రైతుల సమస్యలు పరిష్కారానికి కృషి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తూ.. ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని ప్రముఖ ఇంజినీర్ కన్నయ్య నాయుడు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తున్న రైతు నాయకుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం సోమవారం విజయవాడ, గాంధీనగర్లో నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. సుమారు 500 ప్రాజెక్టులకు గేట్లు అమర్చి.. రైతులకు నీళ్లు ఇచ్చామని తెలిపారు. గత ఏడాది తుంగభద్ర ప్రాజెక్టు పరిధిలో 14 లక్షల ఎకరాల పంటలు ఎండిపోగా.. ఐఎంఏలో గేటు ఏర్పాటు చేసి నీళ్లు ఇచ్చామని గుర్తు చేశారు. ప్రకాశం బ్యారేజీ వరదల సమయంలో బోట్లు వచ్చి ఢీ కొట్టినప్పుడు.. గేట్లకు మరమ్మతులు చేసి బలం పెంచినట్లు తెలిపారు. రైతు సంఘం నాయకుడు అక్కినేని భవానీప్రసాద్ మాట్లాడుతూ.. పార్లమెంటు, అసెంబ్లీ స్థాయిలో రైతు సంఘాలను ఏర్పాటు చేసుకొని.. మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలన్నారు. పోలవరం ప్రాజెక్టు 45.73 మీటర్ల ఎత్తులో నిర్మించాలని, గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును అమలు చేయాలని, స్వామినాథన్ కమిషన్ సూచనల మేరకు గిట్టుబాటు ధర కల్పించాలని సమావేశంలో తీర్మానించారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. రైతులకు గిట్టు బాటు ధరలు కల్పించడంతో పాటు సంక్షోభం నుంచి బయటకు తీసుకురావడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. రాజకీయాలకతీతంగా రైతులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు చలసాని శ్రీనివాసరావు, జి. వెంకటరామ రాజు, వి. రామ్మోహనరావు, వివిధ జిల్లాలకు చెందిన రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

