రొయ్యపొట్టు.. విత్తనంతో జట్టు!
బయోపాలిమర్ ఆధారిత విధానం.. మొక్కలకు రక్షాకవచం
జాతీయ నూనెగింజల పరిశోధన సంస్థ శాస్త్రవేత్తల వినూత్న ఆవిష్కరణ
వృథాగా పడేసే రొయ్య పొట్టుకు పలు సేంద్రియ పదార్థాలను కలిపి విత్తనాలపై పొరలు (ఫిల్మ్ కోటింగ్)గా చేసి… నాటడం ద్వారా అధిక దిగుబడితో పాటు చీడపీడల నివారణ, భూసార సంరక్షణతో మొక్కలకు రక్షాకవచంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని జాతీయ నూనెగింజల పరిశోధన సంస్థ (ఐఐవోఆర్) శాస్త్రవేత్తలు ఆర్డీ ప్రసాద్, కేఎస్వీ పూర్ణచంద్రికలు ఐదేళ్ల పాటు పరిశోధన చేసి బయోపాలిమర్ ఆధారిత విత్తనోత్పత్తి విధానాన్ని అభివృద్ధి చేశారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టీఆర్ శర్మ, ఐఐవోఆర్ డైరెక్టర్ ఆర్కే మాథుర్లు గురువారం రాజేంద్రనగర్లోని ప్రధాన కార్యాలయంలో బయోపాలిమర్ను ఆవిష్కరించారు. రొయ్య పొట్టును శుద్ధి చేసి, ద్రవంగా మార్చి దానికి మొక్కలకు మేలు చేసే ట్రైకోడెర్మా, ఇతర సూక్ష్మ పోషకాలు, జీవ, సేంద్రియ పదార్థాలను కలిపి ఆ మిశ్రమాన్ని విత్తనాలకు పొరలు (లేయర్)గా అమర్చారు శాస్త్రవేత్తలు. వాటిని వికారాబాద్ జిల్లాలోని గిరిజన తండాల్లో ప్రయోగాత్మకంగా సాగు చేయించగా..మంచి ఫలితాలు వచ్చాయి. బయోపాలిమర్ ఆధారిత సీడ్ కోటింగ్ విధానానికి బయోపాలిమర్ పేరిట దరఖాస్తు చేసుకోగా వినూత్న ఆవిష్కరణగా పేటెంట్ లభించింది.
బయోపాలిమర్ను రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా హైదరాబాద్కు చెందిన శ్రీకర్ బయోటెక్, కోల్కతాకు చెందిన ఎదుకా అగ్రోటెక్ సంస్థలతో ఐఐవోఆర్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈమేరకు బయోపాలిమర్ను ఎకోమెర్ పేరిట శుక్రవారం నుంచి మార్కెట్లోకి విడుదల చేస్తున్నామని శ్రీకర్ బయోటెక్ ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు.


