ఆదుకుంటాం.. ఆందోళన చెందొద్దు
అకాల వర్షాలు, వడగళ్ల వానతో జరిగిన పంటనష్టంపై చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాలవర్షాలు, వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, అన్నదాతలెవరూ ఆందోళన చెందొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పరంగా సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో జరిగిన పంటనష్టం, అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నీరజంపల్లిలో ఇద్దరు అరటి రైతుల ఆత్మహత్యాయత్నంపై వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆ శాఖ ఉన్నతాధికారులతో ఆదివారం చంద్రబాబు సమీక్షించారు. రైతుల ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ”వడగళ్ల వాన కారణంగా వైఎస్సార్, అనంతపురం, శ్రీసత్యసాయి, ప్రకాశం జిల్లా లోని 10 మండలాలకు చెందిన 40 గ్రామాల్లో పంట నష్టం జరిగింది. 1,670 హెక్టార్లలో ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. సుమారు 1,364 మంది రైతులు నష్ట పోయారు” అని అధికారులు సీఎంకు తెలిపారు. క్షేత్రస్థాయికి వెళ్లి వివరాలను పరిశీలించినట్లు నివేదించారు. అంతకుముందు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉద్యానశాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వడగళ్ల వాన కారణంగా జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించారు.

