పచ్చడి కోసం కొంచెం గట్టిగా వుండే దోసకాయను తీసుకోవాలి!
కావలసిన పదార్థాలు: రెండు దోసకాయలు, మూడు నాలుగు పచ్చి మిరప కాయలు, నాలికకు కొంచెం చురుక్కు మనిపించాలనుకునే వారు ఇంకా ఒక మిరప కాయను వేసుకోవచ్చు. నాలుగు ఎల్లిపాయ రెబ్బలు (వెల్లుల్లి), కొంచెం జిలుకర (జీల కర్ర) రుచికి సరిపడ గల్లుప్పు (రాతి ఉప్పు లేదా దొడ్డుప్పు) ఇంతే సింపుల్.
చేసే విధానం: దోస కాయను చెక్కు తీసివేయాలి. తీయకపోయినా పర్వాలేదు. వారి వారి ఇష్టానుసారం చేసుకోవచ్చు. తీయకుంటేనే మంచిది. దోసకాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి, అందులో పచ్చి మిరపకాయ ముక్కలు, జిలుకర, ఎల్లి పాయ, ఉప్పు కలిపి రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి లేదా మిక్సిలో వేసుకుని ఒక్కసారి తిప్పితే చాలు, తొక్కు రెడీ అయిపోతుంది. ఉడుకుడుకు (వేడి వేడి) అన్నంలో కలుపుకొని తినడమే ఆలస్యం. చెయ్యడం చాలా సులభం. ఈ దోసకాయ పచ్చడిని నిముషాలలో చేసుకోవచ్చు. ఏ రోజు చేసుకున్నది, ఆ రోజే వాడుకోవడం మంచిది. – సామల రాజవర్థన్
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి
అన్నిటినీ శుభ్రంగా నీళ్లతో కడిగి, తేమ లేకుండా నీడన ఆరబెట్టాలి.
మొదట చింతపండు, జీలకర్రలను రోట్లో వేసి మెత్తగా నూరి, అందులో క్యారెట్ ముక్కలు వేసి దంచి, అందులో పొట్టు తీసిన ఉల్లిపాయ, వెల్లుల్లి పాయలను వేసుకొని కాస్తా బరుకుగా దంచుకోవాలి.
ఉప్పు, కారం ఎవరి అబిరుచి ప్రకారం వారు కలుపుకోవాలి.
క్యారెట్ పచ్చడిలో ఉప్పు తక్కువ పడుతుంది. కనుక ఉప్పును తక్కువ వేసుకోవాలి.
పచ్చడిలో నూనె పోపు అవసరం లేదు. ఏ రోజుకు ఆ రోజు తయారు చేసుకుని వాడుకోవచ్చు. తాజాగా, సహజ సువాసనలతో రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నం రొట్టెలు దోశెల్లో కలిపి తినడానికి రుచికరంగా ఉంటుంది.
పచ్చి పెసరపప్పు కానీ, పెసర్లు కానీ, మొలకెత్తిన పెసర్లు కానీ, పొట్టు పెసరపప్పు కానీ, వీటిలో ఏదైనా వాడుకోవచ్చు. పెసర్లు అయితే, నానడానికి టైం పడుతుంది. మొలకెత్తడానికి ఇంకా టైం పడుతుంది. వీటితో చేసుకోవాలంటే ముందుగా ప్రణాళిక ప్రకారం చేసుకోవాలి. అదే పొట్టు పెసరపప్పు కానీ, పెసరపప్పుతో కానీ అయితే అరగంటలో అయిపోతుంది.
దీనికి కావలసిన పదార్థాలు: పెసరపప్పు (ఏ రకమైన పప్పు అయినా, మీ ఇష్టం) ఒక చిన్న కప్పు. ఎండుమిర్చి (ఎవరి రుచి ప్రకారం వారు వేసుకోవాలి) ఐదారు.ఉప్పు – రాళ్ళ ఉప్పు (సముద్రపు ఉప్పు కానీ పింక్ రాక్ సాల్ట్ కానీ) తగినంత. నిమ్మరసం కానీ, పుల్లటి మామిడి కాయ కానీ రుచికి తగినంత.
ఒక టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు ఇంగువ అన్ని కలిపి నీళ్ళు లేకుండా రోట్లో కానీ మిక్సీలో కానీ కచ్చాపచ్చాగా నూరుకోవాలి. మరీ మెత్తగా సుద్దలాగా నూరుకోకూడదు. మామిడికాయ అయితే, పప్పుతో పాటు వేసుకుని రుబ్బుకోవాలి. నిమ్మరసం అయితే ఆఖరున పిండుకోవాలి.
పండిన టొమాటోలు రెండు, మూడు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ సన్నగా తరిగి, కొంచెం కొత్తిమీర తరుగుతో సహా అన్నీ ఒక గిన్నెలో వేసుకుని, ఉప్పు వేసి చేత్తో గట్టిగా పిసుకుతున్నట్లు కలిపితే, అన్నీ చక్కగా కలిసిపోతాయి… వేడి వేడి అన్నంలో అయితే భలే ఉంటుంది!
పైన చెప్పిన అన్నీ పెరుగులో కలిపి కూడా తినవచ్చు. రైతాలా ఉంటుంది.
కూర దోసకాయ ముక్కలు సన్నగా తరిగి, పైన చెప్పిన పదార్థాలు అన్నీ కలిపినా, అది కూడా ఒక కూర లాగానే ఉంటుంది.
పైన చెప్పిన అన్ని పదార్థాలు మరియు కీర దోస ముక్కలు కలిపినా, అది కూడా కూర లాగా తినవచ్చు.
ఎండుమిరప కాయలు, ఉప్పు ..చింత పండు గుజ్జులో కలిపి తింటే బావుంటుంది. మనకు అనుకూలంగా ఉల్లిగడ్డ తరిగి వేసుకోవచ్చు. కొంచెం నువ్వుల నూనె కానీ, నెయ్యి కానీ కలుపుకోవచ్చు. లేక పోయినా చాలా బావుంటుంది.
పచ్చి మిరప కాయలు, ఉప్పు, కొంచెం చింత పండు మంచిగా నూరుకుని, కూర దోసకాయలు ముక్కలుగా తరిగి దానిలో వేసి కచ్చా పచ్చాగా దంచి, ఒక పచ్చడి లాగ తినొచ్చు.
మనం పచ్చిగా తినగలిగే అన్ని కూరగాయ ముక్కలు (క్యారెట్, దోసకాయ, టొమాటో, ఉల్లి, పచ్చిమిర్చి, కొత్తి మీర) అన్ని ఉప్పుతో కలిపి చేత్తో గట్టిగా కలిపి పెరుగుతో అయినా, లేకుండా అయినా తినొచ్చు. పల్లీల పొడి, పచ్చి కొబ్బరి తురుము ఆప్షనల్. ఇవన్నీ… సైడ్ డిష్ లాగ తినొచ్చు….లేదా ఎమర్జెన్సీ కూరలుగా కూడా పనికొస్తాయి.
ఓ అరకిలో సేంద్రీయ టొమాటో పండ్లను – కాస్తా దోర పండ్లు అయితే మంచిది – తీసుకుని, శుభ్రమైన గుడ్డతో తుడిచి, చిన్న ముక్కలుగా కోసి, తగినంత ఉప్పు కారం పసుపు వేసి కలుపుకోవాలి.
తగినన్ని ఆవాలు, జీలకర్ర రోట్లో వేసి మెత్తగా నూరి, టొమాటో ముక్కలకు కలపాలి. తగినన్ని వెల్లుల్లి పాయలు కూడా కచ్చా పచ్చాగా దంచి టొమాటో ముక్కల్లో కలపాలి.
ఉప్పు కారం తగినంత ఉన్నదీ లేనిదీ చూసుకుని, అవసరాన్ని బట్టి చేర్చుకోవాలి. అందుకని ముందుగానే టొమాటో ముక్కల మోతాదును బట్టి, కొంత తక్కువ ఉప్పూ, కారం, కలుపుకోవాలి.
ఈ ఉప్పు కూడా రాక్ సాల్ట్ అయితే ఉత్తమం. అలాగే కారం కూడా సేంద్రీయ వ్యవసాయ మిరపకాయల కారం అయితే బాగుంటుంది.
టొమాటో ముక్కల్లో అన్నిటినీ కలిపి, స్టెయిన్ లెస్ స్టీల్ గిన్నెలో కానీ, పింగాణీ గిన్నెలో కానీ వేసుకోవాలి. రోజుకు రెండు సార్లు నెమ్మదిగా గరిటెతో కలుపుకోవాలి. తరువాత తగిన సీసాలో పెట్టుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. పోపు పెట్టుకోవడం అవసరం లేదు.
ఇంకా అదనంగా ఏమైనా పదార్థాలను చేర్చాలని అనుకునే వారు చేర్చుకోవచ్చు. అల్లం ఇంగువ వగైరా. వేడి వేడి అన్నంలో పచ్చడి కలుపుకుని తినవచ్చు. అవసరం అనుకున్న వారు కాస్తా నెయ్యి లేదా గానుగ నూనె వేసి కలుపుకుని కూడా తినవచ్చు. ఆవ ఘాటుతో రుచి బాగుంటుంది.
నూనె వాడకం తగ్గించాలి.
నిల్వ పచ్చళ్లలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కనుక, నీడపట్టు పనులు చేసేవారు తక్కువ తినడం ఉత్తమం. బయటి వాతావరణంలో ఉన్నా పచ్చడి బాగానే ఉంటుంది. కాకపోతే పచ్చడి పైన కాస్తా గానుగ సేంద్రీయ నువ్వుల నూనె పొయ్యడం బెటర్.
పండు దోస పండ్లతో కూడా ఇలాగే నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు. . కాకపోతే పులుపు కోసం నిమ్మరసం లేదా మామిడి వరుగు పొడి వాడవచ్చు.
చేపల పెంపకంలో అధిక ఉత్పత్తి సాధించడానికి నాణ్యమైన చేప పిల్లలు, సమతుల్య ఆహారం, సరైన నీటి నాణ్యత మరియు వ్యాధి నియంత్రణతో పాటు చెరువులో సహజ ఆహార వనరుల లభ్యత కూడా ఎంతో ముఖ్యమైనది. ఈ సహజ ఆహార వనరులలో అత్యంత ప్రాధాన్యత కలిగినవి ప్లవకాలు. చేపల చెరువులో ప్లవకాల ఉత్పత్తి సమృద్ధిగా ఉన్నప్పుడు చేపల పెరుగుదల మెరుగుపడటంతో పాటు అనుబంధ ఆహార వ్యయం కూడా తగ్గుతుంది. అందువల్ల ప్లవకాల ఉత్పత్తి చేపల సాగులో కీలకమైన అంశంగా పరిగణించబడుతుంది.
ప్లవకాలు అంటే ఏమిటి? నీటిలో స్వేచ్ఛగా తేలియాడే సూక్ష్మ జీవులను ప్లవకాలు అంటారు. ఇవి కంటికి కనిపించని స్థాయిలో చిన్నవిగా ఉండి చెరువు జీవావరణ వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. చేప పిల్లల నుంచి పెద్ద చేపల వరకు వివిధ దశల్లో ఇవి సహజ ఆహారంగా ఉపయోగపడతాయి.
ప్లవకాల రకాలు చెరువులలో ప్రధానంగా రెండు రకాల ప్లవకాలు కనిపిస్తాయి
వృక్ష ప్లవకాలు (ఫైటోప్లాంక్టాన్) సూర్యరశ్మి సహాయంతో కిరణజన్య సంయోగక్రియ జరిపి తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునే సూక్ష్మ మొక్కల సమూహాన్ని వృక్ష ప్లవకాలు అంటారు.
జంతు ప్లవకాలు (జూప్లాంక్టాన్) వృక్ష ప్లవకాలపై ఆధారపడి జీవించే సూక్ష్మ జీవులను జంతు ప్లవకాలు అంటారు. ఇవి చేప పిల్లలకు అత్యంత పోషకమైన సహజ ఆహారం.
చేపల చెరువులలో ప్లవకాల ప్రాముఖ్యత ప్లవకాలు చేపల చెరువులలో ఆహార గొలుసుకు పునాది వంటివి. చేపల పెరుగుదల, జీవన శాతం, ఆరోగ్యం మరియు ఉత్పత్తి స్థాయిని ప్రభావితం చేసే ముఖ్యమైన జీవ వనరులు. చెరువులో తగిన స్థాయిలో ప్లవకాలు ఉంటే చేపల పెరుగుదల వేగవంతమవుతుంది. అదనంగా రైతులు అనుబంధ ఆహారంపై చేసే ఖర్చు కూడా తగ్గుతుంది.
ప్లవకాల ఉత్పత్తికి అవసరమైన పరిస్థితులు ప్లవకాల ఉత్పత్తి చెరువు నేల సారం, నీటి నాణ్యత, సూర్యరశ్మి లభ్యత మరియు ఎరువుల వినియోగంపై ఆధారపడి ఉంటుంది. చెరువు తయారీ సమయంలో భూసార పరీక్షలు నిర్వహించి అవసరమైన మేరకు పోషకాలను అందించడం ద్వారా ప్లవకాల పెరుగుదలను ప్రోత్సహించవచ్చు.
ప్లవకాల ఉత్పత్తిలో ఎరువుల పాత్ర చేపల చెరువులలో సహజ ఆహారమైన వృక్ష ప్లవకాలు మరియు జంతు ప్లవకాలు ఉత్పత్తిని పెంచడంలో ఎరువులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వృక్ష ప్లవకాల పెరుగుదలకు అవసరమైన నత్రజని, భాస్వరం మరియు పొటాషియం వంటి పోషకాలను అందించడం వల్ల ప్లవకాల ఉత్పత్తి వేగంగా ప్రారంభమవుతుంది. జంతు ప్లవకాల ఉత్పత్తి కోసం పశువుల పేడ, కోళ్ల పెంట వంటి సేంద్రీయ ఎరువులను వినియోగిస్తారు. చెరువు తయారు చేసుకునే సమయంలో హెక్టారుకు 5-10 టన్నుల పశువుల పేడ లేదా 2-3 టన్నుల కోళ్ల పెంట వేయడం ద్వారా సూక్ష్మజీవుల పెరుగుదల ప్రోత్సహించబడి జంతు ప్లవకాల ఉత్పత్తి పెరుగుతుంది. అదనంగా జింక్, మాంగనీస్, కోబాల్ట్, ఇనుము వంటి సూక్ష్మ పోషకాలు ప్లవకాల వృద్ధిని మెరుగుపరుస్తాయి. ఎరువులను శాస్త్రీయ మోతాదులో సమతుల్యంగా వినియోగించడం ద్వారా చెరువులో సహజ ఆహార లభ్యత పెరిగి చేపల పెరుగుదల, ఆరోగ్యం మరియు ఉత్పాదకత మెరుగుపడతాయి. అయితే అధిక మోతాదులో ఎరువులు ఉపయోగించడం వల్ల నీటి నాణ్యత దెబ్బతినే అవకాశం ఉన్నందున అవసరానికి అనుగుణంగా మాత్రమే వినియోగించాలి
వృక్ష ప్లవకాల వల్ల కలిగే ప్రయోజనాలు వృక్ష ప్లవకాలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా నీటిలో ప్రాణవాయువును ఉత్పత్తి చేస్తాయి. చేపలకు సహజ ఆహారాన్ని అందించడంతో పాటు నీటి నాణ్యతను మెరుగుపరుస్తాయి. నీటిలోని కార్బన్ డైఆక్సైడ్‌ను గ్రహించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుతాయి. హానికరమైన కొన్ని సూక్ష్మజీవుల పెరుగుదలను కూడా నియంత్రించడంలో సహాయపడతాయి.
జంతు ప్లవకాల వల్ల కలిగే ప్రయోజనాలు జంతు ప్లవకాలలో ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉంటాయి. చేప పిల్లల ప్రారంభ దశ పెరుగుదలలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. చెరువులో సమృద్ధిగా జంతు ప్లవకాలు ఉండటం వల్ల చేపల ఆరోగ్యం మెరుగుపడి మరణాల శాతం తగ్గుతుంది.
నీటి నాణ్యత పై ప్లవకాల ప్రభావం పగటి సమయంలో ప్లవకాలు కిరణజన్య సంయోగక్రియ జరిపి నీటిలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతాయి. దీని వలన చేపలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. పి.హెచ్. విలువలను సమతుల్యంగా ఉంచడంలో కూడా ప్లవకాల పాత్ర ఎంతో ముఖ్యమైనది. తగిన స్థాయిలో ప్లవకాలు ఉన్నప్పుడు నీటి నాణ్యత మెరుగ్గా ఉంటుంది.
ప్లవకాల బ్లూమ్స్ – కారణాలు మరియు ప్రభావాలు అధిక మోతాదులో ఎరువులు వాడటం, నీటిలో పోషకాలు ఎక్కువగా చేరడం వంటి కారణాల వల్ల ప్లవకాల బ్లూమ్స్ ఏర్పడతాయి. ఈ సమయంలో నీరు ముదురు ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. బ్లూమ్స్ కారణంగా రాత్రి సమయంలో ఆక్సిజన్ స్థాయిలు ప్రమాదకరంగా తగ్గిపోవచ్చు. ఇది చేపల ఆరోగ్యానికి హానికరం.
ప్లవకాల క్రాష్ – కారణాలు మరియు నివారణ చర్యలు వాతావరణ మార్పులు, అధిక ప్లవకాల సాంద్రత లేదా నీటి నాణ్యతలో ఆకస్మిక మార్పుల వల్ల ప్లవకాల క్రాష్ సంభవిస్తుంది. ఈ పరిస్థితిలో నీరు తేటగా మారి ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. చేపలు ఒత్తిడికి గురై వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. అందువల్ల చెరువులో నీటి నాణ్యతను నిరంతరం పరిశీలిస్తూ సమతుల్య ఎరువుల నిర్వహణ చేపట్టాలి.
ప్లవకాల సాంద్రతను అంచనా వేసే పద్ధతులు సెచి డిస్క్ మరియు ప్లాంక్టాన్ నెట్ ద్వారా ప్లవకాల సాంద్రతను అంచనా వేయవచ్చు. సాధారణంగా సెచి డిస్క్ దృశ్య లోతు 20-30 సెం.మీ. మధ్య ఉన్నప్పుడు చెరువులో ప్లవకాల స్థాయి అనుకూలంగా ఉందని భావిస్తారు.
ప్లవకాల నిర్వహణ లో చేపల రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు -చెరువు నేల భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలి.
ఎరువులను విడతల వారీగా వేయాలి.
నీటి రంగు మరియు పారదర్శకతను క్రమం తప్పకుండా పరిశీలించాలి.
ప్లవకాల బ్లూమ్స్ ఏర్పడినప్పుడు నీటి మార్పిడి చేపట్టాలి.
ఆక్సిజన్ కొరత లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి.
ముగింపు చేపల చెరువులలో ప్లవకాల ఉత్పత్తి విజయవంతమైన చేపల పెంపకానికి మూలాధారం. ప్లవకాలు చేపలకు సహజ ఆహారాన్ని అందించడమే కాకుండా నీటి నాణ్యతను మెరుగుపరచడం, ఆక్సిజన్ ఉత్పత్తి చేయడం మరియు చెరువు జీవావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి చేపల రైతులు శాస్త్రీయ పద్ధతులను అనుసరించి ప్లవకాల ఉత్పత్తి మరియు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించినట్లయితే అధిక దిగుబడులు, తక్కువ ఉత్పత్తి వ్యయం మరియు మెరుగైన లాభాలను పొందగలరు.
డాక్టర్. జి. గణేష్, మత్స్య శాస్త్రవేత్త కృషి విజ్ఞాన కేంద్రం, పి. వి. నరసింహ రావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం, మామునూర్, వరంగల్ జిల్లా-506 166. ph; 6281836891
పదార్థాలను వేపకుండా, ఉడికించకుండా, మాడ్చకుండా, పచ్చి వాటినే కూరలు, పచ్చళ్ళు… ఆహారంగా తయారు చేసుకోవడం వండని వంటలు. వీలైనంత వరకు పచ్చి పదార్థాలను, మనకు నచ్చిన విధంగా ప్రిపేర్ చేసుకుని ‘అమృతాహారం’ తినడం మంచిది. రుచికరమైన బలవర్ధకమైన సువాసనభరితమైన జీవశక్తి పూరితమైన ‘వండని వంట’ తీపి రాగిపిండి తయారీ ఇలా….
అరకిలో రాగులు, అరకిలో పెసలు లేదా మినుముల పిండి ప్రధానంగా అవసరం ఉంటుంది. రాగులను పెసలను పచ్చి వాటినే పిండి పట్టించాలి. వేపకూడదు (మర పట్టించడం కంటే, విసుర్రాయితో విసురుకోవడం మంచిది.పిండిని మర పట్టిస్తే, అధిక ఉష్ణోగ్రతకు గురౌతుంది)
పచ్చి వాసనే, జీవశక్తికి నిదర్శనం!
మొత్తం కిలో రాగులు, పెసలు (మినుములు) పొడిలో, సుమారు వంద గ్రాముల నెయ్యిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి.
ఆ పిండి మిశ్రమంలో ఎండుకొబ్బరి పొడి, వేరుశనగ పొడి, నువ్వుల పొడి (ఒక్కొక్కటి వంద గ్రాములు-పచ్చిపొడులు)
జీడిపప్పు, బాదాంపప్పు కూడా కాస్తా చేర్చుకోవచ్చు. వాటిని కూడా పొడి చేసుకుని కలపాలి. చివరికి ఎండుద్రాక్ష పండ్లను కూడా తగినన్ని కలుపుకోవాలి.
ఈ మొత్తం పొడుల మిశ్రమానికి సమానంగా, ముడిచక్కెర పొడిని లేదా ముడిబెల్లపు తురుమును కలిపి, యాలకుల పొడిని కూడా కలపాలి. ఖర్ౙూర పండ్లను చిన్న చిన్న ముక్కలు చేసి కలుపుకోవచ్చు. అన్ని రకాల ఎండుపండ్ల ముక్కలను కూడా కలుపుకోవచ్చు.
అంతే! రుచికరమైన బలవర్ధకమైన సువాసనభరితమైన జీవశక్తిపూరితమైన ‘వండని వంట’ సిద్దం అవుతుంది. నెయ్యి కలుపుతాం కనుక, బయట కూడా నిల్వ ఉంటుంది.
ప్రతీ పదిహేను రోజులకు ఒకసారి తగినంత తయారు చేసుకోవచ్చు. ప్రయాణాలు చేసే సమయంలో ప్రధాన ఆహారంగా కూడా తినవచ్చు.
ఆహారంలో మరింత ఎక్కువగా కొర్రలు, రాగులు, సజ్జలు, అరికెలు వంటి తృణధాన్యాలను వినియోగించేందుకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లోని మిల్లెట్ రీసెర్చ్ ల్యాబ్ విస్తృతంగా పరిశోధనలను చేస్తోంది. వాతావరణ మార్పులకు తట్టుకునే, అధిక పోషక విలువలు కలిగిన, రైతులకు గిట్టుబాటు కలిగించే కొత్త వంగడాలను ఇక్కడి శాస్త్రవేత్తలు, పరిశోధక విద్యార్థులు సృష్టిస్తున్నారు. ఆచార్యులు డా. ముతమిళవరసన్ నేతృత్వంలోని విద్యార్థులు కొర్రల్లో పోషక పదార్థాల శోషణ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు జన్యు ఆధారిత అధ్యయనాలు సత్ఫలితాలిస్తున్నాయి. దేశవిదేశాలలో సేకరించిన 156 కొర్ర రకాలపై విశ్లేషణలు చేసి తక్కువ ఫైటిక్ యాసిడ్ కలిగిన వాటిని అభివృద్ధి చేశారు. ల్యాబ్‌కు సమీపంలోని ఎకరం భూమిలో కొత్తగా సృష్టించిన కొర్ర వంగ డాలను పండించి ఫలితాలను సాధించారు. వీరి పరిశోధనలకు కేంద్ర సంస్థలు రూ. 5 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాయి.
జావ.. దోసెలు.. ఉప్మా.. బియ్యం.. మినపగుళ్లతోనే కాదు. కొర్రలతోనూ దోసెలు చేసుకుని తినొచ్చంటూ తృణధాన్యాల పరిశోధన ప్రయోగశాల ప్రతినిధులు చెబుతున్నారు. దోసెలతోపాటు ఉప్మా, జావ కూడా తయారు చేస్తున్నారు. ప్రత్యేకమైన రుచిని పరిచయం చేసేందుకు కొన్ని రెస్టారెంట్లలో సొంతంగా తయారు చేసి ఇస్తున్నారు. మిల్లెట్ ఆధారిత ఆహార ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తృణధాన్యాల్లో అధిక ఫైబర్, ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు ఉండడంతో సమతుల్య ఆహారంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని వివరిస్తున్నారు. జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొర్రలు, రాగులు, సజ్ౙలు, అరికెల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.
రైతులకు ఉచితంగా వంగడాలు కొర్రలు ఎక్కువగా తింటే జీర్ణం కాదని అపోహలున్నాయి. జన్యుపరమైన అంశాలను పరిశీలిస్తే కొర్రల్లో ఫైటిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఈ యాసిడ్ జీర్ణక్రియను స్వల్పంగా మందగిస్తుంది. అందుకే చాలామంది ఆహారంగా తినేందుకు ఇష్టపడటం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు కొత్త రకం కొర్రల వంగడాలను రైతులతో సాగు చేయించాలని పరిశోధకులు నిర్ణయించారు. రెండు, మూడు సీజన్ల వరకూ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉచితంగా కొత్త వంగడాలను పంపిణీ చేయించనున్నారు.
బియ్యంలో అధికంగా కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. సులభంగా ఎవరైనా తింటారు. పైగా తెలుగు రాష్ట్రాలు సహా మరికొన్ని రాష్ట్రాల్లో పేదలకు ఉచితంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లబ్ధిదారులకు అందిస్తున్నాయి. వారు కొర్రలు కొని వండుకుని ఆహారంగా తినేందుకు ఇష్టపడటం లేదు. అందుకే ఆయా రాష్ట్రాల్లో అల్పాహారంగా తృణధాన్యాలను ఎంపిక చేసుకోవాలని అభ్యర్థించనున్నారు.