రాయితీపై సూక్ష్మ సేద్య పరికరాలుమంత్రి అచ్చెన్నాయుడు
ఉద్యాన పంటలు పండించే జిల్లాలను 7 క్లస్టర్లుగా ఏర్పాటు చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్రం నుంచి మార్గదర్శకాలు వచ్చాక నిధులు ఎన్ని వస్తాయనే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ‘క్లస్టర్లలో ఉద్యాన పంటల ప్రోత్సాహానికి కేంద్ర సాయం అందుతుంది. ధరలను నియంత్రించే వెసులుబాటు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యాన పంటలు 46 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. గడచిన 8 నెలల్లో లక్ష హెక్టార్లకు సూక్ష్మ సేద్య పరికరాలు అందించాం. ఈ ఏడాది నుంచి ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం రాయితీ ఇస్తాం. రాయలసీమ జిల్లాల్లో 10 ఎకరాలు ఉన్న వారికి 90% సబ్సిడీపై ఇస్తాం. సూక్ష్మ సేద్య పరికరాలు, యాంత్రీకరణకు కేంద్రం నుంచి 60% రాయితీ వస్తుంది’ అని తెలిపారు.

