రాయలసీమ పంటలు అంతర్జాతీయ మార్కెట్కు
పూర్వోదయ పథకంలో భాగంగా రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 92 క్లస్టర్ల ద్వారా రైతులకు జీవనోపాధి కల్పించేలా రూ.40 వేల కోట్లతో కార్యాచరణ అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇందులో భాగంగా రహదారులు, జలవనరుల ప్రాజెక్టులు, పంచాయతీరాజ్ రోడ్ల లాంటి పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. పూర్వోదయ పథకంలో రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధిపై సీఎం సమీక్షించారు. ప్రపంచబ్యాంకు నిధులతో రాయలసీమ అభివృద్ధికి ఏయే అంశాల్లో దృష్టి సారించాలనే అంశంపై అధికారులతో చర్చించారు. ”ప్రపంచంలో డిమాండ్ ఉన్న ఉద్యానపంటల్లో 18 రకాల పంటలు రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లోనే పండుతున్నాయి. ఉద్యాన రైతులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి. రాయలసీమను ఉద్యానపంటల హబ్ గా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకోవాలి. సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ వంటి అంశాలపై దృష్టిపెట్టాలి. రాయలసీమలో 65 రకాల ఉద్యానపంటలు పండుతుంటే 18రకాల పంటలకు మంచి డిమాండ్ ఉంది. వీటిపై రైతులను ప్రోత్సహించాలి. రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. రెగ్యులర్ పంటల కంటే భవిష్యత్తులో ప్రజల అలవాట్లకు అనుగుణంగా పంటలు పండించాలి” అని సూచించారు.
.*ఇతర దేశాలకు ఉత్పత్తులు* ”50 లక్షల ఎకరాల్లో ఉద్యానపంటల ద్వారా పెద్ద ఎత్తున రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ఉద్యాన పంటలకు రవాణా, మార్కెటింగ్, కోల్డ్ చైన్ తదితర సదుపాయాలు కల్పించాలి. దుబాయ్ లాంటి ప్రాంతాలకు విమానాల్లో పంపితే, అక్కడి నుంచి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు పంపొచ్చు. రాయలసీమకు మంచి రహదారులు వచ్చాయి. మారుమూల ప్రాంతాలను కలుపుతూ మరికొన్ని రహదారులు రావాలి. దీంతో మార్కెటింగ్ మెరుగుపడుతుంది. ఉద్యాన పంటల సాగు మొదలుకుని మార్కెటింగ్ వరకు వివిధ ప్రాజెక్టులను చేపడుతున్నాం. ఇందులో రాయితీ రూపంలో రూ. 9వేల కోట్లు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అరటి, చీనీ, బొప్పాయి, దానిమ్మ, మామిడి, ఉల్లి, టమాటా, మిరప, నిమ్మ లాంటి పంటలపై దృష్టి పెట్టాలి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉత్పత్తి, టేబుల్ వెరైటీలను పండించి వాటికి విలువ జోడించాలి. అప్పుడు రైతులకు ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. ఆక్వారంగంలాగే ఉద్యాన రంగం సైతం భవిష్యత్తులో అగ్రస్థానానికి చేరుతుంది” అని తెలిపారు. హంద్రీనీవా సహా వివిధ ప్రాజెక్టుల ద్వారా నీటిని సరఫరా చేయడంతో సీమలో ఉద్యానసాగు గతంతో పోల్చుకుంటే సులభతరమైందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. పంటలు చక్కగా పండడంతో రైతులకు ఆదాయం రావడంతో పాటు భూముల ధరలు పెరిగాయని దీనికి తమ అనంతపురం జిల్లానే ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన చెప్పారు.

