బడ్జెట్ సందర్భంగా వ్యవసాయం మరియు అనుబంధ రంగాల గురించి శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో చేసిన ప్రసంగం
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎం. ఎస్. స్వామినాథన్ గారి మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి.*
”వ్యవసాయం గాడి తప్పితే మరేదీ సక్రమంగా సాగడానికి అవకాశం ఉండదు.”*
మన రాష్ట్ర వ్యవసాయ రంగం 62 శాతం జనాభాకు ఆసరాగా ఉంటూ, మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోందన్నది వాస్తవం. వ్యవసాయ రంగం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. వివిధ వ్యవసాయ పథకాల క్రింద చెల్లించవలసిన 5,510 కోట్ల రూపాయల బకాయిలలో 693 కోట్ల రూపాయల బకాయిలను మా ప్రభుత్వం చెల్లించింది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన క్రింద చేపట్టే డ్రిప్ ఇరిగేషన్ పథకం కొన్ని సంవత్సరాలుగా అమలు కాలేదు. ఈ సందర్భంగా డ్రిప్ ఇరిగేషన్ ఈ దేశంలోకి తొలి అడుగు ఎలా పెట్టిందనేది ఈ తరానికి తెలియచెప్పాల్సి ఉంది. డ్రిప్ ఇరిగేషన్ గురించి ఎవ్వరూ ఆలోచన చేయని 90వ థకంలో ఇజ్రాయిల్ టెక్నాలజీని రాష్ట్రానికి తేవాలన్నారు చంద్రబాబు గారు. అధ్యయనానికి ఇజ్రాయిల్‌కి వెళ్లిన కమిటీలో నేను సభ్యుడిగా ఉన్నాను. ముగ్గురు ఐ.ఏ.ఎస్. అధికారులను, నన్ను సభ్యుడిగా ఆ కమిటీలో నియమించారు. నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుగారి సూచనల మేరకు దాన్ని అధ్యయనం చేసి అందించిన నివేదిక ఆధారంగా దేశంలోనే తొలిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఆ తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పై జాతీయ స్థాయిలో వేసిన టాస్క్ ఫోర్సుకు ఆయనే నేతృత్వం వహించారు. ఇవాళ డ్రిప్ లేని రాష్ట్రంలేదు.. పొలం లేదు. వాట్ చంద్రబాబు నాయుడు గారు థింక్స్ టుడే… నేషన్ థింక్స్ టుమారో…. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏం ఆలోచిస్తారో… అదే రేపు దేశం ఆలోచిస్తుందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కోసం 176 కోట్ల రూపాయలను విడుదల చేసి, అదనంగా 85 వేల హెక్టార్లను డ్రిప్ ఇరిగేషన్ క్రింద తీసుకురావడానికి అనుమతులు ఇచ్చింది. జీవితంలో ఒక్కసారైనా డాక్టర్, లాయర్, పోలీస్ మరియు బోధకుడు అవసరమని చెబుతూ ఉంటారు. కానీ రైతు ప్రతిరోజూ అవసరం. మూడు పూటలా అవసరం. కాబట్టి అలాంటి అన్నదాతలకు ప్రగాఢ కృతజ్ఞతా భావంతో మేం మరో సూపర్ సిక్స్ హామీని నెరవేర్చడానికి సిద్ధమవుతున్నామని తెలియచేయడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా… అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20 వేల రూపాయలు అందించేలా కేటాయింపులు చేశామని చెప్పడానికి గర్విస్తున్నాం. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 21.87 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 9 గంటల ఉచిత పగటిపూట విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే ఆర్థిక సహాయాన్ని 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలకు రెట్టింపు చేస్తామనే మ్యానిఫెస్టోలోని మరో హామీని నెరవేర్చడానికి తగిన కేటాయింపులు చేశామని సంతోషంగా ప్రకటిస్తున్నాను. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు 13,487 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.
*రూ.48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్*
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు భారీ మేలు కలిగేలా కేటాయింపులు రాష్ట్ర రైతుకు వెన్నుదన్నుగా నిలిచేలా 2025-25 వార్షిక వ్యవసాయ బడ్జెట్‌ను ఇవాళ అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశ పెట్టారు. సాధారణ బడ్జెట్ అనంతరం దీనిని అసెంబ్లీ ముందుకు తెచ్చారు. రూ.48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రతిపాదనలను అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ దేశం, రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయ రంగమన్నారు. ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయంపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టిందని తెలిపారు. వ్యవసాయం ప్రాథమిక రంగంగా గుర్తింపు ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో భూమి కలిగిన వారికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వనున్నట్టు మంత్రి వెల్లడించారు. రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. వికసిత్ భారత్‌కు అనుసంధానంగా ఏపీని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.

*భారీగా కేటాయింపులు*
వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆయా రంగాలకు భారీగా కేటాయింపులు చేసింది. ఎరువులు, ప్రకృతి వ్యవసాయం, వ్యవసాయ యంత్రాల రాయితీ, డ్రోన్ల రాయితీకి సంబంధించి భారీగా కేటాయించారు. ఈ కేటాయింపుల వల్ల రైతులకు భారీగా మేలు చేకూరనుంది. శాసనమండలిలో వ్యవసాయ బడ్జెట్ 2025-26 ను మంత్రి పి. నారాయణ ప్రవేశపెట్టారు.

