ఆదర్శ రైతు వ్యవస్థ’పై అధ్యయనం
తెలంగాణలో ఆదర్శ రైతుల నియామకం చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సిఫార్సుపై వ్యవసాయశాఖ అధ్యయనం చేపట్టింది. 2007లో ఉమ్మడి రాష్ట్రంలో ఆదర్శ రైతుల నియామకం జరిగింది. అప్పట్లో ప్రతి వేయి ఎకరాలకు ఒకర్ని నియమించి, వారికి నెలకు రూ. వేయి చొప్పున గౌరవ వేతనం చెల్లించారు. ఆ పంథాలోనే మళ్లీ నియామకం చేపట్టాలని వ్యవసాయ కమిషన్ తాజాగా సిఫార్సు చేసింది. వారిని ఎలా వినియోగించుకోవాలో సూచించింది. జూన్ రెండో తేదీన విత్తనాల పంపిణీ కోసం గ్రామానికి ఇద్దరు లేదా ముగ్గురు అవసరం ఉన్నందున ఆ మేరకు తాత్కాలికంగా ఎంపిక చేయాలని యోచిస్తోంది. బుధవారం వ్యవసాయమంత్రి తుమ్మల నాగేశ్వరరావును కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కలిసి ఆదర్శరైతుల నియామకంపై వినతిపత్రం ఇచ్చారు. ఆదర్శ రైతుల నియామక ప్రక్రియపై ప్రస్తుతానికి ఎలాంటి ప్రతిపాదన లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంత్రిమండలిలో చర్చించిన తర్వాత సీఎం ఆదేశాల మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. విత్తనాల పంపిణీకి, ఆదర్శరైతుల నియామకానికి సంబంధం లేదన్నారు.

