ప్రకృతి సేద్యంలో రైతులకు లాభాలు వచ్చేలా చూడాలని 20 సూత్రాల కార్యక్రమ అమలు కమిటీ ఛైర్మన్‌ లంకా దినకర్‌ సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం ఆయన ఆర్గానిక్‌ ప్రొడక్ట్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ చైర్మన్‌ దేవదత్తు, అత్తలూరిపాలెం ఆర్గానిక్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ ఎండీ సురేంద్రబాబు తదితరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రకృతి సేద్యం, ప్రజలకు ఆరోగ్యం, రైతుకు లాభాలపై చర్చించారు. దేశంలో ఆర్గానిక్‌ సేద్యం అభివృద్ధి చేసేలా ప్రధాని మోదీ ప్రోత్సాహకాలు ప్రకటించారని, ఏపీని ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ హబ్‌గా మార్చేందుకు సీఎం చంద్రబాబు కార్యాచరణ చేపట్టారని పేర్కొన్నారు. ఆర్గానిక్‌ ప్రొడక్ట్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ చైర్మన్‌ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లాలో ప్రకృతి సేద్యాన్ని విజయవంతం చేయడానికి కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.