జిల్లాలవారీగా జొన్నకొనుగోలు కేంద్రాల ఏర్పాటు

తెలంగాణా రాష్ట్రంలోరూ.1,100 కోట్లతో జిల్లాలవారీగా జొన్న కొనుగోళ్లను ప్రారంభిస్తామని మొక్కజొన్న రైతులను ఆదుకునేందుకు మరో రూ.1,800 కోట్లతో అదనంగా కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఆయన తన నివాసంలో మాట్లాడుతూ.. “యాసంగి సీజన్‌లో మొక్కజొన్న సాగు 16.13 లక్షల ఎకరాలకు పెరిగింది. మొత్తం ఉత్పత్తి 42.87 లక్షల టన్నులకు చేరింది. మార్క్‌ఫెడ్ ద్వారా ఇప్పటికే రూ.4,172.94 కోట్లతో 12.85 లక్షల టన్నులు కొనుగోలు చేశాం. మరో 6.53 లక్షల టన్నులు అదనంగా కొనుగోలు చేస్తాం. రాష్ట్రంలో 4.03 లక్షల ఎకరాల్లో 4.03 లక్షల టన్నుల జొన్న ఉత్పత్తి అయింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.1,100 కోట్లతో కొనుగోళ్లు చేపడతాం. ఆదిలాబాద్ జిల్లాలో 26, సంగారెడ్డి జిల్లాలో 10, కామారెడ్డి జిల్లాలో 43, మెదక్, వికారాబాద్, జోగులాంబ గద్వాల, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కోటి చొప్పున కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. దీంతోపాటు 10,175 టన్నుల పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేస్తాం” అని వెల్లడించారు.

Read More

నూనెగింజలు, ఆయిల్‌పామ్‌ పంటలే లాభదాయకం

తెలంగాణలో రైతులు నూనె గింజలు, ఆయిల్‌పామ్‌ పంటలను అత్యధికంగా సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ప్రభుత్వపరంగా రైతులను అన్నివిధాలా ప్రోత్సహిస్తామని తెలిపారు. జాతీయ నూనె గింజల పథకం కింద రూ.46.14 కోట్లతో 2025-26కి గాను మేలిమిరకం వేరుసెనగ విత్తనాల ఉచిత పంపిణీని మంగళవారం సచివాలయం నుంచి ప్రారంభించారు. ‘ఇతర పంటల కంటే నూనెగింజలు, ఆయిల్‌పామ్‌కు మంచి డిమాండ్‌ ఉంది. సాగును పెంచేందుకు వీలుగా 38,434 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను మహబూబ్‌నగర్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, నల్గొండ జిల్లాల్లో ఎంపిక చేసిన రైతులకు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ల ద్వారా పంపిణీ చేయించాం. నూనెగింజల పంటలకు యూరియా వాడకాన్ని తగ్గించి, సమతుల ఎరువుల వాడకాన్ని అలవర్చుకోవాలి’ అని తుమ్మల సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్యదర్శి సురేంద్ర మోహన్‌, సంచాలకుడు గోపి తదితరులు పాల్గొన్నారు.

Read More

ఆయిల్‌పామ్‌ సాగుతో లాభాలు

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఈ రోజు వికారాబాద్‌ జిల్లా కోత్రేపల్లి గ్రామంలో నిర్వహించిన మేగా ఆయిల్‌ పామ్‌ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడుతూ ఆయిల్‌ పామ్‌ సాగు ప్రాధాన్యత, దీని ద్వారా లభించే ఆర్థిక లాభాలు, మరియు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహక చర్యలను వివరించారు.

Read More

రైతుముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి అనూహ్య స్పందన – PJTAU ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య

600 గ్రామాల్లో 37,000 రైతులతో అవగాహన కార్యక్రమం

  • రైతుల్లో అసంతృప్తి లేదు.. కానీ చేయాల్సింది చాలా ఉంది

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాఖ సహకారంతో నిర్వహిస్తున్న వినూత్న కార్యక్రమం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ రాష్ట్రవ్యాప్తంగా నిరాటంకంగా, విజయవంతంగా సాగుతోంది. మే 5వ తేదీన వికారాబాద్ జిల్లా ధరూర్ లో ఈ కార్యక్రమాన్ని శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ శ్రీ M. కోదండ రెడ్డి, PJTAU ఉపకులపతి డాక్టర్ అల్దాస్ జానయ్య లాంచనంగా ప్రారంభించారు. ఆరోజు నుండి ఈ కార్యక్రమం నేటి వరకు 600 గ్రామాల్లో నిర్వహించగా సుమారు 31,000 మంది పురుషులు, 6,000 మంది మహిళలు పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం 37,000 మంది రైతులతో శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ విద్యార్థులు ముఖాముఖిగా మాట్లాడారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ MP డాక్టర్ మల్లురవి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ G. చిన్నారెడ్డి, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు, ఎమ్మెల్సీలు, సుమారు 25 మంది శాసనసభ్యులు, వివిధ స్థాయి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అదేవిధంగా శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ విద్యార్థులతో పాటు వారంలో ఒకరోజు ఉపకులపతి, ఇతర విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. PJTAU శాస్త్రవేత్తలు, విద్యార్థులు, వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులు, అభ్యుదయ రైతులు, రైతు గ్రూపులు, సంఘాల ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఆరు అంశాలైన తక్కువ యూరియా వాడి సాగు ఖర్చును తగ్గించడం, అవసరం మేరకే రసాయనాలను వాడి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడడం, వివిధ ఇన్ పుట్స్ కొనుగోలుకు సంబంధించిన రశీదులని భద్రపరచుకోవడం, సాగునీటిని ఆదా చేయడం, పంట మార్పిడులను పాటించి సుస్థిరాదాయాన్ని పొందడం, చెట్లను నాటి పర్యావరణాన్ని రక్షించడం వంటి వాటిపై శాస్త్రవేత్తలు, వ్యవసాయ విద్యార్ధులు రైతాంగానికి అవగాహన కల్పిస్తున్నారు. అలాగే రైతులు అడుగుతున్న అనేక సందేహాలను శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో నివృత్తి చేస్తున్నారు.

ఉపకులపతి సమీక్ష :-

   మూడు వారాలుగా సాగుతున్న 'రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు' కార్యక్రమం పై ఉపకులపతి అల్దాస్ జానయ్య ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ కార్యక్రమానికి రైతాంగం నుంచి మంచి స్పందన వస్తుందని వివరించారు. ప్రభుత్వం రైతాంగానికి అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రస్తుత వ్యవసాయ పరిస్థితుల పై రైతాంగంలో ఎటువంటి అసంతృప్తి లేదని జానయ్య స్పష్టం చేశారు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాల కారణంగా రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతుందని తెలిపారు. అలాగే ఇంకా కొన్ని వ్యవసాయ అంశాలకి ప్రభుత్వపరంగా ప్రోత్సాహం ఇవ్వవలసిందిగా రైతులు కోరుతున్నారని జానయ్య అన్నారు.  ముఖ్యంగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఎదురయ్యే నష్టాల్ని అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం పంటల బీమా సదుపాయం ప్రవేశపెట్టాలని రైతులు కోరుకుంటున్నారని, అలాగే చిన్న, సన్నకారు రైతులకి ఆధునిక వ్యవసాయ పనిముట్లని మరియు పచ్చి రొట్ట విత్తనాలను రాయితీపై  అందించాలని, విస్తృతంగా భూసార పరీక్షలు నిర్వహించాలని రైతాంగం కోరుకుంటున్నారని అల్దాస్ జానయ్య వివరించారు. ఇదే స్ఫూర్తితో రైతు సోదరులు, మహిళలు, అభ్యుదయ రైతులు, రైతు గ్రూపులు, సంఘాల ప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని  దీన్ని ఒక సామాజిక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఉపకులపతి కోరారు.
Read More