సహకార శాఖ మరియు ఉద్యానశాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష
సిద్దిపేట జిల్లా, నర్మెట్టలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, మే నెలాఖరు వరకు ఆయిల్ పాం గెలల ప్రాసెసింగ్ ప్రారంభించాలని, టిజి ఆయిల్ ఫెడ్‌లో అంతర్జాతీయ స్థాయి కంపెనీలలో ఉండే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని ఈ రోజు సచివాలయంలో సహకార శాఖ మరియు ఉద్యానశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గద్వాల జిల్లా బీచుపల్లి ఆయిల్ పాం ఫ్యాక్టరీ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు కూడా చర్యలు తీసుకోవాలన్నారు.
టిజి ఆయిల్ ఫెడ్‌ను అంతర్జాతీయ స్థాయిలో ఉన్న సంస్థల మాదిరిగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ఆయిల్ ఫెడ్ సంస్థలోని ఫ్యాక్టరీ, నర్సరీ, ప్లాంటేషన్, ఫైనాన్స్, మార్కెటింగ్ మరియు ఇతర విభాగాల్లో అత్యంత నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించి, సంస్థను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. మార్చి నాటికి ఆయిల్ పాం కంపెనీలు తమ నిర్దేశిత ప్లాంటేషన్ లక్ష్యాన్ని పూర్తి చేయించాలని డైరెక్టర్ గారికి సూచించారు. లక్ష్యాన్ని పూర్తి చేయనివారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సహకార సంఘాల నిర్వహణపై దృష్టి పెట్టాలని, గడువు ముగిసిన అన్ని సహకార సంఘాల ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు సరిచేసి సిద్ధంగా ఉంచాలని మంత్రిగారు అధికారులను ఆదేశించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న విచారణలను త్వరగా పూర్తి చేసి, తేలిన మొత్తాలను వెంటనే రికవరీ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో వ్యవసాయ సహకారశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, హార్టికల్చర్ డైరెక్టర్ శ్రీమతి యాస్మిన్ బాషా, సహకార శాఖ డైరెక్టర్ ఉదయ్ కుమార్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

