ఔషధ మొక్క…. కాగితాల పువ్వు

కాగితాల పువ్వు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇది క్షీణిస్తున్న వాతావరణ పరిస్థితులలో కూడా పెరుగుతుంది. ఇది అన్ని చోట్లా పెరుగుతుంది. దీనిని హెడ్డి, పొద, ప్రాకే తీగగా కుండీల్లో పెంచవచ్చు. ఇది పదునైన మందమైన ముళ్ళు కలిగి ఉంటుంది. కనుక పశువులు, మేకలు, కోతులు, పక్షులు హని కలిగించవు. ఈ మొక్క సూర్యకాంతిని ఇష్టపడుతుంది. వేడి, పొడి వాతావరణంలో కొన్ని రకాలు కాంతివంతంగా, ఆకర్షణీయమైన రంగులలో పెరుగుతాయి. ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఈపూవుకి గుర్తింపుగా ఒక పోస్టల్ స్టాంప్‌ని విడుదల చేసింది.

సాధారణ నామం : బోగన్ విల్లియా శాస్త్రీయ నామం : బోగన్ విల్లియా గ్లాబ్రా/ బోగన్‌విల్లియా సైక్టాబాలిస్ కుటుంబం: నిక్టాజినేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • ఈ మొక్క ఆకులు పినిటోల్ అనే రాసాయనం కలిగియుండి మధుమేహ వ్యాధి చికిత్సలో ఉపయోగపడతాయి. డయాబెటిస్ చికిత్సలకు ఆకులను ఉపయోగిస్తారు.
  • కాగితాల పూలతో తయారు చేసిన టీని, శ్వాసకోశవ్యాధుల నివారణకు త్రాగిస్తారు.
  • ఈ మొక్క పూలు, కాండాలను ఎండబెట్టి నీటిలో మరిగించి టీ లాగా త్రాగుతారు.
  • ఆకులను డయేరియా, చికిత్సలలో ఉపయోగిస్తారు. దగ్గు, గొంతునొప్పి, ఎసిడిటి నివారణకు ఉపయోగిస్తారు.
  • పూల ద్రావణాన్ని తక్కువ రక్తపోటు చికిత్సకు ఉపయోగిస్తారు. కొమ్మలు హెపటైటిస్ చికిత్సలో ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • కాగితాల పువ్వు మొక్క ఆకుల పొడి (10 గ్రా. గాఢత) చిక్కుడు గింజలు నిల్వ సమయంలో ఆశించే బీన్‌వీలిల్, అకాంతో సెలిడెస్ ఓబ్టెక్టస్‌ని అత్యధికంగా చంపింది. (విల్సన్, అతని అనుచరుడు, 2016) ఆకులలో ఫినాల్ అధిక పరిమానంలో వున్నాయి కనుక కీటక నాశక చర్య ప్రదర్శించాయి. (లీ, అతని అనుచరులు, 1997)
  • కాగితాల పువ్వు మొక్క ఆకుల డ్రావణం టమాట, చిక్కుడు పంటల నాశించే అనేక వైరస్ తెగుళ్ళను నివారిస్తుంది.
  • ఆకుద్రావణం తయారీ: ఒక లీటరు నీటిలో 200 గ్రా. తాజా ఆకులను కలిపి కనీసం 5 నిమిషాలు మిక్సీలో కలపాలి.
  • కాగితాల పువ్వు మొక్క ఆకులు మిథనాల్ ద్రావణం వరి పంటనాశించే లద్దె పురుగు స్పోడోప్టెరా మరిషియా 3 నుండి 6వ దశ లార్వాలు, పూలపై లార్వా సైడల్‌పై మరియు ప్యూపెసైడల్ చర్య ప్రదర్శించాయి. ఆకుల ద్రావణం { కీటక పెరుగుదల క్రమబద్దీకరం, ఫ్యూఫెనోక్సురాన్ పిచికారి స్పొడోప్టెరా మరిషియా నివారణకు అత్యత్తమ ఎంపిక అని ఫలితాలు వెల్లడించాయి. (ప్రసీజ, అతని అనుచరులు, 2015)
  • బోగన్ విల్లియా ఆకు ద్రావణం ఈడెస్ ఈజిప్టు లార్వా, ప్యూపాలను చంపింది. (రాజమోహన్ Ê లోగన్ కుమార్, 2012)
  • బోగన్‌విల్లియా స్పెక్లిబాలిస్ ఆకు ద్రావణం అలసంద, పొద్దుతిరుగుడు పంటల నాశించే సన్‌ఫ్లవర్ నైక్రోసిస్ వైరస్‌లను తగ్గించింది (సోమేశ్వర్ భాగత్, అతని అనుచరులు, 2016)

బోగన్ విల్లియా ఆకుల కషాయం
కావలసిన పదార్థాలు: కలబంద ఆకులు – 1 కి., బోగన్ విల్లియా, ఆకులు 1 కి., బొప్పాయి ఆకులు – 1 కి. పసుపు పొడి – 200 గ్రా.

తయారు చేసే విధానం

  • పైన సూచించిన ఆకులను పసుపు పొడిని పైన పేర్కొన్న మోతాదులో తీసుకుని ఆకులను బాగా మెత్తగా నూరి 10 లీటర్ల నీరు పోసిన కుండలో వేసి దానికి 200 గ్రా. పసుపు పొడిని కలిపి పొయ్యిపై పెట్టి సన్నని సెగతో ఉడక బెట్టాలి. తర్వాత ఆ కషాయాన్ని బాగా చల్లారనివ్వాలి. ఈ విధంగా తయారైన కషాయాన్ని వడకట్టి ఒక డ్రమ్ములో పోయాలి. దీనికి 100 లీటర్ల నీరు కలిపి నిల్వ వుంచకుండా వేంటనే ఒక ఎకరంలో పంటపై సాయంత్రం వేళలో పిచికారి చేయాలి.
  • పంటకాలంలో పంట దశ,తెగులు ఉధృతిని బట్టి రెండు సార్లు పిచికారి చేసుకోవచ్చు.

నివారించబడే పురుగులు

  • బోగన్ విల్లియా ఆకులలో వున్న రసాయనాలు విత్తన నిల్వలో ఆశించే కీటకాల నాశణిగా, వికర్షినిగా పనిచేస్తాయి.
  • బోగన్‌విల్లియా ఆకులు బియ్యంలో ముక్కు పురుగులను పూలు, అపరాల గింజల నిల్వలో ఆశించే బీటిల్స్ నివారిస్తాయి.
  • బోగన్ విల్లియా ఆకుల కషాయం వేరుశనగ పంట నాశించే రసం పీల్చే పురుగుల నివారణకు బాగా పనిచేస్తాయి.

నివారించబడే తెగుళ్ళు

  • బోగన్ విల్లియా ఆకుల కషాయం పసుపు పెసర వంటి పంటల నాశించే ఆకుమచ్చ తెగుళ్ళను నివారిస్తుంది.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వర్మి కంపోస్టు తయారీలో మెళకువలు

నేల నాణ్యతను, భూ ఫలదతను కాపాడటానికి, ప్రస్తుత విస్తృత వ్యవసాయ సాగు విధానంలో సేంద్రియ ఎరువుల వాడకాన్ని పునరుద్ధరించడం ఎంతో అవసరం. పశువుల గెత్తము లభ్యత నానాటికి తగ్గిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, కొని వేసుకోవటం లాభదాయకం కాదు. కనుక, ప్రత్యామ్నాయంగా కంపోస్టు ఎరువులను సులభపద్ధతుల్లో తయారు చేసుకొని వేసుకోవటం ఎంతో అవసరం. దీని వల్ల వరిసరాల పరిశుభ్రత కూడా వస్తుంది. సాంప్రదాయ వ్యవసాయంలో ఒకప్పుడు నేలలో విరివిగా కనిపించే వానపాములు నేటి ఆధునిక వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వాడకం పెరగడం, సేంద్రియ ఎరువుల వాడకం తగ్గడం వలన వానపాముల సంఖ్య గణనీయంగా తగ్గడం జరిగింది. వానపాములు నేల ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్యపాత్ర వహిస్తాయని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఛార్లెస్ డార్విన్ మొట్టమొదటిగా 1881లో ప్రపంచానికి తెలియజేశారు.

వర్మికంపోస్టుకు అనువైన వానపాములు – రకాలు
వానపాములు వెన్నెముక లేని జీవులు. ఇందులో 3600 రకాలు ఉన్నాయి. వీటిలో సగం మాత్రమే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్నాయి. వీటిని రెండు రకాలుగా విభజించడం జరిగింది.

  1. బొర్రోయింగ్ అనగా బొరియలు చేయు రకము నేలను గుల్లచేసి భూమి లోపలి పొరలలో ఉంటాయి. మన దేశంలో ఈ రకమే ఎక్కువగా ఉంది. నీటి ఎద్దడిని బాగా తట్టుకుని 90 శాతం మట్టిని 10 శాతం వ్యర్థ పదార్థాలను ఆహారంగా తీసుకుంటుంది. 8 నుండి 10 అంగుళాల పొడవు ఉండి సుమారు 15 సంవత్సరాలు జీవిస్తుంది. అయితే ఈ రకం వానపాము వర్మి కంపోస్ట్ తయారీకి అంతగా పనికి రాదు.

ఉదా: ఫెరిటిమా ఎలాంగేటా, ఫెరిటిమా ఏసియాటికా మొదలగునవి

  1. నాన్ బొర్రోయింగ్ అనగా బొరియలు చేయని రకము భూమి పై పొరలలో ఉంటూ బొరియలు చేయని రకము. ఇది వర్మి కంపోస్ట్ తయారీకి బాగా అనుకూలంగా వుండి మట్టిలో గల సేంద్రియ పదార్థాలను తునాతునకలు చేసి జీవన ఎరువును తయారు చేస్తాయి. ఇవి 90 శాతం వ్యర్థ పదార్థాలను 10 శాతం మట్టిని ఆహారంగా తీసుకొని నాణ్యమైన కంపోస్ట్ గా మారుస్తాయి. వీటిలో పునరుత్పత్తి శక్తి ఎక్కువ. కనుక రైతులు ఇటువంటి రకాలను ఎన్నుకోవడం మంచిది. వీటి జీవిత కాలము సుమారు రెండున్నర సంవత్సరాలు.
    ఉదా: ఐసీనియా ఫొటెడ, యుడ్రిలస్ యూజిని మొదలగునవి.

వానపాములను ఉపయోగించి సేంద్రియ వ్యర్థ పదార్ధాల సద్వినియోగం: వానపాముల సంతతిని వృద్ధి చేయడాన్ని వర్మి కల్చర్ అని, అవి విసర్జించే పదార్థాలను వర్మి క్యాస్టింగ్స్ అని, వీటి ద్వారా తయారయ్యే ఎరువును వర్మి కంపోస్ట్ అని అంటారు. మానవునికి ఉపయోగంలేక, వదలివేసిన కుళ్ళిన కూరగాయలు, పండ్లు, ఆకులు, చెత్తా చెదారం, కొబ్బరి పీచు, పశువుల పెంట మొదలైన వాటిని వానపాములు ఆహారంగా తీసుకుంటాయి. ఇవి పర్యావరణంలోని వ్యర్థ పదార్ధాలను తిని, కాలుష్య నివారణకు తోడ్పడటమేగాక విలువైన ఎరువును రైతుకు అందిస్తాయి. వానపాముల ఉనికి, కదలికల వల్ల నేల గుల్లబారుతుంది. ఫలితంగా నేలలో గాలి, నీరు చొరబడే శక్తి పెరుగుతుంది.

వర్మి కంపోస్టు తయారీ విధానం:
తొట్టి సైజు : షుమారు 15 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల ఎత్తు.
తొట్టి తయారీ : సిమెంటు తొట్టిని 3 అడుగుల వెడల్పు x 1.5 అడుగుల ఎత్తులో వీలైనంత పొడవుగా తయారు చేసుకోవాలి. సిమెంటు వరలను కూడా ఇందుకు వాడుకోవచ్చు. ఈ సిమెంటు తొట్టి అడుగుభాగం నున్నగా, గట్టిగా ఉండేటట్లు ప్లాస్టరింగ్ చేయాలి. నీరు తొట్టిలో నిలబడకుండా, తొట్టికి ఒక వైపున చిన్న రంధ్రం ఏర్పాటు చేయాలి. సిమెంటు తొట్టికి ఎండ తగలకుండా, చల్లటి పందిరి నీడను కల్పించాలి. ముందుగా కంపోస్టు చేయవలసిన వ్యర్థపదార్థాలన్నిటినీ (చెత్త, ఆకులు, పంటకోసాక మిగిలిన పంట అవశేషాలు, పిచ్చిమొక్కలు మొదలైనవి) సుమారు ఒక నెల రోజుల పాటు ఒక గొయ్యిలో వేసి, అవి ఒక మాదిరిగా కుళ్ళే వరకు కుళ్ళబెట్టాలి. ఆ తరువాత పాక్షికంగా కుళ్లిన ఈ వ్యర్ధపదార్ధాలను తెచ్చి, వర్మి కంపోస్టు తొట్టిలో వేసి కంపోస్టు చేసుకోవాలి. అయితే తొట్టిలో వీటిని వేయబోయే ముందు తొట్టి అడుగున బెడ్డింగ్ మెటీరియల్ సుమారు 15 సెం.మీ. మందాన తయారు చేసుకోవాలి, ముక్కిన కొబ్బరి పీచు లేదా కొద్దిగా ముక్కిన చెరకు పిప్పిని ముక్కలుగా కొట్టి, సమానంగా తొట్టి అంతా పలుచగా పరచి వెయ్యాలి. బెడ్డింగ్ మెటీరియల్ వేశాక, దాని మీద పాక్షికంగా కుళ్లబెట్టి ఉంచుకున్న వ్యర్థ పదార్ధాలను వెయ్యాలి. తరువాత పేడ నీళ్లు చిలకరించాలి. కొద్దిగా ముక్కిన పేడను (10 సెం.మీ. మందాన) ఈ వ్యర్థ పదార్థాలను వేసిన పొరపైన వెయ్యాలి. పచ్చిపేడను వెయ్యకూడదు. వానపాములను (చదరపు మీటరకు వెయ్యి/1 కిలో చొప్పున) వర్మీ కంపోస్టు తొట్టిలోకి వదలాలి. వర్మికంపోస్టుకు అనువయిన వానపాములు బరియలు చేయని రకాలు: ఐసీనియా ఫోటెడా, యూడ్రిలస్ యూజిని ముఖ్యమైనవి. పాత గోనె సంచులను గాని (లేదా) వరిగడ్డిని గాని తొట్టిపైన కప్పాలి. ప్రతి రోజు పల్చగా నీరు చిలకరిస్తూ ఉండాలి. నీళ్ళు ఎక్కువగా పోయకూడదు. రెండు-మూడు నెలల్లో మంచి, సస్య పోషణ గల వర్మీ కంపోస్టు తయారవుతుంది. సిమెంటు తొట్టి నుండి తయారైన వర్మీ కంపోస్టును తీయటానికి 4-5 రోజుల ముందు, తొట్టిలో నీరు చల్లరాదు. ఇలా చేయటం వల్ల, వానపాములు తేమను వెదుక్కుంటూ తొట్టి అడుగు భాగానికి చేరతాయి. కనుక తయారైన కంపోస్టును తీసుకోవచ్చు. తొట్టిలో నుండి కంపోస్టును బయటకు తీసి, శంఖాకారంగా గుట్టలు, గుట్టలుగా పోసి, ముతక జల్లెడతో జల్లించి, పంట పొలాలకు వేసుకోవాలి. బాగా తయారైన వర్మీ కంపోస్టు, పొడి పొడిలాడుతూ కాఫీ రంగులో ఉంటుంది. సంవత్సరానికి ఈవిధంగా ఒక తొట్టి నుండి 4 సార్లు కంపోస్టు చేసుకోవచ్చు. దీని వల్ల షుమారు 3 టన్నుల కంపోస్టు లభిస్తుంది.

వర్మీ కంపోస్ట్ ఉపయోగాలు :

  • నేల ఉత్పాదకతకు కావాల్సిన అనుకూల లక్షణాలు పెరుగుతాయి.
  • వేసిన పైరుకే కాక తర్వాత 2-3 పైర్లపై దీని ప్రభావం ఉంటుంది.
  • మొక్కలకు కావాల్సిన అన్ని పోషకాలు ఇందులో లభ్యమవుతాయి. పోషకాల సమతుల్యత ఉంటుంది.
  • వర్మీ కంపోస్ట్ తయారు చేయడం సులభం, ఖర్చు తక్కువ
  • రసాయన ఎరువులు వాడాల్సిన ఆవశ్యకత తగ్గి ఖర్చు ఆదా అవుతుంది.
  • పలు రకాల ఎంజైములు, హార్మోన్లు, అమైనోఆమ్లములు తయారై, మొక్కలు చురుకుగా పెరగడానికి తోడ్పడతాయి.
  • రోగ నిరోధక శక్తి పెంచే ఆక్సినోమైట్లు తయారవడం వల్ల పైరు ఆరోగ్యంగా ఉండి పురుగుమందులు వాడాల్సిన ఆవశ్యకత తగ్గి, లాభం చేకూరుతుంది.
  • భూమిలో ఉపయోగకరమైన సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. నేల సహజసిద్ధమైన ఆరోగ్యం కలిగి ఉంటుంది.
  • కూరగాయలు, పండ్లు, ఇతర ఉత్పత్తుల నాణ్యత పెరుగుతుంది. వాటికి మంచి రంగు, రుచీ, వాసన, రవాణాలో నిల్వ ఉండే గుణం పెరుగుతుంది.
  • సేంద్రియ వ్యర్ధాలను వర్మీ కంపోస్టు తయారీకి ఉపయోగించడం వల్ల, మంచి ఎరువు లభ్యమవుతుంది. పరిసరాల కాలుష్య నివారణకు తోడ్పడుతుంది.
  • దిగుబడితో పాటు ఫలసాయం నాణ్యత పెరుగుతుంది.

వర్మీ కంపోస్టుకు ఉపయోగించిన వ్యర్థ పదార్ధాలను బట్టి, స్థానిక వాతావరణం పరిస్థితులను బట్టి, తయారైన కంపోస్టులోని పోషకాల శాతంలో కొద్దిపాటి తేడాలుండవచ్చు. నత్రజని 1.5 నుండి 2.0 శాతం, భాస్వరం 0.5 నుండి 1.5 శాతం, పొటాషియం 0.5 నుండి 1.00 శాతం ఉంటుంది. ఇవికాక కాల్షియం, మెగ్నీషియం, గంధకం, రాగి, ఇనుము, మాంగనీసు, జింకు, మాలిబ్డినం, బోరాన్ పోషకాలు కూడా లభిస్తాయి. సాధారణ పైర్లన్నింటికి ఎకరానికి 1.0 నుండి 1.5 టన్నుల చొప్పున వర్మీ కంపోస్టు వేయవచ్చు. కుండీలలోని మొక్కలకు 200 గ్రా. చొప్పున వేయవచ్చును.

వర్మీ వాష్: వానపాముల శరీర భాగాల నుండి అవి విసర్జించే వర్మి క్యాస్టింగ్స్ నుండి తయారయ్యే ద్రవాన్ని “వర్మీ వాష్” అంటారు. ఇందులో మొక్క పెరుగుదలకు దోహదపడే హార్మోన్లు, అమైనో అమ్లములు, విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

తయారీ విధానం: వానపాములు ఉండడానికి అనువుగా బెడ్ ఏర్పాటు చేయాలి. దీనికి ఒక పెద్ద సైజు మట్టి పాత్ర (కుండ) లేదా పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ము ఉపయోగించుకోవచ్చు. పాత్ర అడుగు భాగంలో ఒక రంధ్రం ఏర్పాటు చేసి, దానిని దూది సహాయంతో మూసి ఉంచాలి. పాత్ర అడుగు భాగాన్ని మొదటి 3-4 అంగుళాలు ఇసుకతో ఆపైన 3 అంగుళాలు చిన్న చిన్న ఇటుక ముక్కలు, రాళ్ళతో నింపాలి. దీనిమీద బాగా మాగిన సేంద్రియపదార్ధాన్ని పాత్రలో నాలుగింట మూడు వంతుల వరకు నింపాలి, ఇందులో వీలయినన్ని ఎక్కువ (150 నుండి 200) వానపాములు వదలాలి. పాత్రలో ఎల్లప్పుడు 50-60 శాతం తేమ ఉండేటట్లు ప్రతిరోజు నీటిని చిలకరిస్తూ ఉండాలి. వానపాముల విసర్జన పూర్తిగా తయారైన తర్వాత ఎక్కువ నీరు పోయాలి. పాత్ర అడుగు భాగంలోని రంధ్రం నుండి టీ డికాక్షన్ వంటి ద్రవం బొట్టు బొట్టుగా స్రవించడం మొదలవుతుంది. దీనిని సేకరించాలి. ఇలాగే మరో రెండు సార్లు నీరు పోసి వచ్చిన ద్రవాన్ని సేకరించాలి. దీనినే వర్మి వాష్ అంటారు. ఇది అత్యంత విలువైన సేంద్రియ ద్రవ ఎరువు. సేంద్రియ పదార్ధమంతా వర్మి క్యాస్టింగ్గా మారి పోయినప్పుడు, దానిని తీసివేసి కొత్తగా సేంద్రియ పదార్థాన్ని వేస్తే వానపాముల నుండి మరల క్యాస్టింగ్స్ తయారవడం ప్రారంభమవుతుంది. ఇదే పద్ధతి పలుమార్లు ఆచరించడం వల్ల అవసరమైనంత వర్మివాష్ లభిస్తుంది.

పోషక విలువలు: నత్రజని – 500 పి.పి.యం., భాస్వరం – 390 పి.పి.యం., పొటాషియం- 460 పి.పి.యం. కాల్షియం-540 పి.పి.యం.. మెగ్నీషియం-110 పి.పి.యం., ఇనుము-273 పి.పి.యం., మాంగనీసు- 180 పి.పి.యం., జింకు – 180 పి.పి.యం., రాగి-21 పి.పి.యం.

వెర్మి కల్చర్: వానపాముల సంతతిని వృద్ధి చేయడాన్ని వర్మికల్చర్ అంటారు. వానపాములను ఎక్కువ సంఖ్యలో అభివృద్ధి చేయడానికి 1:1 నిష్పత్తిలో పేడ మరియు ఎండిన ఆకులను కలుపుకోవాలి. ఇలా కలుపుకొన్న, ప్రతీ 10 కిలోల వ్యర్థ పదార్ధాలకు 50 వానపాములు చొప్పున వదులుకుని, నీడలో పెట్టుకొని అనుకూలమైన వాతావరణ పరిస్థితులు కల్పిస్తే (ఉష్ణోగ్రత 15-30° సెంటీగ్రేడ్, తేమ శాతం 70-80%) రెండు నెలల్లో వానపాముల సంఖ్య వంద రెట్లు పెరుగుతుంది.

డా.ఎం.ఎం.వి. శ్రీనివాసరావు, ప్రధాన శాస్త్రవేత్త(సస్యపోషణ), డా.కె. లక్ష్మణ, ప్రధాన శాస్త్రవేత్త(విస్తరణ), డా.కే. తేజేశ్వర రావు, ప్రధాన శాస్త్రవేత్త(సస్యపోషణ), ఏరువాక కేంద్రం మరియు వ్యవసాయ పరిశోధన స్థానం, విజయనగరం. మొబైల్ నెంబర్ : 9440123223

Read More