ఎల్‌నినో నేపథ్యం లో ఉత్తర కోస్తా జిల్లాలలో ఖరీఫ్ సాగు పరిస్థితి రబీ పంటల ప్రణాళిక మరియు ఉద్యాన పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎల్‌నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య మరియు తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల జలాలు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కే ఒక వాతావరణ పరిణామం. ఈ సముద్ర ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పులు ప్రపంచంలోని అనేక ప్రాంతాల వాతావరణంపై ప్రభావం చూపుతాయి. మన భారతదేశంలో ఎల్‌నినో పరిస్థితుల వల్ల నైరుతి రుతుపవనాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో నైరుతి రుతుపవనాలు ఎల్నినో ప్రభావం వల్ల విఫలమై సాధారణ వర్షపాతం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యి ఖరీఫ్ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది.

ఉత్తరకోస్తా జిల్లాలలో నైరుతి రుతుపవనాలు పై ఎల్‌నినో ప్రభావం
2026 జూన్ 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో నమోదైన వర్షపాతం పరిస్థితిని గమనించినట్లయితే అనకాపల్లి జిల్లాలో, ఖరీఫ్ సాధారణ వర్షపాతం 479.6 మిల్లీమీటర్లు కాగా, వాస్తవంగా 229.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యి సాధారణంతో పోలిస్తే 52.2 శాతం లోటు నమోదు అయ్యింది. విశాఖపట్నం జిల్లాలో, సాధారణ వర్షపాతం 427 మిల్లీమీటర్లు కాగా, వాస్తవ వర్షపాతం 175.7 మిల్లీమీటర్లు నమోదు అయ్యి 58.9 శాతం లోటు లో ఉంది. విజయనగరం జిల్లాలో, సాధారణ వర్షపాతం 484.4 మిల్లీమీటర్లు కాగా, వాస్తవంగా 288.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంతో పోలిస్తే 40.4 శాతం లోటు ఉంది. శ్రీ కాకుళం జిల్లాలో, సాధారణ వర్షపాతం 503 మిల్లీమీటర్లు కాగా, వాస్తవంగా 293.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే 41.7 శాతం లోటు ఉంది. ఈ లోటు వర్షపాతం వల్ల ఖరీఫ్ సాగు విస్తీర్ణం తగ్గి పోవడమే కాక సాగులో ఉన్న పంటల దిగుబడులపై ప్రభావం చూపనుంది. ఎల్నినో ప్రభావం వల్ల అనకాపల్లి జిల్లాలో 26,434 హెక్టార్లు, విశాఖపట్నం జిల్లాలో 2,586 హెక్టార్లు. విజయనగరం జిల్లాలో 24,289 హె . విస్తీర్ణం ఖాళీగా సాగు కాకుండా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఇతర నీటి వనరులు ఉండడం వల్ల ఖరీఫ్ సాగు విస్తీర్ణం అంతగా తగ్గలేదు.

  సెప్టెంబర్ మాసము లో బంగాళాఖాతం లో తీవ్ర అల్పపీడనం వల్ల ఉత్తర కోస్తా జిల్లాలలో మంచి వర్షపాతం నమోదు అయ్యి రబీ సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ అల్పపీడనం వల్ల అనకాపల్లి జిల్లాలో 310.4 మి.మీ, విశాఖపట్నం జిల్లాలో 363.8 మి.మీ, విజయనగరం జిల్లాలో 288.4 మి.మీ అలాగే శ్రీకాకుళం జిల్లాలో 330.5 వర్షపాతం నమోదు అయ్యింది. భూగర్భజలమట్టం కూడా పెరగడం రబీ సాగుకు చాలా అనుకూలంగా ఉంది. నీటిలభ్యతను బట్టి రబీ పంటల ప్రణాళికను రూపొందించుకోవాలి.

ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లోని మార్కెట్ ఇంటెలిజెన్స్ విభాగం ఆర్ధిక శాస్త్రవేత్తలు రాబోయే కాలం లో ఏ ఏ పంటలకు మార్కెట్ డిమాండ్ ఉంటుందో ముందుగానే తెలియజేస్తారు. మొక్కజొన్న: ప్రస్తుత ధర క్వింటాల్ రూ. 2,580. అదే జనవరి 2027: రూ. 3,080-3,388. ఫిబ్రవరి 2027 రూ. 3,190-3,445 వరకు ఉండవచ్చును. ఈ విధంగా అన్ని పంటలకు ప్రస్తుత మార్కెట్ ధర రాబోయే కాలంలో మార్కెట్ ధర ముందుగానే రైతులు తెలుసుకోవచ్చు. ఈ అంశాలను పరిగణలోనికి తీసుకొని రబీ పంటల ప్రణాలళికను రూపొందించుకోవాలి.

ఉత్తర కోస్తా జిల్లాల రబీ పంటల ప్రణాళిక
ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ సంయుక్తంగా అన్ని అంశాలను పరిగణ లోనికి తీసుకొని రబీ పంటల ప్రణాలళికను రూపొందించడం జరిగింది శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 73,376 హెక్టార్లలో వివిధ పంటలు సాగుకు ప్రణాళిక రూపొందించడం జరిగింది. వరి – 6,929 హెక్టార్లలో సాగు చేయనున్నారు. అలాగే మిగిలిన విస్తీర్ణంలోఆరుతడి పంటలైన మొక్కజొన్న, రాగి , పప్పుదినుసు పంటలైన పెసర , మినుము వేరుశనగ, చెరకు, ఉలవలు, నువ్వులు, పొద్దుతిరుగుడు మరియు జీలుగ పంటలను సిఫారసు చేయడం జరిగింది.

అలాగే విజయనగరం జిల్లాలో సాధారణ రబీ విస్తీర్ణం మరియు ఖరీఫ్ లో సాగు చెయ్యకుండా మిగిలిన విస్తీర్ణం కలిపి 69030 హెక్టార్లు కాగా, రబీ 2026–27లో సుమారు 1,000 హెక్టార్లలో వరి సాగు చేయాలని ప్రతిపాదించడం జరిగింది. మిగిలిన విస్తీర్ణంలో ఆరుతడి పంటలైన జొన్న, మొక్కజొన్న, రాగి, ఉలవలు పప్పుదినుసు పంటలైన పెసర, మినుము శనగ, వేరుశనగ, చెరకు, నువ్వులు, జనుము పంటలను సిఫారసు చేయడం జరిగింది.

విశాఖపట్నం జిల్లాలో రబీ 2026–27 సీజన్‌కు సంబంధించి విశాఖపట్నం జిల్లాలో సాధారణ రబీ విస్తీర్ణం మరియు ఖరీఫ్ లో సాగు చెయ్యకుండా మిగిలిన విస్తీర్ణం కలిపి 3125 హెక్టార్లు. 596 హెక్టార్లలో వరి మిగిలిన విస్తీర్ణంలో ఆరుతడి పంటలైన మొక్కజొన్న, రాగి, ఉలవలు పప్పుదినుసు పంటలైన పెసర, మినుము, వేరుశనగ, చెరకు, నువ్వులు, జనుము పంటలను సిఫారసు చేయడం జరిగింది.

అనకాపల్లి జిల్లాలో రబీ 2026–27 సీజన్‌కు సంబంధించి జిల్లాలో సాధారణ రబీ విస్తీర్ణం మరియు ఖరీఫ్ లో సాగు చెయ్యకుండా మిగిలిన విస్తీర్ణం కలిపి 22,689 హెక్టార్లు. 3200 హెక్టార్లలో వరిమిగిలిన విస్తీర్ణంలో ఆరుతడి పంటలైన మొక్కజొన్న, రాగి, ఉలవలు, అలసందలు, పప్పుదినుసు పంటలైన పెసర, మినుము, వేరుశనగ, చెరకు, నువ్వులు, పొద్దుతిరుగుడు, జనుము పంటలను సిఫారసు చేయడం జరిగింది.

రకాల ఎంపిక మరియు విత్తన లభ్యత
వరి లో స్వల్పకాలిక రకాలైన NLR-3449, MTU-1064, MTU-1061, MTU-1121 మరియు RNR-15048
మొక్కజొన్న లోమార్కెట్ లో దొరికే ప్రైవేట్ హైబ్రిడ్ రకాలను ఉపయోగించవచ్చు.
రాగి: వేగావతి, ఇంద్రావతి మరియు శ్రీ చైతన్య.
పెసర: ఎల్.జి.జి-630, ఎల్.జి.జి -607, ఎల్.జి.జి -574, టి.ఎం.-96-2 మరియు ఐ.పి.ఎం.-2-14
మినుము: ఎల్.బి.జి-904, టి.బి.జి-129, ఎల్.బి.జి-884, జి.బి.జి-1, టి.బి.జి-104, ఎల్.బి.జి-752 మరియు పి.యు-31.
ఉలవలు: ఎ.టి.పి-11 మరియు వి.జెడ్.ఎమ్-1.
అలసంద: రకాలు ఆర్కా సమృద్ధి, ఆర్కా మంగళ మరియు ఆర్కా అర్జున్
వేరుశెనగ: రకాలు టి.జి.సి.ఎస్. 1694 మరియు కె.-6.
నువ్వులు: రకాలు వై.ఎల్.ఎమ్ -66 మరియు వై.ఎల్.ఎమ్ -146.
పొద్దుతిరుగుడు: ప్రైవేట్ హైబ్రిడ్ రకాలను ఉపయోగించవచ్చు.
జనుము: ఎస్.హెచ్-4, సువిన్

రబీ పంటల సాగుకు అవసరమైన విత్తనాల్లో కొంతమేర రైతుల వద్దనే అందుబాటులో ఉన్న సొంత విత్తనాన్ని వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా పప్పుధాన్యాలు, నువ్వులు, రాగి, చెరకు పంటల్లో రైతుల వద్ద సుమారు 30 శాతం వరకు సొంత విత్తనం అందుబాటులో ఉంటుంది

మిగిలిన నాణ్యమైన విత్తనాలను ఏపీ సీడ్స్, విజయనగరం, కృషి విజ్ఞాన కేంద్రం, ఆముదాలవలస, వ్యవసాయ పరిశోధనా కేంద్రం రాగోలు, వ్యవసాయ కళాశాల నైరా, వ్యవసాయ పరిశోధనా కేంద్రం యలమంచిలి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం అనకాపల్లి మరియు ఇతర ANGRAU విత్తన విక్రయ కేంద్రాల ద్వారా పొందవచ్చు.

రబీ పంటలు విత్తే కాలం
రబీ పంటల సాగులో సరైన సమయంలో విత్తనాలు విత్తడం చాలా ముఖ్యమైన విషయం. పంటను బట్టి అనుకూలమైన విత్తే సమయం మారుతుంది. కాబట్టి రైతులు స్థానిక వాతావరణ పరిస్థితులను గమనిస్తూ సరైన సమయంలో విత్తడం ద్వారా మంచి దిగుబడిని పొందవచ్చు.

మొక్కజొన్న అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు విత్తుకోవచ్చు. జొన్న పంటను అక్టోబర్ నెలలో విత్తుకోవచ్చు. రాగి పంటకు నవంబర్ నుంచి డిసెంబర్ వరకు విత్తే సమయం అనుకూలంగా ఉంటుంది. పెసర మరియు మినుము పంటలను అక్టోబర్ నెలలో విత్తుకోవచ్చు. శనగ పంటను అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు విత్తుకోవచ్చు. ఉలవ పంటకు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు విత్తే సమయం అనుకూలంగా ఉంటుంది. వేరుశనగ పంటను నవంబర్ 15 నుంచి డిసెంబర్ వరకు విత్తుకోవచ్చు. అలాగే జనుము పంటను అక్టోబర్ నుంచి నవంబర్ వరకు విత్తుకోవచ్చు.

పప్పుదినుసు పంటలైన మినుము పెసర సాగు చేసినప్పుడు పూత మరియు కాయ దశలో ఒక తేలికపాటి తడిని ఇవ్వవలిసి ఉంటుంది. బరువు నేలలలో అయితే మినుము తేలికపాటి నేలలలో అయితే పెసర పంటను వేసుకోవడంమంచిది.

జనుము పంటను రబీ కాలంలో విత్తనోత్పత్తి కోసం రైతులు సాగు చేస్తారు. అయితే జనుము పంటను లోతట్టు ప్రాంతాలలో వెయ్యకూడదు. తేమ ఎక్కువ అయితే జనుము పంట తట్టుకోలేదు. అలాగే కాయ దశలో పురుగు ఆశించే అవకాశం ఉన్నందున పంటను పరిశీలిస్తూ తగిన సస్య రక్షణ చర్యలు తీసుకోవాలి.

ఎల్‌నినో నేపథ్యంలో ఉధ్యాన వన తోట పంటలలో సూచనలు
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదైనప్పటికీ, సెప్టెంబరు నెలలో కురిసిన వర్షాలతో ఉత్తర కోస్తా జిల్లాల్లో భూగర్భజల లభ్యత కొంత మెరుగుపడింది. ఈ పరిస్థితులను బట్టి రైతులు తమ వద్ద ఉన్న నీటి వనరులను అంచనా వేసుకొని టమాటా, మిరప, వంకాయ, బెండ, ఉల్లి వంటి కూరగాయలను సాగు చేసుకోవచ్చు. పంటను ఎంచుకునేటప్పుడు నీటి అవసరంతో పాటు స్థానికంగా ఉన్న మార్కెట్‌ డిమాండ్‌ను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. కూరగాయల సాగుకు మంచి నాణ్యత కలిగిన నారును ఉపయోగించడం వల్ల పంట ప్రారంభ దశలోనే మంచి మొక్కల పెరుగుదల సాధ్యమవుతుంది. నర్సరీలను నీరు నిల్వ ఉండని ప్రదేశాల్లో ఏర్పాటు చేసి, అవసరమైనంత తేమను మాత్రమే అందిస్తూ, తెగుళ్లు మరియు వ్యాధుల లక్షణాలను ఎప్పటికప్పుడు గమనించాలి.

మామిడి, జీడి, కొబ్బరి, అరటి వంటి పండ్ల తోటల్లో అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా ఉపయోగించుకోవడం ఈ సమయంలో చాలా ముఖ్యం. బిందు సేద్యం, చెట్ల చుట్టూ మల్చింగ్‌ చేయడం వంటి పద్ధతులతో నేలలో తేమను నిలుపుకోవడంతో పాటు నీటి వృథాను తగ్గించవచ్చు. ముఖ్యంగా పూత, పిందె దశల్లో నీటి కొరత రాకుండా చూసుకోవాలి. తోటలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ తెగుళ్లు, వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చర్యలు తీసుకుంటే మంచి దిగుబడితో పాటు రైతులకు మెరుగైన ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

*డా .వి .గౌరి, డా.ఎన్.రాజ్ కుమార్, *డా.ఎ.అలివేణి, *డా.ఎన్.భారతి, డా.ఎం.బి.జి.ఎస్.కుమారి, డా.కె.లక్ష్మణ, డా. కె.భాగ్యలక్ష్మి మరియు *డా. సి.హెచ్.ముకుందరావు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, అనకాపల్లి, ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, Ph: 6304852859, 8074670166

Read More

కాయతొలుచు పురుగు నివారణకు పచ్చిమిర్చి – వెల్లుల్లి ద్రావణం

పచ్చిమిర్చిలో ‘కాప్సిసిన’ అనే ఆల్కలాయిడ్ మరియు వెల్లుల్లిలో ‘అల్లెసిస’ అనే ఆల్కలాయిడ్‌లు ఉంటాయి. వీటి ప్రభావం వల్ల పురుగుకు స్పర్శ చర్య ద్వారా ‘తిమ్మిరి’ గుణాన్ని కలిగిస్తాయి. దీనివలన పురుగు మొక్క పై నుండి క్రిందపడి చనిపోతుంది.
శనగపచ్చ పురుగు, లద్దె పురుగు, దాసరి పురుగు, ఎర్రగొంగళి పురుగు (మూడవ దశ వరకు) నివారణకు ఈ ద్రావణాన్ని పత్తి, కంది, శనగ, వేరుశనగ, ఆముదం, వంగ, టమాట, మిరప పంటలలో రైతులు పురుగు ఉధృతిని బట్టి వాడవచ్చు.

కావలసిన పదార్థాలు :
పచ్చిమిర్చి : 3 కిలోలు
వెల్లుల్లి : అరకిలో
కిరోసిన్ : పావులీటరు (250 మి.లీ.)
సబ్బుపొడి : 100 గ్రా.

తయారు చేసే విధానం :

  • 3 కిలోల పచ్చిమిరప కాయలను కాడలు తీసి వాటిని మెత్తగా నూరి, దానిని 10 లీటర్ల నీటిలో ఒక రాత్రంతా బాగా నానబెట్టాలి.
  • అరకేజి వెల్లుల్లిపాయలను పొట్టుతీసి వాటిని బాగా నూరి 250 మి.లీ. కిరోసిన్‌లో ఒక రాత్రంతా నానబెట్టాలి.
  • మర్నాడు పచ్చిమిర్చి ద్రావణాన్ని ఒక పలుచని గుడ్డతో వడపోయాలి.
  • మిరప ద్రావణం, వెల్లుల్లి ద్రావణం, 100 గ్రాముల సబ్బుపొడి ద్రావణం, ఈ మూడింటిని బాగా కలిపి మిశ్రమాన్ని తయారు చేయాలి.
  • ఈ విధంగా తయారు చేసిన ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరా పొలంలో సాయంత్రం పూట పిచికారి చేయాలి.

ఉపయోగాలు: పచ్చిమిర్చి, వెల్లుల్లి ద్రావణాన్ని వంగలో వచ్చే కాయతొలుచు పురుగు నివారణకు, బెండ, టమాట పంటల నాశించే కాయతొలుచు పురుగుల నివారణకు, పత్తిలో వచ్చే కాయతొలుచు పురుగుల నియంత్రణకు వాడి మంచి ఫలితాలు సాధించవచ్చు.

జాగ్రత్తలు :

  • ఈ ద్రావణం చాలా శక్తివంతమైన క్రిమిసంహారకంగా పనిచేస్తుంది.
  • ఈ ద్రావణం పంటలపై పిచికారి చేసిన 4-5 రోజుల తర్వాత పశువుల పేడ, మూత్రం ద్రావణం పిచికారి చేయడం చాలా మంచిది. దీని వలన పంటలకు పోషకాలు లభించి ఆరోగ్యవంతంగా ఉంటాయి.
  • ఈ ద్రావణం తయారు చేయునపుడు ఒంటికి నూనె రాసుకోవటం అవసరం.
  • పచ్చిమిర్చి, వెల్లుల్లి ద్రావణం పంటలపై పిచికారి చేయునపుడు ఒంటిపై పూర్తిగా బట్టలు ధరించాలి.
  • పంట కాలంలో 1-2 సార్లు మాత్రమే ఈ ద్రావణాన్ని వాడాలి.
  • తయారు చేసిన ద్రావణాన్ని నిల్వ ఉంచరాదు.
    పచ్చిమిర్చికి ప్రత్యామ్నాయంగా ఎండుమిర్చిని కూడా ఉపయోగించవచ్చు.
Read More

ప్రస్తుత ఎల్ నినో దృష్ట్యా వర్షాధార ప్రాంత శనగ రైతులకు సాంకేతిక సలహాలు

శనగ పంట సాధారణంగా తక్కువ నీటితో సాగు చేయగలిగినప్పటికీ పూత మరియు కాయల అభివృద్ధి దశల్లో ఏర్పడే తేమ లోటు దిగుబడిపై గణనీయంగా ప్రభావాన్ని చూపుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో ఈ క్రింది చర్యలను చేపట్టాలి.
  1. నేల తేమ సంరక్షణ
  • పొలంలో అందుబాటులో ఉన్న వర్షపు నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా కట్టలను బలోపేతం చేయాలి.
  • కలుపు మొక్కలను తొలగించి నేలలోని తేమను పంటలకు అందుబాటులో ఉంచాలి.
  • పంట అవశేషాలతో మల్చింగ్ చేయడం ద్వారా నేల నుండి నీటి ఆవిరిని తగ్గించాలి.
  • అవసరానికి తగ్గట్టుగా అంతరకృషి చేసి నేల తేమను సంరక్షించాలి.
  1. పంట దశను బట్టి చర్యలు

ఎ) విత్తిన తర్వాత 30 రోజులు:

  • మొలకలు సక్రమంగా వచ్చినట్లు పరిశీలించాలి.
  • ఖాళీ ప్రదేశాలలో అవసరమైతే మొక్కలను భర్తీ చెయ్యాలి.
  • ప్రారంభ దశలో కలుపు నివారణకు ప్రాధాన్యత ఇవ్వాలి.

బి) 30-45 రోజులు:

  • నేల తేమను కాపాడాలి. అవసరమైతే ఒక నీటి తడిని కొమ్మలు వేసే దశలో ఇవ్వాలి.
  • కలుపు పోటీని పూర్తిగా తగ్గించాలి.
  • పంట ఆరోగ్యాన్ని పరిశీలిస్తూ పురుగు, తెగుళ్ళను పర్యవేక్షించాలి.

సి) పూత దశ (45-60 రోజులు):

  • ఇది శనగలో అత్యంత కీలకమైన దశ.
  • నీటి వనరులు అందుబాటులో ఉంటే ఒక జీవనాధార తడిని ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
  • నీరు అందుబాటులో లేనప్పుడు నేల తేమ సంరక్షణ మరియు మొక్కలపై పైపాటుగా పోషక నిర్వహణపై దృష్టి సారించాలి. శాస్త్రవేత్తల సలహాలు పాటించాలి.

డి) కాయల అభివృద్ధి దశః

  • కాయ తొలుచు పురుగు మరియు ఇతర పురుగు, తెగుళ్లను క్రమం తప్పకుండా గమనించాలి. నివారణ చర్యలు చేపట్టాలి.
  1. ఫోలియర్ పోషక నిర్వహణ
  • తీవ్రమైన తేమ ఒత్తిడి ఉన్నప్పుడు వేర్ల ద్వారా పోషకాల సంగ్రహణం తగ్గవచ్చు. ఈ దశలో శాస్త్రవేత్తల సలహాల మేరకు ఆకుల ద్వారా పోషకాలను అందించడం వలన పోషకాలను త్వరితగతిన మొక్కలకు అందించవచ్చు.

రైతులకు ముఖ్య సందేశం
నేల తేమను కాపాడండి – కలుపును నియంత్రించండి.
పూత దశలో నీటికి ప్రాధాన్యత ఇవ్వండి – కాయల దశను రక్షించండి
పురుగు, తెగుళ్లను పర్యవేక్షించండి.

ఎస్. నీలిమ, జె. మంజునాథ్, బి.హెచ్. చైతన్య, వి. జయలక్ష్మీ,
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము, నంద్యాల. ఫోన్: 8247444303

Read More