రేపే రైతుల ఖాతాలో ఏడు వేల రూపాయలు
రైతుల ఖాతాల్లోకి కేంద్రం రూ.2 వేలు, రాష్ట్రం రూ.5 వేల చొప్పున పీఎం కిసాన్-అన్న దాతా సుఖీభవ నిధులు ఈ నెల 19న విడుదల కానున్నాయి. వైఎస్సార్ కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46.86 లక్షల మంది కర్షకుల ఖాతాలకు రూ.7 వేల చొప్పున మొత్తం రూ. 3,135 కోట్లు జమ చేస్తామని ప్రభుత్వం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. పీఎం కిసాన్- అన్నదాతా సుఖీభవ కింద ఆగస్టులో మొదటి విడతగా రూ.3,174 కోట్లు విడుదలయ్యాయి. రెండు విడతల్లో కలిపి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి రూ.6,309.44 కోట్లు వెచ్చిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమాల్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనాలని సీఎం చంద్రబాబు సూచించారు. నిధుల విడుదల కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 10 వేలకు పైగా రైతు సేవా కేంద్రాల్లో (ఆర్ ఎస్ కే) ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. ‘రైతుల ఖాతాల్లోకి నిధులు మాత్రమే కాకుండా.. వ్యవసాయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు కూడా అందులో వివరించేలా కార్యక్రమం రూపొందించి ప్రసారం చేయాలి. అగ్రిటెక్, డిమాండ్ ఉన్న పంటల సాగు, మార్కెట్ సౌకర్యాల పెంపు, ప్రకృతి సేద్యం, భూసార పరీక్షలు, పంట ఉత్పత్తులకు ఆహారశుద్ధి ద్వారా అధిక ధర లభించేలా చేయడం తదితర అంశాలపై రైతులకు అవగా హన కల్పించాలి’ అని సూచించారు. నిధుల విడుదలకు సంబంధించి రైతుల ఫోన్లకు ఒకరోజు ముందే మెసేజ్లు వెళ్లాలని అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి సోమవారం ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ‘రైతుల సందేహాల నివృత్తికి టోల్ ఫ్రీ నంబరు అందుబాటులో ఉంచాలి. అర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు డెత్ మ్యుటేషన్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలి. తొలి విడతలో నగదు జమ కాని రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిశీలించి అర్హత ఉన్నవారికి అందేలా చూస్తాం” అని అచ్చెన్నాయుడు చెప్పారు.

