ఈ ఏడాది 18 లక్షల టన్నుల పశుగ్రాసం సాగు
పశుగణాభివృద్ధితో పాటు మేలురకం పశుగ్రాసాల సాగు ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పశుగ్రాస వారోత్సవాలు ప్రారంభించింది. ఇవి ఈ నెల 14 వరకూ కొనసాగనున్నాయని ఆ శాఖ సంచాలకుడు డాక్టర్ టి.దామోదరనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా పశుపోషకులకు 75 శాతం రాయితీపై పశుగ్రాస విత్తనాలు పశు వైద్య కేంద్రాలు / రైతు సేవా కేంద్రాల ద్వారా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రూ.28.54 కోట్ల వ్యయంతో 3,622 మెట్రిక్ టన్నుల విత్తనాలను పంపిణీ చేయనున్నామని తెలిపారు. ఈ ఏడాది 72,440 హెక్టార్లలో 18.11 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసాలను ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేశామని ప్రకటించారు. పశుపోషకులకు ఖర్చులు తగ్గించేందుకు 100 శాతం రాయితీపై పశుగ్రాసాలను అభివృద్ధి చేసుకోవడానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు.

