120 రోజుల్లోనే కంది పంట

  • ఏటా మూడు పంటలు.. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి
  • కొత్త వంగడాన్ని ఆవిష్కరించిన ఇక్రిశాట్‌

కందుల ఉత్పత్తిలో స్వావలంబన సాధించే దిశగా కొత్త వంగడాన్ని ఆవిష్కరించింది హైదరాబాద్‌లోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్‌). 120 రోజుల్లోనే పంట చేతికి రావడం, ఏడాదిలో మూడు పంటలు పండించుకునే అవకాశం ఉండడం.. చీడపీడలను, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవడం ఈ వంగడం ప్రత్యేకతలు. ప్రస్తుత రకాలు వర్షాకాలంలోనే సాగుకు అనుకూలమైనవి. 6 నెలల పంటకాలంతో ఎకరాకు గరిష్ఠంగా 6 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే ఇస్తున్నాయి. కొత్త వంగడం ఎకరాకు 10 క్వింటాళ్ల మేర దిగుబడి ఇస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ‘ఐసీపీవీ 25444’ వంగడాన్ని ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌ హిమాన్ష్‌ పాఠక్‌ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ‘యాక్సిలరేటెడ్‌ క్రాప్‌ ఇంప్రూవ్‌మెంట్‌ గ్లోబల్‌ రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌’ డైరెక్టర్‌ సీన్‌ మేయెస్‌, ఇతర శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. దేశంలో ఏటా 1.25 కోట్ల ఎకరాల్లో కంది పంట సాగవుతుండగా.. 35 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా.. 2.01 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. దేశీయ అవసరాల కోసం ఏటా 15 లక్షల టన్నుల మేర కందులను ప్రభుత్వం దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇక్రిశాట్‌లో ఐదేళ్ల విస్తృత పరిశోధన అనంతరం సీనియర్‌ శాస్త్రవేత్త గంగిశెట్టి ప్రకాశ్‌ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు బెలియప్ప శ్రుతి, బొమ్మ నరేశ్‌ల బృందం మేలైన కంది రకం ఐసీపీవీ 25444ను అభివృద్ధి చేసింది. తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో దీనిని పరీక్షించగా మంచి ఫలితాలు వచ్చాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుత రకాలు 35 డిగ్రీల ఉష్ణోగ్రతలను మాత్రమే తట్టుకుంటుండగా.. కొత్త రకం 45 డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనూ పండుతుందని, ఎకరానికి 2 కిలోల విత్తనాలు సరిపోతాయని వెల్లడించారు.

పది లక్షల టన్నుల అదనపు ఉత్పత్తికి అవకాశం
నూతన వంగడంతో దేశంలో కంది సాగు, ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. దీని ద్వారా అదనంగా పది లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించే అవకాశం ఉంది. అన్నదాతల ఆదాయం మూడురెట్లు పెరుగుతుంది. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో వరికి ప్రత్యామ్నాయంగా కంది సాగు పెరిగేందుకు ఇది దోహదపడుతుంది.

  • హిమాన్షి పాఠక్‌, ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ జనరల్‌
Read More

శాస్త్రీయసాగు, మార్కెటింగ్‌పై రైతులు అవగాహన పెంచుకోవాలి

వ్యవసాయశాఖ ఎక్స్‌ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌

రైతులు శాస్త్రీయ సాగు పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం, మార్కెటింగ్‌పై అవగాహన పెంచుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయశాఖ ఎక్స్‌ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ సూచించారు. మిరపలో రసాయనాల వాడకం తగ్గించి.. ప్రకృతి వ్యవసాయ విధానాలు అవలంబిస్తే, గిట్టుబాటు ధర లభిస్తుందని చెప్పారు. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలో మిరప, టమాటా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు, ఉద్యాన అధికారులు, రైతులు పాల్గొని తమ అభిప్రాయాలు తెలిపారు. విత్తన నాణ్యత, మొక్కల ఎంపిక, పోషణపై శాస్త్రీయ విధానాలు పాటించాలని రాజశేఖర్‌ వివరించారు. ‘మిరప, టమాటాల ధరల్లో ఒడుదొడుకులు అధికంగా ఉన్నాయి. అగ్రివాచ్‌ ద్వారా వచ్చే సీజన్‌లో ఎంత ధర ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. వాతావరణ పరిస్థితుల్ని ముందే అంచనా వేసే పరిజ్ఞానం ఉన్నా.. రైతులు నష్టపోతున్నారు. ఈదురు గాలుల తీవ్రత నుంచి పంటను రక్షించుకునేందుకు విండ్‌ బ్రేకర్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని రాజశేఖర్‌ పేర్కొన్నారు. రైతులు బహుళ పంటల సాగుపై దృష్టి పెట్టాలని ఉద్యాన శాఖ కమిషనర్‌ శ్రీనివాసులు సూచించారు. ‘2021 నుంచి మిరపలో నల్లతామర పురుగు నివారించేందుకు రైతులు మూడు, నాలుగు రోజులకోసారి పిచికారీలు చేస్తున్నారు. దీంతో పురుగుమందుల అవశేషాల కారణంగా ఎగుమతుల్లో ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. ధర తగ్గుతోంది. రైతులు పురుగు, తెగుళ్ల మందులు, కలుపు మందుల వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా ఖర్చు తగ్గించుకోవడంతోపాటు నాణ్యమైన ఉత్పత్తిని పొందవచ్చు’ అని శాస్త్రవేత్త శిరీష వివరించారు. టమాటా పండించినా గిట్టుబాటు ధర రావడం లేదని ఈ సందర్భంగా రైతులు వివరించారు. ప్రభుత్వం రాయితీపై పరికరాలు, విత్తనాలు అందించేలా చూడాలని కోరారు. మిరపలో నల్లతామర పురుగు కారణంగా నష్టపోతున్నామని, ఎకరాకు రెండు, మూడు క్వింటాళ్లొస్తున్న పరిస్థితులున్నాయని కొందరు రైతులు వివరించారు. కార్యక్రమంలో మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ విజయ సునీత, ఉద్యానశాఖ అదనపు సంచాలకులు వెంకటేశ్వర్లు, అశోక్‌కుమార్‌, హరినాథ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More