చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరేలా వ్యవసాయ యాంత్రీకరణ పథకం: మంత్రి తుమ్మల.

  • వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభానికి రాష్ట్రం సిద్ధం
  • రాష్ట్ర, కేంద్ర వాటాలతో వ్యవసాయ యాంత్రీకరణ పథకం
  • లబ్ధిదారుల ఎంపికపై కేంద్ర మార్గదర్శకాల కోసం ఎదురుచూపులు
  • చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరేలా వ్యవసాయ యాంత్రీకరణ పథకం
  • రైతుకు నచ్చిన కంపెనీ నుంచి వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేసే వెసులుబాటు
  • సబ్సిడీ నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ
  • ఎస్సీ, ఎస్టీ రైతులకు 60 శాతం.. బీసీ, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీ
  • ఎఫ్‌పీఓలను కస్టమ్ హైరింగ్ సెంటర్లుగా వినియోగించే అవకాశాలపై అధ్యయనం చేయాలి
  • రైతుల అభిప్రాయాలతో యాంత్రీకరణ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలి
    ……………………………………………………………………………………………………………………………………………………….
    గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పక్కన పెట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 2025-26 సంవత్సరం నుంచి వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించి అమలు చేస్తున్నామని చెప్పారు. 2025-26 సంవత్సరానికి పథకం కోసం రూ.71 కోట్లు కేటాయించగా, రూ.63 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రైతులకు మరింత విస్తృతంగా యాంత్రీకరణ ప్రయోజనాలు అందించేందుకు 2026-27 సంవత్సరానికి రూ.147.99 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు.

రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్ర, కేంద్ర వాటాలతో పథకం అమలుకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే చేపట్టామని, లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేయాల్సిన మార్గదర్శకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోందని చెప్పారు. కేంద్ర మార్గదర్శకాలు అందిన వెంటనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టి, రైతులకు పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రైతుకు నచ్చిన కంపెనీ నుంచి పరికరం కొనుగోలు చేసే అవకాశం…
రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాన్ని తమకు నచ్చిన ఎంప్యానెల్ చేసిన కంపెనీ వద్ద కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం పథకం ద్వారా లబ్ధి పొందే రైతు ఒక నిర్దిష్ట సంస్థ లేదా ఎంపిక చేసిన సరఫరాదారుడి వద్ద నుంచే పరికరం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి లేకుండా, రైతుకు మరింత స్వేచ్ఛ ఉండే విధంగా విధానాన్ని రూపొందించాలని తెలిపారు.

సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానం అమలు చేయనుండటం వల్ల రైతులు కూడా వ్యవసాయ పరికరం కొనుగోలు చేసే ముందు వివిధ కంపెనీల ధరలను, నాణ్యతను పరిశీలించి, తక్కువ ధరకు మంచి నాణ్యత కలిగిన పరికరం ఎక్కడ లభిస్తే అక్కడే కొనుగోలు చేసుకోవాలని మంత్రి సూచించారు. దీనివల్ల ప్రభుత్వ సబ్సిడీ సద్వినియోగం కావడంతో పాటు, ఎక్కువ మంది రైతులకు యాంత్రీకరణ పరికరాలు అందించే అవకాశం కలుగుతుందని తెలిపారు.

ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ రైతులకు 60 శాతం, బీసీ మరియు ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీ అందుతుందని మంత్రి తెలిపారు. సబ్సిడీ నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే విధానం వల్ల మధ్యవర్తుల ప్రమేయం తగ్గడంతో పాటు, పథకంలో పారదర్శకత పెరుగుతుందని మంత్రి అన్నారు.

37 రకాల వ్యవసాయ పరికరాలు…
వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులకు అందించేందుకు ప్రస్తుతం 37 రకాల వ్యవసాయ పరికరాలను ఖరారు చేసినట్లు మంత్రి తెలిపారు. గతంలో పథకం పరిధిలో 19 రకాల పరికరాలు మాత్రమే ఉండేవని, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం పరికరాల సంఖ్యను 37 రకాలకు పెంచినట్లు చెప్పారు.

ఇందులో పవర్ టిల్లర్, బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ టిల్లర్/వీడర్, డిస్క్ ప్లౌ, కల్టివేటర్, లెవలింగ్ బ్లేడ్, రోటావేటర్, రోటో-పుడ్లర్, రివర్సిబుల్ ఎంబీ ప్లౌ, సబ్ సాయిలర్, బండ్ ఫార్మర్, సీడ్-కం-ఫెర్టిలైజర్ డ్రిల్, మల్టీ క్రాప్ ప్లాంటర్, రైజ్డ్ బెడ్ ప్లాంటర్, పోస్ట్ హోల్ డిగ్గర్, ప్లాస్టిక్ మల్చ్ లేయింగ్ మెషిన్, ఫెర్టిలైజర్ బ్రాడ్‌కాస్టర్, రిడ్జ్ ఫరో ప్లాంటర్, ట్రాక్టర్ ఆపరేటెడ్ స్లాషర్, పవర్ వీడర్, మాన్యువల్ నాప్‌సాక్ స్ప్రేయర్, పవర్ నాప్‌సాక్ స్ప్రేయర్, ట్రాక్టర్ ఆపరేటెడ్ స్ప్రేయర్, కిసాన్ డ్రోన్, కంబైన్ హార్వెస్టర్, మైజ్ కంబైన్ హార్వెస్టర్, మల్టీ క్రాప్ థ్రెషర్, విన్నోయింగ్ ఫ్యాన్, మైజ్ షెల్లర్, టెలిస్కోపిక్ హార్వెస్టింగ్ పోల్స్, పసుపు బాయిలర్, పసుపు పాలిషర్, ప్యాడీ మొబైల్ డ్రైయర్, స్ట్రా బేలర్, రోటరీ ష్రెడర్, మల్చర్, రోటరీ స్ట్రా స్లాషర్, బ్రష్ కట్టర్ ఉన్నాయి.

రైతుల అవసరాలు, సాగు విధానాల్లో వస్తున్న మార్పులు, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుని పథకం అమలు మధ్యలో కూడా రైతులకు ఉపయోగపడే కొత్త వ్యవసాయ పరికరాలను చేర్చుకునేలా విధానాలను రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

యాంత్రీకరణలో ఎఫ్‌పీఓలకు కీలక పాత్ర…
వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలులో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లను (ఎఫ్‌పీఓలను) భాగస్వాములను చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని ఎఫ్‌పీఓల నుంచి సలహాలు, సూచనలు తీసుకుని, వాటిని పథకం అమలులో ఎలా ఉపయోగించుకోవచ్చో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

చిన్న, సన్నకారు రైతులు ప్రతి వ్యవసాయ పరికరాన్ని సొంతంగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా, ఎఫ్‌పీఓల ఆధ్వర్యంలో కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి వ్యవసాయ పరికరాలను రైతులకు అద్దెకు అందించే అవకాశాన్ని పరిశీలించాలని మంత్రి ఆదేశించారు.

ఒక్క రైతు ఖరీదైన యంత్రాన్ని కొనుగోలు చేయడం కంటే, ఒక ఎఫ్‌పీఓ ఆధ్వర్యంలో పరికరాలను అందుబాటులో ఉంచి అవసరమైన సమయంలో రైతులకు అద్దెకు అందిస్తే, తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది రైతులు యాంత్రీకరణ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు.

రైతుల అభిప్రాయాలనూ సేకరించాలి..
వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని రైతులకు మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దేందుకు రైతుల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని మంత్రి తుమ్మల తెలిపారు.

వచ్చే మంగళవారం నిర్వహించే ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకంపై రాష్ట్రవ్యాప్తంగా రైతులు, ఎఫ్‌పీఓల ప్రతినిధులతో మాట్లాడి అభిప్రాయాలను సేకరించాలని సూచించారు.

రైతుల నుంచి వచ్చే సూచనలను పరిగణనలోకి తీసుకుని, సాధ్యాసాధ్యాలను పరిశీలించి, రైతులకు గరిష్ఠ ప్రయోజనం కలిగేలా వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి తుది రూపం ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Read More

వ్యవసాయ యాంత్రీకరణకు ప్రభుత్వం పెద్దపీట: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రైతులు తమకు అవసరమైన వ్యవసాయ పనిముట్లను, తమకు నచ్చిన కంపెనీ నుంచి కొనుగోలు చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం యాంత్రీకరణ పథకాన్ని అమలు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. రైతులకు నాణ్యమైన వ్యవసాయ యంత్ర పరికరాలు అందించడంతో పాటు, వారి అవసరాలు, డిమాండ్‌కు అనుగుణంగా యంత్రాలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

శాసనమండలిలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.

నాణ్యతకు ప్రాధాన్యత.. పరీక్షించిన యంత్రాలే రైతులకు సరఫరా…

యాంత్రీకరణ పథకం కింద రైతులకు నాణ్యమైన, ప్రమాణాలు కలిగిన వ్యవసాయ యంత్ర పరికరాలను మాత్రమే అందిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. తయారీదారులు, సరఫరాదారులు అందించే ఉత్పత్తులను ఫార్మ్ మెషినరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ లేదా కేంద్ర వ్యవసాయ శాఖ (DA&FW) ద్వారా గుర్తింపు పొందిన సంస్థల వద్ద పరీక్షించిన తర్వాతనే రైతులకు సరఫరా చేస్తున్నామని తెలిపారు.

రైతుల భద్రత, యంత్రాల నాణ్యత, పనితీరు వంటి అంశాల్లో ఎలాంటి రాజీ లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

గతంలో ఉన్న సమస్యలకు ఇక తావులేదు…

యాంత్రీకరణ పథకం కింద రైతులకు అందించే పరికరాలు వారు కోరుకున్న విధంగా లభించడం లేదని, సబ్సిడీపై అందించే యంత్రాలకు, మార్కెట్లో లభించే యంత్రాలకు తేడా ఉంటుందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రస్తావించారు. సబ్సిడీ పరికరాలకు ఇచ్చే కొటేషన్ ధరలు, మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసం ఉంటోందని పేర్కొన్నారు. డిమాండ్ ఉన్న యంత్రాలను ఎక్కువగా అందించాలని, డ్రోన్లను కూడా అధిక సంఖ్యలో అందించాలని కోరారు.

దీనిపై మంత్రి తుమ్మల స్పందిస్తూ, ఎమ్మెల్సీ ప్రస్తావించిన అంశాలు గతంలో ఉన్న పరిస్థితులకు సంబంధించినవని, ప్రస్తుతం ఆ విధానం లేదని స్పష్టం చేశారు. రైతులు తమకు నచ్చిన పనిముట్టును, తమకు నచ్చిన కంపెనీ నుంచి కొనుగోలు చేసుకునే విధంగా ప్రస్తుత యాంత్రీకరణ విధానాన్ని రూపొందించామని తెలిపారు.

గత ప్రభుత్వం పథకాన్ని నిలిపివేసింది…
గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను వినియోగించుకోకుండా యాంత్రీకరణ పథకాన్ని నిలిపివేసిందని మంత్రి తుమ్మల తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించి తిరిగి అమలులోకి తీసుకొచ్చిందన్నారు.

వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగడం ద్వారా రైతులపై శారీరక శ్రమ తగ్గడంతో పాటు, సాగు ఖర్చులు తగ్గి, సమయానికి వ్యవసాయ పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.

రూ.63.11 కోట్లతో 15,565 యంత్ర పరికరాల సరఫరా…

2025-26 ఆర్థిక సంవత్సరంలో యాంత్రీకరణ పథకం కోసం ప్రభుత్వం రూ.71 కోట్లు కేటాయించగా, రూ.63.11 కోట్లు ఖర్చు చేసి 15,565 వ్యవసాయ యంత్ర పరికరాలను రైతులకు సరఫరా చేసినట్లు మంత్రి వివరించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో యాంత్రీకరణ పథకానికి రూ.147.91 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రైతుల డిమాండ్‌ను అనుగుణంగా, అవసరమైన వ్యవసాయ యంత్ర పరికరాలను యాంత్రీకరణ పథకం కింద సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

చిన్న, సన్నకారు రైతులకు 50 శాతం సబ్సిడీ…

యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు అందించే పరికరాలపై ప్రభుత్వం గణనీయమైన సబ్సిడీని అందిస్తోందని మంత్రి తెలిపారు. చిన్న, సన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీ రైతులు, మహిళా రైతులకు 50 శాతం సబ్సిడీ, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు అందిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో వ్యవసాయ యంత్ర పరికరాల కొనుగోలుకు రైతులపై పడే ఆర్థిక భారం తగ్గుతుందని మంత్రి పేర్కొన్నారు.

ఎంప్యానెల్‌మెంట్‌లో రైతులకు భాగస్వామ్యం…

రైతులు కోరుకునే విధంగా వ్యవసాయ పనిముట్లు అందుబాటులో ఉండేలా ఎంప్యానెల్‌మెంట్ కమిటీలో రైతులకు కూడా భాగస్వామ్యం కల్పించినట్లు మంత్రి తెలిపారు. కమిటీలో శాస్త్రవేత్తలు, టెక్నికల్ ఇంజనీర్లు, అధికారులతో పాటు ఆదర్శ రైతులు, ఎఫ్‌పీవోలు (FPOs) ప్రతినిధులను కూడా భాగస్వాములను చేశామని వివరించారు. రైతుల వాస్తవ అవసరాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు, వివిధ ప్రాంతాల్లో సాగు విధానాలను పరిగణనలోకి తీసుకుని యంత్ర పరికరాల ఎంపిక జరిగేలా ఈ విధానం రూపొందించామని తెలిపారు.

యాంత్రీకరణ పథకం కింద పరికరాలను సరఫరా చేసేందుకు 444 కంపెనీలు ఎంప్యానెల్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నాయని మంత్రి వెల్లడించారు. అయితే ప్రతి కంపెనీని ఎంపిక చేయడం జరగదని, నిర్దేశిత ప్రమాణాలను పాటించే కంపెనీలను, కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంబంధిత సంస్థలు గుర్తించి ఎంపిక చేసే ప్రమాణాలను అనుసరించే కంపెనీలను మాత్రమే జాబితాలో చేర్చుతామని స్పష్టం చేశారు.

దీంతో రైతులకు నాణ్యత లేని లేదా ప్రమాణాలు లేని యంత్ర పరికరాలు అందకుండా చూడటంతో పాటు, నాణ్యమైన ఉత్పత్తులకు ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు.

రైతుకే పూర్తి స్వేచ్ఛ.. నచ్చిన కంపెనీ నుంచే కొనుగోలు…

యాంత్రీకరణ పథకంలో రైతుకు కొనుగోలు విషయంలో పూర్తి స్వేచ్ఛ కల్పిస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. రైతు తనకు నచ్చిన పనిముట్టును, తనకు నచ్చిన కంపెనీ దగ్గరే కొనుగోలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

ప్రభుత్వం రైతుల తరఫున ఒక నిర్దిష్ట కంపెనీ నుంచి మాత్రమే యంత్రాన్ని కొనుగోలు చేయాలని నిర్దేశించడం లేదన్నారు. అదేవిధంగా, రైతులు మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రమాణాలకు అనుగుణమైన తమకు నచ్చిన పరికరాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉందన్నారు.
 
సబ్సిడీ నేరుగా రైతు ఖాతాలోకి…

యాంత్రీకరణ పథకంలో పారదర్శకతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. రైతులకు అందాల్సిన సబ్సిడీ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తున్నామని చెప్పారు.

దళారులకు, మధ్యవర్తులకు అవకాశం లేకుండా రైతుకు నేరుగా ప్రయోజనం అందేలా వ్యవస్థను రూపొందించామని తెలిపారు. రైతు తన అవసరానికి అనుగుణంగా పరికరాన్ని ఎంపిక చేసుకుని కొనుగోలు చేసుకునే అవకాశం ఉండటంతో పాటు, సబ్సిడీ కూడా నేరుగా రైతు ఖాతాలో జమ కావడం ద్వారా పథకం అమలులో పారదర్శకత పెరుగుతుందన్నారు.

రైతుల డిమాండ్‌కు అనుగుణంగా యంత్రాల సరఫరా…

రాష్ట్రంలో పంటల సాగు విధానాలు, రైతుల అవసరాలలో ఉండే అసమానతల వలన, యాంత్రీకరణకు ఉన్న డిమాండ్ ప్రాంతాల వారిగా భిన్నంగా ఉంటుందని మంత్రి తెలిపారు. అందువల్ల రైతులకు అవసరం లేని పరికరాలను పెద్ద ఎత్తున సరఫరా చేయడం కాకుండా, రైతుల నుంచి వచ్చే డిమాండ్‌కు అనుగుణంగా అవసరమైన యంత్రాలను అందుబాటులోకి ఉంచుతున్నామని స్పష్టం చేశారు.

డ్రోన్లు సహా ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరికరాలకు పెరుగుతున్న డిమాండ్‌ను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోందన్నారు.

ఆయిల్‌పామ్ సాగుకు ప్రత్యేక ప్రోత్సాహం…

రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగును కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.50 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు జరుగుతోందని, వచ్చే మూడు సంవత్సరాల్లో మరో 6 లక్షల ఎకరాలను ఆయిల్‌పామ్ సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు అనుగుణంగా రైతులకు అవసరమైన యంత్ర పరికరాలను కూడా యాంత్రీకరణ పథకం కింద అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. ఆయిల్‌పామ్ సాగులో ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న అత్యుత్తమ యంత్ర పరికరాలను గుర్తించి, అవసరమైన వాటిని దిగుమతి చేసుకుని రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు.

ఈ యంత్ర పరికరాలను ఫ్యాక్టరీ వద్దే రైతులకు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. తద్వారా ఆయిల్‌పామ్ సాగులో యాంత్రీకరణ పెంచి, రైతుల శ్రమను తగ్గించడంతో పాటు ఉత్పాదకతను పెంచేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

రైతు ప్రయోజనమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం..

వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించడం, రైతుల శ్రమను తగ్గించడం, సాగు ఖర్చులను తగ్గించడం, వ్యవసాయ పనులను సకాలంలో పూర్తి చేయడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు యాంత్రీకరణ కీలకమని మంత్రి తుమ్మల అన్నారు.

రైతులకు అవసరమైన పరికరాలను వారి డిమాండ్‌కు అనుగుణంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, నాణ్యత విషయంలో రాజీ పడకుండా, సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తూ పారదర్శకమైన, రైతు కేంద్రిత యాంత్రీకరణ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.

రైతు ఏ పనిముట్టు కోరుకుంటున్నాడో, ఏ కంపెనీ పరికరం తనకు అనుకూలంగా ఉంటుందో నిర్ణయించుకునే స్వేచ్ఛ రైతుకే ఉండేలా ప్రభుత్వం విధానాలను రూపొందించిందని తెలిపారు. వ్యవసాయ రంగంలో ఆధునిక యాంత్రీకరణను మరింత విస్తరించి, రాష్ట్ర రైతాంగానికి మరింత ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు చేపడుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు.

Read More

కలుపు మాయం… పాదులు సిద్ధం

ఉద్యాన పంటల్లో చెట్లచుట్టూ కలుపు తీయాలన్నా, పాదులు చేయాలనా రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు, దీనికి ఎక్కువ మంది కూలీలు అవసరం. పంటలకు ధరలున్నప్పుడు రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూలీలను పెట్టుకొని కలుపు తీయడం, పాదులు చేయించడం చేస్తారు. అదే ధరలు లేని సమయంలో ఈ పని తలకు మించిన భారం అవుతుంది. పంట దిగుబడికి ఈ పనులు తప్పనిసరి. అలాగే వదిలేస్తే చెట్లు బ్రతకకుండా ఉండే ప్రమాదం కూడా ఉంది.

ఇలాంటి పరిస్థితుల నుంచి గట్టెక్కిచ్చేందుకు ఒక ప్రత్యామ్నాయ పరికరాన్ని మెకానికల్ అడ్వాంటేజ్ అనే సూత్రం తో తయారు చేసి ఈ పరికారానికి సుదర్శన్ వీడర్ గా పేరు పెట్టారు ప్రొఫెసర్ ముప్పా లక్ష్మణ రావు

ఉద్యానవన పంటల్లో అంతర్ కృషి పరికరం

ఈ పరికరం కోసం ఒక పొడవాటి ఇనుప పైపును తీసుకొని చక్రా కారం లో వంచి కింద బాగాన చిన్న పాటి కర్రులు అమర్చి వెల్డింగ్ ద్వారా అనుసంధానం చేసి పరికరాన్ని తయారు చేశారు, చెట్టు వద్ద 5 నిముషాలలో కలుపు, పాది రెండూ చేసుకోవచ్చు. ఉద్యానవన రైతులకు ఈ పరికరం ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
ట్రాక్టర్లు, ఎద్దుల సహాయంతో రైతులు ఉద్యాన పంటల్లో కలుపు తీసే కార్యక్రమం చేస్తుంటారు. అయితే చెట్టు పాది లో అంతర కృషి చేయాలంటే మనుషుల సహాయం అవసరం ఉంటుంది.

ఈ పరికరాన్ని చెట్టుకు అమర్చి ఒక వ్యక్తి చుట్టూ తిరగడం వల్ల గుంటక తరహాలో మడకలు భూమిని చదును చేయడంతో పాటు పాది ఏర్పడుతుంది. దీనివల్ల రైతులకు ఖర్చు మిగులుతుంది. శ్రమ తక్కువగా ఉండటంతో పాటు ఒక్క మనిషి గంట వ్యవధిలోనే అర ఎకరా పొలం పూర్తి చేయవచ్చు.

దీనికి 4 వేల వరకు ఖర్చు వస్తుంది. చెట్టు సైజు ని బట్టి పరికరం ధర మారుతుంది.

రైతుల కోరితే వారికి తయారు చేసి ఇస్తారు. ఈ పరికరానికి పేటంట్ చేయడం జరిగింది. పేటెంట్ నెంబర్ :507641-001

ఈ పరికరం కోసం శ్రీ ఆంజనేయ స్మాల్ అగ్రి టూల్స్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ రైతునేస్తం ముప్పా లక్ష్మణరావు, ఫోన్ : 9849140465 లో సంప్రదించగలరు.

Read More

సాగు పరికరాలు అద్దెకు

రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గేలా సాగుకు అవసరమైన పరికరాలను అద్దెకు ఇచ్చేందుకు కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల (సీహెచ్‌సీ)ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. డ్వాక్రా మహిళా రైతులతో (వారి కుటుంబ సభ్యులు)కూడిన ఎఫ్‌పీవోల ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 520 ఫార్మర్‌ ప్రొడ్యూస్‌ ఆర్గనైజేషన్లు (ఎఫ్‌పీవో) ఉండగా వాటి పరిధిలో తొలి విడతగా 300 సీహెచ్‌సీలను ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఇవి అందుబాటులోకి రానున్నాయి. వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్ధకశాఖల సహకారంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

60 కోట్లు కేటాయింపు
జాతీయ జీవనోపాధుల కార్యక్రమం కింద సీహెచ్‌సీల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం 60 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ కేంద్రాలను నిర్వహిస్తారు. సీహెచ్‌సీల ఏర్పాటుకు ఒక్కో ఎఫ్‌పీవోకు రూ.20 లక్షలు చొప్పున ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది.

రైతులకు స్థానికంగా అవసరమయ్యే పరికరాలే అందుబాటులో ఉంచుతారు
రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో ఎఫ్‌పీవో పరిధిలో 1500 నుంచి 2 వేల మంది సన్నచిన్నకారు రైతులు సభ్యులుగా ఉన్నారు. ఇవి మండలానికి ఒకటి చొప్పున ఉన్నాయి. రైతులకు స్థానికంగా అవసరమయ్యే పరికరాలను కొని సీహెచ్‌సీల్లో ఉంచుతారు. రైతులకు ఈ పరికరాలను బహిరంగ మార్కెట్‌ కంటే తక్కువ ధరకు అద్దెకిస్తారు. సీహెచ్‌సీల నిర్వహణను ఎఫ్‌పీవోనే చూస్తుంది. వచ్చిన ఆదాయాన్ని తిరిగి వాటి నిర్వహణకే వెచ్చిస్తారు.

Read More

వ్యవసాయ యంత్రపరికరాలపై 50% సబ్సిడీ

గతంలో ఆగిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం పునరుద్ధరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.101.83 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. సన్నకారు, చిన్న, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50 శాతం, ఇతరులకు 40 శాతం సబ్సిడీతో 1,31,182 వ్యవసాయ పరికరాలు మంజూరు చేసేందుకు వ్యవసాయశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటికయ్యే ఖర్చులో కేంద్రం 60%, రాష్ట్రం 40% భరించనున్నాయి. వ్యవసాయ యాంత్రీకరణ (సబ్‌ మిషన్‌ ఆన్‌ అగ్రికల్చరల్‌ మెకనైజేషన్‌-స్మామ్‌) పథకం కింద కేంద్రం ఇస్తున్న నిధులకు తమ వాటా కలిపి పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్రం సన్నద్ధమైంది.

మార్గదర్శకాలు…
పేరొందిన 16 కంపెనీలను గుర్తించి ఎంప్యానెల్‌లో చేర్చింది. వాటి నుంచి రైతులు స్వయంగా పరికరాలను కొనుగోలు చేయాలి. సబ్సిడీని కంపెనీలకు అందజేస్తారు. పంపిణీ చేసిన పరికరాల వినియోగాన్ని వ్యవసాయాధికారులు ఐదేళ్లపాటు పర్యవేక్షించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో రూ.లక్ష కంటే ఎక్కువ సబ్సిడీ పొందిన వారు ఆరేళ్లవరకు, రూ.3 వేల నుంచి రూ.లక్ష వరకు పొందిన వారు మూడేళ్ల వరకు మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులుగా ప్రకటించింది. రూ. లక్ష, అంత కంటే ఎక్కువ విలువైన యంత్రాలకు జియో ట్యాగింగ్‌ చేస్తారు. ట్రాక్టర్లు, ఇతర స్వయం చాలిత యంత్రాలకు ఏఐ-ఆధారిత టెలిమాటిక్స్‌ కిట్‌ అమరుస్తారు. దీంతో యంత్రం ఎక్కడ ఉందో, ఎంత పని చేసిందో ట్రాక్‌ చేయవచ్చు. యంత్రాలపై చెరిపివేసే వీలు లేకుండా లేజర్‌ కట్‌తో గుర్తింపు సంఖ్య ఉంటుంది.

సబ్సిడీపై అందుబాటులో ఉండే యంత్రాలు…
విత్తనాలు చల్లే యంత్రాలు, కోత యంత్రాలు, స్ప్రేయర్లు, ట్రాక్టర్లతో నడిచే రొటోవేటర్లు, ప్లౌ, ట్రాలీ, సీడర్‌, కలుపు తీసే యంత్రాలు, పవర్‌ టిల్లర్లు, వీడర్లు, సీడ్‌ కమ్‌ ఫెర్టిలైజర్‌ డ్రిల్‌, స్ట్రాబాలర్లు, బండ్‌ ఫార్మర్‌ వంటి 15 రకాల యంత్రాలకు ఈ సబ్సిడీ వర్తింపజేస్తున్నారు. ప్రభుత్వం త్వరలో వీటిని పంపిణీ ప్రారంభించనుంది. ఈ పరికరాలతో పంటల దిగుబడి పెరగడంతో పాటు వ్యవసాయ పనుల్లో సమయం, ఖర్చు రెండూ తగ్గుతాయని అధికారులు అంటున్నారు.

Read More