకు జీవశక్తి నష్టపోతుంది. కనుక విసుర్రాయి (తిరుగలి) ప్రతీ ఇంట్లో తప్పకుండా ఉండాలి.

సత్తుపిండి తయారీ విధానం: రెండు కప్పుల మొక్కజొన్న పిండికి, తగినంత ముడిబెల్లాన్ని తీసుకోవాలి. కాస్తా వెడల్పు గిన్నెలో అరకప్పు మంచినీరు తీసుకుని, ఆ నీటిలో బెల్లాన్ని కరిగించాలి. కరిగిన బెల్లపు నీటిలో, మొక్కజొన్న పిండిని బాగా కలిపి, ముద్దలు చేసుకోవాలి. అంతే! వెరీ సింపుల్!

మొక్కజొన్న పిండి సహజ సువాసనతో తియ్యగా ఉంటుంది.

పెద్దలు, పిల్లలు సత్తుపిండిని ఉపాహారంగా తినవచ్చు.

బెల్లం మోతాదు ఎవరి అబిరుచిని బట్టి వారు, కాస్తా ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు.

పిండి తయారుగా ఉంటే, సత్తుపిండి తయారీ నిముషాలలో అవుతుంది. సత్తుపిండిలో ఎండుద్రాక్ష లేదా ఖర్జూర పండ్ల ముక్కలను కూడా కలుపుకోవచ్చు.

పూర్వం ప్రయాణాల్లో సత్తుపిండిని, బెల్లాన్ని వెంట తీసుకుని పొయ్యేవారు. వంటకు వీలుకాని పూట, సత్తుపిండిని తినేవారు.

  • రచన: తుమ్మేటి రఘోత్తమరెడ్డి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

‘పచ్చి టొమాటో’ నిల్వ పచ్చడి తయారీ…

ఓ అరకిలో సేంద్రీయ టొమాటో పండ్లను – కాస్తా దోర పండ్లు అయితే మంచిది – తీసుకుని, శుభ్రమైన గుడ్డతో తుడిచి, చిన్న ముక్కలుగా కోసి, తగినంత ఉప్పు కారం పసుపు వేసి కలుపుకోవాలి.

తగినన్ని ఆవాలు, జీలకర్ర రోట్లో వేసి మెత్తగా నూరి, టొమాటో ముక్కలకు కలపాలి. తగినన్ని వెల్లుల్లి పాయలు కూడా కచ్చా పచ్చాగా దంచి టొమాటో ముక్కల్లో కలపాలి.

ఉప్పు కారం తగినంత ఉన్నదీ లేనిదీ చూసుకుని, అవసరాన్ని బట్టి చేర్చుకోవాలి. అందుకని ముందుగానే టొమాటో ముక్కల మోతాదును బట్టి, కొంత తక్కువ ఉప్పూ, కారం, కలుపుకోవాలి.

ఈ ఉప్పు కూడా రాక్ సాల్ట్ అయితే ఉత్తమం. అలాగే కారం కూడా సేంద్రీయ వ్యవసాయ మిరపకాయల కారం అయితే బాగుంటుంది.

టొమాటో ముక్కల్లో అన్నిటినీ కలిపి, స్టెయిన్ లెస్ స్టీల్ గిన్నెలో కానీ, పింగాణీ గిన్నెలో కానీ వేసుకోవాలి. రోజుకు రెండు సార్లు నెమ్మదిగా గరిటెతో కలుపుకోవాలి. తరువాత తగిన సీసాలో పెట్టుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
పోపు పెట్టుకోవడం అవసరం లేదు.

ఇంకా అదనంగా ఏమైనా పదార్థాలను చేర్చాలని అనుకునే వారు చేర్చుకోవచ్చు. అల్లం ఇంగువ వగైరా.
వేడి వేడి అన్నంలో పచ్చడి కలుపుకుని తినవచ్చు. అవసరం అనుకున్న వారు కాస్తా నెయ్యి లేదా గానుగ నూనె వేసి కలుపుకుని కూడా తినవచ్చు. ఆవ ఘాటుతో రుచి బాగుంటుంది.

నూనె వాడకం తగ్గించాలి.

నిల్వ పచ్చళ్లలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కనుక, నీడపట్టు పనులు చేసేవారు తక్కువ తినడం ఉత్తమం.
బయటి వాతావరణంలో ఉన్నా పచ్చడి బాగానే ఉంటుంది. కాకపోతే పచ్చడి పైన కాస్తా గానుగ సేంద్రీయ నువ్వుల నూనె పొయ్యడం బెటర్.

పండు దోస పండ్లతో కూడా ఇలాగే నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు. . కాకపోతే పులుపు కోసం నిమ్మరసం లేదా మామిడి వరుగు పొడి వాడవచ్చు.

  • తుమ్మేటి రఘోత్తమ రెడ్డి
Read More

వండని వంట… తీపి రాగి పిండి

పదార్థాలను వేపకుండా, ఉడికించకుండా, మాడ్చకుండా, పచ్చి వాటినే కూరలు, పచ్చళ్ళు… ఆహారంగా తయారు చేసుకోవడం వండని వంటలు. వీలైనంత వరకు పచ్చి పదార్థాలను, మనకు నచ్చిన విధంగా ప్రిపేర్ చేసుకుని ‘అమృతాహారం’ తినడం మంచిది. రుచికరమైన బలవర్ధకమైన సువాసనభరితమైన జీవశక్తి పూరితమైన ‘వండని వంట’ తీపి రాగిపిండి తయారీ ఇలా….

అరకిలో రాగులు, అరకిలో పెసలు లేదా మినుముల పిండి ప్రధానంగా అవసరం ఉంటుంది. రాగులను పెసలను పచ్చి వాటినే పిండి పట్టించాలి. వేపకూడదు (మర పట్టించడం కంటే, విసుర్రాయితో విసురుకోవడం మంచిది.పిండిని మర పట్టిస్తే, అధిక ఉష్ణోగ్రతకు గురౌతుంది)

పచ్చి వాసనే, జీవశక్తికి నిదర్శనం!

మొత్తం కిలో రాగులు, పెసలు (మినుములు) పొడిలో, సుమారు వంద గ్రాముల నెయ్యిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి.

ఆ పిండి మిశ్రమంలో ఎండుకొబ్బరి పొడి, వేరుశనగ పొడి, నువ్వుల పొడి (ఒక్కొక్కటి వంద గ్రాములు-పచ్చిపొడులు)

జీడిపప్పు, బాదాంపప్పు కూడా కాస్తా చేర్చుకోవచ్చు. వాటిని కూడా పొడి చేసుకుని కలపాలి. చివరికి ఎండుద్రాక్ష పండ్లను కూడా తగినన్ని కలుపుకోవాలి.

ఈ మొత్తం పొడుల మిశ్రమానికి సమానంగా, ముడిచక్కెర పొడిని లేదా ముడిబెల్లపు తురుమును కలిపి, యాలకుల పొడిని కూడా కలపాలి. ఖర్ౙూర పండ్లను చిన్న చిన్న ముక్కలు చేసి కలుపుకోవచ్చు. అన్ని రకాల ఎండుపండ్ల ముక్కలను కూడా కలుపుకోవచ్చు.

అంతే! రుచికరమైన బలవర్ధకమైన సువాసనభరితమైన జీవశక్తిపూరితమైన ‘వండని వంట’ సిద్దం అవుతుంది.
నెయ్యి కలుపుతాం కనుక, బయట కూడా నిల్వ ఉంటుంది.

ప్రతీ పదిహేను రోజులకు ఒకసారి తగినంత తయారు చేసుకోవచ్చు. ప్రయాణాలు చేసే సమయంలో ప్రధాన ఆహారంగా కూడా తినవచ్చు.

  • తుమ్మేటి రఘోత్తమరెడ్డి
Read More