పురుగు మందుల నాణ్యతా ప్రమాణాలకు ప్రాధాన్యం

మనదేశంలో పురుగు మందులు వినియోగిస్తే కొన్నిసార్లు పురుగులు కాకుండా పంటలు నాశనమవడం, తెగుళ్లపై ఎలాంటి ప్రభావం కనిపించకపోవడం, రైతులు మరణించడం, పర్యావరణానికి తీవ్ర హాని జరగడం సర్వసాధారణంగా మారింది. మరోవైపు ఈ విపరిణామాల బాధ్యులు చట్టం నుంచి సులువుగా తప్పించుకుం టున్నారు. ఈ ధోరణిని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం నాణ్యతకు, ప్రాణాలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ… వాటిని ఉల్లంఘించిన వారికి రూ. అర కోటి జరిమానాతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష విధించేలా వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నూతన పురుగు మందుల నిర్వహణ (పెస్టిసైడ్స్ మేనేజ్‌మెంట్) చట్టం తెస్తోంది. ముసాయిదా బిల్లుపై అభిప్రాయాలు తెలపాలంటూ తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు లేఖలు పంపింది. రైతులు, పౌరసమాజం సైతం సూచనలు చేయడానికి ఫిబ్రవరి 4వ తేదీ వరకు గడువునిచ్చింది. ముసాయిదా బిల్లును మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ agriwelfare.gov.inలోనూ ఉంచింది.
కేంద్రానికి సర్వాధికారాలు
ప్రస్తుతం అమలులో ఉన్న పురుగు మందుల చట్టం(1968), పురుగు మందుల నిబంధన(1971)ల్లో ఉన్న లోపాలను సవరించడానికే కొత్త చట్టం తెస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ‘పురుగు మందుల తయారీ, అమ్మకం నుంచి వాడకం వరకు పారదర్శకతను తీసుకురావడం, రైతులకు నాణ్యమైనవే అందేలా చూడటం, వాటి ప్రమాణాలు గుర్తింపు సామర్థ్యం పెంచడం, నకిలీలను నియంత్రించడం, కఠిన జరిమానాలు విధించడం, తయారయ్యే ప్రతి మందునూ ప్రయోగశాలల్లో పరీక్షల అనంతరమే ధ్రువీకరించడం, జీవ పురుగు మందుల వినియోగాన్ని ప్రోత్సహించడం, మానవులు, జంతువులు, పర్యావరణానికి కలిగే ముప్పును తగ్గించడం, స్వదేశీ తయారీ భారీఎత్తున పెంచడం” తమ లక్ష్యాలని వెల్లడించింది. ఈ చట్టం అమలులోకి వచ్చాక దేశవ్యాప్తంగా పురుగు మందుల నాణ్యత, పంపిణీ అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి సంక్రమిస్తాయి.
తయారీదారులు ప్రమాణాలు పాటించాలి
పురుగు మందు పేరు, బ్యాచ్ నంబరు, గడువు తేదీలను డబ్బాపై ముద్రించాలి. తయారీ సంస్థ పేరు, చిరునామా, ఉత్పత్తి స్థలం, వాడిన రసాయనాలు, ఇతర వివరాలుండాలి. ప్యాకేజింగ్ ప్రమాణాలను పాటించాలి. లైసెన్స్ ఉన్న ప్రాంగణాల్లో, భద్రత ప్రమాణాలకు అనుగుణంగా మాత్రమే ఉత్పత్తి జరగాలి. క్యూఆర్ కోడ్ ద్వారా వివరాలు వెల్లడించే సాంకేతికతను వినియోగించాలి.
ఉల్లంఘిస్తే శిక్ష
పురుగు మందుల రసాయన మిశ్రమంలో మార్పులు ఉండి, ప్రభావాన్ని చూపలేకపోయినా, రైతుల ఆరోగ్యానికి హాని కలిగించినా, నాణ్యత తగ్గించేలా ఇతర పదార్థాలు కలిపినా తీవ్ర నేరంగా పరిగణిస్తారు. చట్ట నిబంధనలను ఉల్లంఘించి పురుగుమందుల తయారీ, దిగుమతి చేసుకున్నా… వాటి విక్రయంతో ఎవరైనా మృతి చెందినా, తీవ్రంగా గాయపడినా… ఉత్పత్తిదారుడు, సంస్థను బాధ్యులుగా పరిగణిస్తారు. వారికి ఐదేళ్ల వరకు జైలుశిక్ష, లేదంటే రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. నేర తీవ్రతను బట్టి ఒకేసారి రెండూ విధించొచ్చు. రెండోసారి నేరం చేస్తే… మొదటిసారి విధించిన జరిమానా కంటే రెట్టింపు జరిమానా వేస్తారు. మూడోసారి నేరం చేస్తే… సంబంధిత సంస్థ రిజిస్ట్రేషన్, లైసెన్స్ శాశ్వత రద్దుకు పెస్టిసైడ్ ఇన్‌స్పెక్టర్ సిఫార్సు చేస్తారు. జరిమానాను చెల్లించకుంటే రిజిస్ట్రేషన్ కమిటీ ఇచ్చే రికవరీ సర్టిఫికెట్ ఆధారంగా జిల్లా కలెక్టర్ ఆ మొత్తాన్ని భూమి శిస్తు బకాయిల్లా వసూలు చేస్తారు. అవసరమైతే ఆస్తిని జప్తు చేస్తారు.

Read More

కూరగాయల సాగులో కేరళ విధానం అమలు చేయాలి: కోదండరెడ్డి

కూరగాయల సాగు, మార్కెటింగ్‌లో కేరళ విధానం ఆదర్శంగా ఉందని, దానిని తెలంగాణలోనూ అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ ఛైర్మన్‌ కోదండరెడ్డి సూచించారు. కూరగాయల సాగుపై సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ”రాష్ట్రంలో కూరగాయలు సాగు చేసే రైతులు అమ్ముకోడానికి ఇబ్బంది పడుతున్నారు. సాగు విస్తీర్ణం తగ్గడంతో నిత్యం కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నారు. ఇటీవల కేరళలో పర్యటించి అక్కడి విధానాన్ని అధ్యయనం చేశాం. ఆ మాదిరిగానే రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం పెరగాలి. మధ్య దళారీ వ్యవస్థను నివారించాలి. రాష్ట్ర వ్యవసాయ రంగంలో సంస్కరణలు రావాలి. దీనిపై నెలరోజుల్లో నిర్దిష్టమైన ఆలోచన చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం’ అని కోదండరెడ్డి పేర్కొన్నారు.

Read More

ధాన్యం కొనుగోళ్లలో ‘సాంకేతిక పరిజ్ఞానం’

  • దక్షిణాదిలో తొలిసారి 800 కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్ల వినియోగం
  • తాలు, తరుగు, తేమ సమస్యలు తగ్గాయంటున్న అధికారులు
  • వెదర్‌ ఫోర్‌కాస్ట్‌ టూల్స్‌ ఉపయోగించి వర్షాలపై అప్రమత్తం
  • తెలంగాణ విధానాలపై పలు రాష్ట్రాల అధ్యయనం

ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్‌ ప్రక్రియలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. దీంతో ఇతర రాష్ట్రాలు తెలంగాణ విధానాలపై అధ్యయనం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇటీవల 800 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లను ఉపయోగించారు. వీటి వాడకంతో తాలు, తరుగు, తేమ వంటి సమస్యలు గణనీయంగా తగ్గాయని.. దక్షిణాదిలో ఈ విధానాన్ని అవలంబించిన తొలి రాష్ట్రం తెలంగాణేనని పౌరసరఫరాలశాఖ వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్తులో మిగతా కేంద్రాల్లోనూ ప్యాడీ క్లీనర్లను ఉపయోగించాలని పలువురు కోరుతున్నారు. ధాన్యం సేకరణ సమయంలో వర్షాలు కురుస్తుండటం పెద్ద సమస్యగా మారుతోంది. ఈ నేపథ్యంలో వెదర్‌ ఫోర్‌కాస్ట్‌ టూల్స్‌ని ఉపయోగించి వర్షం పడే ప్రాంతాల్ని గుర్తించి.. ఆయా కొనుగోలు కేంద్రాలను పౌరసరఫరాల సంస్థ అప్రమత్తం చేస్తోంది.

రైతులకు వ్యయప్రయాసలు తగ్గించాం

  • డీఎస్‌ చౌహాన్‌, పౌరసరఫరాల శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌
    ధాన్యం కొనుగోళ్లు వీలైనంత సాఫీగా జరిగేందుకు టెక్నాలజీని వాడుతున్నాం. ప్యాడీ క్లీనర్లు వినియోగించి రైతులకు వ్యయప్రయాసలు తగ్గించాం. ప్రతి రోజు టెలికాన్ఫరెన్స్‌ ద్వారా వాతావరణ ముందస్తు హెచ్చరికల్ని ప్రభావిత కేంద్రాలకు పంపి ధాన్యం తడవకుండా వీలైనంత మేరకు తగ్గించాం. తెలంగాణ పౌరసరఫరాల శాఖ చేపడుతున్న సంస్కరణల్ని పలు రాష్ట్రాలు అధ్యయనం చేశాయి. మరికొన్ని రాష్ట్రాలూ రానున్నాయి.

ఆసక్తి కనబరుస్తున్న ఇతర రాష్ట్రాలు
తేమ శాతం నిబంధనల్ని పక్కన పెట్టి ధాన్యం కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.మిల్లర్లకు గ్యారంటీ, బకాయిదారులకు ధాన్యం కేటాయింపులు నిలిపివేయడం తదితర విధానాలను అవలంబించింది. ఈ పరిణామాలు, సంస్కరణల నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు తెలంగాణలో పర్యటించి ఇక్కడి విధానాలను అధ్యయనం చేస్తున్నారు.

Read More