తెలంగాణలో ప్రకృతి వ్యవసాయం
480 సమూహాల్లో కేంద్ర ప్రభుత్వ పథకం అమలు
2025-26లో 60 వేల ఎకరాల్లో సాగు
కేంద్ర ప్రభుత్వ జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకాన్ని (ఎన్ఎంఎన్ఎఫ్) తెలంగాణలో రెండేళ్ల పాటు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంప్రదాయ వ్యవసాయాన్ని శాస్త్రీయ దృక్పథంతో పునరుద్ధరించడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతూ రైతు కుటుంబాలకు, వినియోగదారులకు రసాయనాల బెడద లేని ఆరోగ్యకర ఆహారాన్ని అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ వచ్చే రెండేళ్ల కాలానికి రూ.2,481 కోట్లతో ఎన్ఎంఎన్ఎఫ్ పథకానికి రూపకల్పన చేసింది. కేంద్ర ప్రభుత్వం 60 శాతం వాటా కింద సుమారు రూ.1584 కోట్లు ఖర్చు చేయనుండగా, రాష్ట్రాలు 40 శాతం వాటా కింద సుమారు రూ. 897 కోట్లు భరించాలి. రాష్ట్రంలో 2025-26 సంవత్సరంలో 60 వేల ఎకరాల్లో ఈ పథకం కింద సాగు చేపట్టనున్నారు. ఒక్కో సమూహం (క్లస్టర్)లో 125 ఎకరాల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 480 సమూహాల్లో ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
అమలు ఇలా…: సేంద్రియ వ్యవసాయానికి అవసరమయ్యే సహజ ఉత్పత్తులను రైతులకు అందుబాటులో ఉంచేందుకు.. అవసరాన్ని బట్టి జీవాధార వనరుల కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలోని కృషి విజ్ఞాన్ కేంద్రాలు, వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాలు, రైతుల పొలాల్లో దాదాపు 200 వరకు సహజ పద్ధతుల నమూనా వ్యవసాయ క్షేత్రాలు నెలకొల్పుతారు. ప్రతి సమూహంలో 8 మంది రైతులకు శిక్షణ ఇస్తారు. క్లస్టర్లలో కొత్త పథకంపై అవగాహన కల్పించేందుకు, రైతుల మధ్య సహకారం పెంపొందించేందుకు, ఇతరత్రా సాయం అందించేందుకు 500 మంది సాగు సహాయకులను నియమిస్తారు. జిల్లా, బ్లాక్, గ్రామపంచాయతీల స్థాయిల్లో రైతుబజార్లు, మార్కెట్ కమిటీలు, డిపోలతో అనుసంధానం ద్వారా సహజ వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తారు. కేంద్రం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వపరంగా రైతులను అన్నివిధాలా ప్రోత్సహిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వారికి విత్తనాలు, పరికరాలు అందిస్తామని పేర్కొన్నారు.


