సేంద్రీయ వరి సాగులో చీడపీడల యాజమాన్యం

సేంద్రీయ వ్యవసాయం అనేది కృత్రిమ ఎరువులు, పురుగుమందులు, జన్యుపరంగా మార్పు చెందిన విత్తనాలు వంటి రసాయనాలను వాడకుండా, సేంద్రీయ పదార్థాలు, జీవ -ఎరువులు (కంపోస్ట్, పచ్చిరొట్ట), జీవ-నియంత్రణ పద్ధతులను ఉపయోగించి నేల సారవంతాన్ని, పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యాన్ని పెంపొందించే ఒక సుస్థిర వ్యవసాయ పద్ధతి. 1956-60 మధ్య కాలంలో రసాయన ఎరువుల వాడకం ప్రారంభమై, క్రమేపి వాటి వాడకం పెరిగి, కేవలం రసాయనిక ఎరువులు మాత్రమే వాడే పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. రసాయనిక ఎరువులు మాత్రమే కాకుండా పురుగు మందులు, తెగులు మందులు, కలుపు మందులు, పంటలు ఏపుగా పెరగటానికి కృత్రిమ హార్మోన్ల వాడకం పెరిగింది. రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను, పచ్చిరొట్ట ఎరువులను, పంట అవశేషాలను నేలకు అందించమని చెపుతున్నప్పటికీ సమగ్ర పంట విధానాలను పక్కన పెట్టి కేవలం రసాయనాలతో మాత్రమే మొక్కకు పోషణ అందిస్తూ నేల ఆరోగ్యాన్ని పక్కన పెట్టేయడంతో నేలలో నీటిలో, పంట ఉత్పత్తులలో అనేక హానికర రసాయన అవశేషాలు చేరడం అనేది చాలా ఆందోళన చెందవలసిన అంశం. అయితే ప్రస్తుతం నెలకొన్న తీవ్ర పరిణామాలు చూసినట్లయితే ముఖ్యంగా నేల, నీరు, వాతావరణం కలుషితమవ్వడంతో పాటు తినే ఆహార పదార్ధాలలోనికి విషపూరిత పదార్ధాలు చేరడం, మానవ ఆరోగ్యంపై వాటి ప్రభావం పడడం వంటి అంశాలను ప్రతి రైతు గ్రహించి తన సేద్య విధానాలను మెరుగు పర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఒక క్రమ పద్ధతిలో, ప్రణాళికాబద్ధంగా, దశల వారీగా రైతు సేంద్రియ సాగు విధానాలను అలవాటు చేసుకుంటూ రసాయనిక సేద్యాన్ని తగ్గించుకోవలసిన అవసరం తప్పనిసరిగా ఉంది. వరి సాగులో అనేక రకాల చీడపీడలు ఆశించి నష్టాన్ని కలుగచేస్తాయి. వీటి నివారణకు సేంద్రీయ పద్ధతులను అవలంభించడం వలన సాగు ఖర్చు తగ్గి నాణ్యమైన పంట ఉత్పత్తులను పొందవచ్చు.

వరిని ఆశించు చీడపురుగులు

కాండం తొలుచు పురుగు

  • నారు కొనలను త్రుంచి నాటుకొన్నట్లైతే గుడ్ల సముదాయాన్ని నివారించడం ద్వారా కాండం తొలుచు పురుగును నివారించుకోవచ్చును. అధికంగా ఉన్న నారును నేలలో కలిపి వేయాలి.
  • పురుగు ఉధృతి తెలుసుకోవడానికి మరియు నివారణకు ఎకరానికి 40 చొప్పున పక్షి స్థావరాలు, 8 చొప్పున లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి.
  • పొలం గట్లపై కలుపు లేకుండా చూసుకోవాలి.
  • ట్రైకోగ్రామా జపానికం అనే గుడ్డు పరాన్న జీవిని ఎకరానికి 40,000 గ్రుడ్ల సముదాయం ఉన్నకార్డులను మూడు దఫాలుగా నాటిన 20 రోజుల నుండి పొలంలో విడుదల చేసుకొన్నట్లైతే కాండం తొలుచు పురుగును సమర్ధవంతంగా నివారించుకోవచ్చును
  • పశువుల పేడ (5 కిలోలు), పశువుల మూత్రం (5 లీటర్లు) 4 రోజులు మురగ బెట్టిన తర్వాత 150 గ్రాముల సున్నం కలుపుకొని 100 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరా పొలానికి పిచికారీ చేసుకోవాలి (లేదా)
  • ఆవుమూత్రం, పచ్చిమిర్చి మరియు వేప ఆకుల కషాయం ఎకరానికి 3-4 లీటర్ల కషాయం 100 లీటర్ల నీటిలో కలుపుకొని మొక్కలపై పిచికారీ చేయడం ద్వారా కాండం తొలుచు పురుగును నివారించవచ్చును (10 లీటర్ల మూత్రానికి, ఒక కిలో పచ్చి మిరప కాయల ముద్ద 5 కిలోల వేపాకుల ముద్దను చేర్చి ఉడికించి చల్లారిన తర్వాత గుడ్డతో వడగట్టి 3-4 దఫాలుగా వాడుకోవచ్చును).

ఆకు ముడత

  • వేసవి దుక్కులు చేయడం ద్వారా సుప్తావస్థలో ఉన్న పురుగు గ్రుడ్ల సముదాయాన్ని మరియు కలుపు విత్తనాలను నిర్మూలించవచ్చు.
  • వేపనూనె (1500 పి.పి యం) లీటరు నీటికి 5 మి.లీ. కలుపుకొని నాటిన 20 మరియు 30 రోజులకు పిచికారి చేసుకోవాలి (లేదా)
  • ఆవుమూత్రం, సీతాఫలం ఆకులు మరియు వేప ఆకుల కషాయం ఎకరానికి 2-3 లీటర్లు, 100 లీటర్ల నీటిలో కలుపుకొని మొక్కలపై పిచికారీ చేయడం ద్వారా ఆకు ముడత నివారించవచ్చును (10 లీటర్ల మూత్రానికి, 2 కిలోల సీతాఫలం ఆకుల ముద్ద, 5 కిలోల వేపాకుల ముద్దను చేర్చి ఉడికించి చల్లారిన తర్వాత గుడ్డతో వడగట్టి 3-4 దఫాలుగా వాడుకోవచ్చును).
  • బాసిల్లస్ తురంజెన్సిస్ లీటరు నీటికి 2 మి.లీ. చొప్పున కలుపుకొని నాటిన 30-40 రోజుల మధ్యలో పిచికారీ చేసుకొన్నట్లైతే ఆకు ముడతను నివారించుకోవచ్చును.
  • ట్రైకోగ్రామా అనే గుడ్డు పరాన్న జీవిని ఎకరానికి 20,000 గ్రుడ్ల సముదాయం ఉన్న కార్డులను మూడు దఫాలుగా నాటిన 15 రోజుల నుండి పొలంలో విడుదల చేసుకొన్నట్లైతే ఆకు ముడతను సమర్ధవంతంగా నివారించుకోవచ్చును.

దోమ పోటు

  • తట్టుకునే రకాలైన ఇంద్ర, అమర, కృష్ణవేణి, భావపురి సన్నాలు మరియు శ్రీధృతి రకాలను ఎంచుకోవాలి.
  • దోమపోటు నివారణకు కాలి బాటలు తీయడం (ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల కాలిబాటలు తీసుకోవాలి)
  • పొలానికి వైకల్పికంగా నీరు కట్టడం మరియు ఆరబెట్టడం చేయాలి.
  • మెటారైజియం లేదా బవేరియా లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలుపుకొని రెండు సార్లు పిచికారి చేసుకోవాలి మరియు వేపనూనె లీటరు నీటికి 5 మి.లీ. చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకొన్నట్లైతే నివారించుకోవచ్చును.
  • ఉదయం పూట వరి తవుడుతో (5-10 కి.) పాటు వేపనూనె ఒక లీటరు కలుపుకొని పొలంపై చల్లుకున్నట్లైతే దోమను కొంత వరకు తగ్గించుకోవచ్చును.
  • ఆవుమూత్రం మరియు తూటికాడల కషాయం ఎకరానికి 100 లీటర్లు మొక్కల మొదళ్ళపై పడేటట్లు పిచికారీ చేసుకోవడం ద్వారా దోమను నివారించవచ్చును (15 లీటర్ల మూత్రానికి, 10 కిలోల తూటికాడల ముద్దను చేర్చి ఉడికించి చల్లారిన తర్వాత 100 లీటర్ల నీటిలో కలుపుకొని వాడుకోవచ్చును).
    ఆకు నల్లి/ కంకి నల్లి, కంపు నల్లి
    ܀ ఆవుమూత్రం మరియు తూటికాడల కషాయం ఎకరానికి 100 లీటర్లు మొక్కల మొదళ్ళపై పడేటట్లు పిచికారీ చేసుకోవడం ద్వారా దోమను నివారించవచ్చును (15 లీటర్ల మూత్రానికి, 10 కిలోల తూటికాడల ముద్దను చేర్చి ఉడికించి చల్లారిన తర్వాత 100 లీటర్ల నీటిలో కలుపుకొని వాడుకోవచ్చును).

వరిని ఆశించు తెగుళ్లు

  1. అగ్గితెగులు, పొడ తెగులు, దుబ్బు కుళ్ళు, గోధుమ రంగు మచ్చ
  • తట్టుకొనే రకాలను ఎంచుకోవాలి.
  • పొలంలో మరియు పొలం గట్ల పై కలుపు లేకుండా చూసుకోవాలి.
  • సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ కిలో విత్తనానికి 10 గ్రాములు చొప్పున లేదా లీటరు నీటికి 20 గ్రాముల చొప్పున కలుపుకొని లేదా లీటరు నీటికి 30 మి.లీ పంచగవ్య ద్రావణాన్ని కలుపుకొని 20 నిముషాలు పాటు విత్తనాన్ని లేదా నారును శుద్ధి చేసుకోవాలి.
  • లీటరు నీటికి 30 మి.లీ. పశువుల మూత్రాన్ని కలుపుకొని 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి.
  • ఎకరానికి 2 కిలోల చొప్పున సూడోమోనాస్ ప్లోరసెన్స్ నేలకు వేసుకోవాలి.
  • పచ్చిరొట్ట పంటలనునేలలో కలియ దున్నుకోవాలి.
  • మజ్జిగ (1 లీటరు) మరియు పశువుల మూత్రం (1 లీటరు) 8 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి.
  • వరిలో వచ్చే చాలా రకాల తెగుళ్ళను మారేడు ఆకులు మరియు పశువుల మూత్రం మిశ్రమంతో కొంతవరకు తగ్గించవచ్చును (ఒక కిలో మారేడు ఆకులు తీసుకొని 5 లీటర్ల నీటిలో ఉడకపెట్టి చల్లారిన తర్వాత 5 లీటర్ల పశువుల మూత్రం మరియు 100 గ్రాముల సున్నం కలుపుకొని, దీనిని 100 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరా పొలానికి పిచికారీ చేయాలి).
  1. కాండం కుళ్ళు లేదా దుబ్బు కుళ్ళు తెగులు
  • నీటిని ఎప్పటికప్పుడు బయటకు తీసివేయడంతో పాటు మురుగునీరు పొలంలో లేకుండా చూసుకోవాలి.
  • సేంద్రియ ఎరువులను నేలకు అందించడం ద్వారా తెగులు ఉధృతి తగ్గించవచ్చును. * మారేడు ఆకులు మరియు పశువుల మూత్రం మిశ్రమంతో తగ్గించవచ్చును (ఒక కిలో మారేడు ఆకులు తీసుకొని 5 లీటర్ల నీటిలో ఉడకపెట్టి చల్లారిన తర్వాత 5 లీటర్ల పశువుల మూత్రం మరియు 100 గ్రాముల సున్నం కలుపుకొని, దీనిని 100 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరా పొలానికి పిచికారీ చేయాలి).
  1. ఆకు ఎండు తెగులు
  • తట్టుకునే రకాలైన ఇంద్ర, అమర, పుష్యమి, స్వర్ణ. అక్షయ వంటి రకాలను ఎంచుకోవాలి.
  • 10 లీటర్ల నీటికి 100 మి.లీ. వర్మీవాష్ మరియు 50 మి.లీ. పశువుల మూత్రం కలుపుకొని పంటపై పిచికారీ చేసుకోవాలి లేదా పశువుల పేడ మరియు ఇంగువ ద్రావణాలను (10 శాతం) పిచికారీ చేయడం ద్వారా ఎండు తెగులును నివారించవచ్చును (5 కిలోల పశువుల పేడ, 5 లీటర్ల మూత్రంతో పాటు 500 గ్రాముల బెల్లాన్ని కుండలోనికి తీసుకొని 5 రోజుల పాటు కలుపుకుంటూ 5వ రోజు 100 గ్రాముల ఇంగువను కలపాలి, 10 లీటర్ల కు 100 లీటర్ల నీటిని కలుపుకొని పిచికారీ చేసుకోవాలి).
  • ఒక పొలం నుండి వేరొక పొలానికి నీరు పెట్టడం ఆపివేయాలి.
  • పొలంగట్లపై పెద్ద చెట్లు లేకుండా చూసుకోవాలి.

డా. కె. రేవతి (సస్యరక్షణ శాస్త్రవేత్త) మరియు డా డి సుధా రాణి (సీనియర్ శాస్త్రవేత్త & అధిపతి)
కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటసాల, కృష్ణా జిల్లా – 521 133. Ph: 8008201253

Read More

ఔషధ మొక్క…. వేప

వేప జన్మ స్థానం భారతదేశం. ఈ చెట్టు సుమారుగా 50 అడుగుల దాకా ఎత్తు పెరుగుతుంది. ఫిబ్రవరి, మార్చిలలో పూలు పూస్తాయి. పూలు తెలుపు రంగులో గుత్తులుగుత్తులుగా ఉండి మంచి సువాసన కలిగి ఉంటాయి. ఏప్రిల్ మాసం చివరికి కాయలు వస్తాయి. వేప చెట్టులోని బెరడు, ఆకులు, కాయలు, పండ్లు, గింజలు, ఆకులు, కలప సమస్తం ఉపయోగపడుతాయి. వేప, మన నిత్య జీవితంలో ఆరోగ్య సమస్యలకు ఔషధముగా, సౌందర్య సాధనాలుగా, వ్యవసాయంలో క్రిమిసంహారిణిగా, ఎరువుగా, కలపగా ఉపయోగపడుతుంది. వేప పువ్వుని సేకరించి ఎండబెట్టి చూర్ణం చేసి ఎన్నో జీర్ణశక్తిని పెంచే ఔషధాలలో వాడుతారు. వేప కలపకు దీర్ఘకాలం మన్నే గుణం ఉంది. అందుకే ఈ కలపను నిర్మాణ రంగంలో విరివిగా ఉపయోగిస్తారు. వ్యవసాయ పనిముట్ల తయారీకి కూడా వాడతారు. వేప బెరడును చర్మవ్యాధులకు, జ్వరాలకు, అంటువ్యాధులకు సంబంధించిన ఔషధాలలో వాడుతారు.

సాధారణ నామం : వేప శాస్త్రీయ నామం : అజాడిరిక్టా ఇండికా కుటుంబం: మీలియేసి

ఉపయోగాలు : వ్యవసాయరంగంలో

  • వేప గింజలతో తీసిన నూనెను సౌందర్య సాధనాల తయారీకి, ఔషధాల తయారీలో, వ్యవసాయ రంగంలో క్రిమిసంహారిణిగా వాడుతారు.
  • వేప గింజల నుండి తయారైన వేప పిండిని ఎరువులలో, క్రిమిసంహారక మందులలో వాడుతారు.
  • వేపపిండి, వేపాకులు భూమిలో వేసి కలియదున్నట వలన కొన్ని రకాల శిలీంద్ర తెగుళ్ళను నివారించవచ్చు.
  • వేపనూనె పిచికారి చేయటం వలన, జామ, కాలీఫ్లవర్, సపోటా, అరటి వంటి పండ్ల మొక్కలను ఆశించే నులి పురుగులను సమర్ధవంతంగా ఎదుర్కొనవచ్చు.
  • వేప గింజల పొడిని వరి, గోధుమ, జొన్న, పప్పుధాన్యాల వంటి గింజలలో కలిపి నిలువ చేస్తే కీటకాల బారి నుంచి అరికట్టవచ్చు. వందకిలోల ధాన్యానికి ఒక కిలో వేప గింజల పిండి సరిపోతుంది. దీని వలన ధాన్యం రంగు, రుచి, వాసనల్లో ఎలాంటి మార్పులు రావు. అంతేకాదు. సుమారు 9 నెలలు సురక్షితంగా నిల్వ చేసుకోవచ్చు. ధాన్యం నిల్వ కాలాన్ని పొడిగించాలంటే, మళ్ళీ ఇంకొక కిలో వేప గింజల పొడి చేర్చి నిల్వ చేసుకోవచ్చు.
  • టమాట నారు నాటే ముందు వేప నూనె ద్రావణంలో గాని, వేప గింజల కషాయంలో గాని ముంచి నాటినట్లయితే ఎండుతెగులును అరికట్టవచ్చు.
  • మిరపలో వేరు పురుగుల బెడదను నివారించటానికి 250 కిలోల వేపపిండిని ప్రతి హెక్టారు విస్తీర్ణంలో ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి.
  • వేప నూనె మందుల్ని ఉదయం లేదా సాయంత్రం పూట చల్లని వాతావరణంలో పిచికారి చేయవలసి ఉంటుంది. అంతేకాని, మిట్ట మధ్యాహ్నపు ఎండలో పిచికారీ చేసినట్లయితే సూర్యరశ్మి వలన దీని ప్రభావం త్వరగా తగ్గిపోతుంది. – రాంబాబు, ఆహార్ కుటీర్

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More