యుజిసి చైర్మన్ డాక్టర్ జగదీశ్వర్ను కలిసిన వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జానయ్య
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్ధాస్ జానయ్య బుధవారం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ డాక్టర్ జగదీశ్వర్ను న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ విద్యా విధానం యొక్క ప్రాధాన్యత, ఆవశ్యకతపై వారు చర్చించారు. జాతీయ విద్యా విధానంపై ఉన్న పలు అపోహలను డాక్టర్. జగదీశ్వర్ ఈ సందర్భంగా నివృత్తి చేశారు. అలాగే భవిష్యత్తు అవసరాల కనుగుణంగా వ్యవసాయ విద్యాలయం నిర్మాణంపై కూడా డాక్టర్. జగదీశ్వర్ పలు సూచనలు చేశారు. వచ్చేనెల 20వ తేదీన జరగనున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాలలో పాల్గొనవలసిందిగా ప్రొఫెసర్ జానయ్య విన్నపానికి డాక్టర్ జగదీశ్వర్ కార్యక్రమంలో పాల్గొంటానని హామీ ఇచ్చారు. అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయం క్యాంపస్లో నూతనంగా నిర్మించ తలపెట్టిన బాలికల వసతి గృహ నిర్మాణానికి యుజిసి తమవంతు సహకారాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. అలాగే ఇరువురి మధ్య తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకొని.. తమ గ్రామంలో తాము గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు. యూజీసీ చైర్మన్ డాక్టర్ జగదీశ్వర్ మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్యలది నల్గొండ జిల్లాలోని మామిడాల గ్రామం కావటం విశేషం.

