వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య వర్సిటీల్లోనూ ఖాళీల భర్తీ
- వివరాలు కోరిన ప్రభుత్వం
- ఆ మూడింట్లో 718 పోస్టులు ఖాళీ
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 12 విశ్వవిద్యాలయాలతోపాటు వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య వర్సిటీల్లోని ఆచార్యులు, సహ ఆచార్యులు, సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఆయా విశ్వవిద్యాలయాల నుంచి ఖాళీలు, ప్రస్తుతం అనుసరిస్తున్న నియామక విధానం, ఇతరత్రా అంశాలపై సమాచారం కోరింది. మూడు వర్సిటీల్లో మొత్తం 718 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల పరిధిలో ఎనిమిదేళ్ల క్రితం చివరి దఫా నియామకాలు జరిగాయి. పశువైద్య వర్సిటీలో 2022లో నియామకాల ప్రక్రియ చేపట్టి రెండు నెలల క్రితం భర్తీ చేశారు. ఈలోపు మళ్లీ ఖాళీల సంఖ్య భారీగా పెరిగింది. మరోవైపు వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి నల్గొండలతోపాటు కొడంగల్‌లో మూడు కొత్త కళాశాలలు, పశువైద్య వర్సిటీ పరిధిలో కొడంగల్ ఓ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఖాళీల భర్తీ, కొత్త నియామకాలు అవసరమని ఆయా వర్సిటీల పాలకవర్గాలు గుర్తించాయి. ఖాళీల వల్ల కలుగుతున్న ఇబ్బందులను ఉపకులపతులు ఇటీవల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తొలుత ఉన్నత విద్యాశాఖ పరిధిలోని పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపడంతోపాటు ఈ మూడు వర్సిటీల్లోని ఖాళీల వివరాలు అడిగింది.
నియామకాలకు ఏ విధానం?
ఉన్నత విద్యాశాఖ పరిధిలో సహాయ ఆచార్యుల పోస్టులను ప్రత్యక్ష నియామక విధానం ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి మార్గదర్శకాలు జారీ చేసింది. వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీకి ఇప్పటి వరకు ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి. తాజా ఉత్తర్వుల్లో వీటి ప్రస్తావన లేదు. దీంతో పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టిన తర్వాత అవే మార్గదర్శకాలను పాటించాలని ప్రభుత్వం ఆదేశిస్తే పాలకమండళ్లు అమలు చేయాలి. ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వని పక్షంలో మూడు వర్సిటీలు అవే మార్గదర్శకాలను తాము అమలు (అడాప్ట్) చేస్తామని తీర్మానం చేయాలి. ప్రత్యేక విధానం తేవాలనుకుంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. మూడు విశ్వవిద్యాలయాల పరిధిలో ప్రస్తుతం వేయి మందికి పైగా పీహెచ్‌డీ అభ్యర్థులు పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. ఖాళీల భర్తీ చేపడితే తమకు ఉద్యోగాలు లభిస్తాయనే ఆశతో ఉన్నారు.






