జీడిమామిడిని భూసారం తక్కువగా ఉన్న నేలల్లో భూమి కోతను తగ్గించడానికి సాగు చేస్తారు. జీడిమామిడి మధ్యస్త పరిమాణంలో ఉండే చెట్టు. ఇది ఎల్లప్పుడూ ఆకుపచ్చ రంగులో ఉండి, అనేక కొమ్మలు విస్తరించి ఉండి 12 మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. ప్రథమ వేరు ప్రస్ఫుటంగా ఉండి అనేక ప్రక్క వేర్లు, సింకర్ వేర్ల వ్యవస్థ కలిగి ఉంటుంది. ఆకులు ఒకదానిని విడిచి ఇంకొకటిగా ఏర్పడి, అండాకారంలో, లేత ఆకుపచ్చ రంగులో గుండ్రని చివర్లు కలిగి 10-18 x 8-15 సెం.మీ. పరిమాణంలో చిన్న ఆకు తొడిమ కలిగి వుంటాయి. లేత ఆకులు ఎరుపు రంగు, ముదురు ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. జీడిమామిడి 3-5 సంవత్సరాలలో పూతకు వస్తుంది. పూగుచ్ఛం గుత్తిలో అనేక మగపూలు, ద్విలింగ పుష్పాలు ఏర్పడతాయి. జీడికాయ ఎండి, విషపూరిత గుల్లలో పెద్ద, వంపు తిరిగిన గింజ (2.5 సెం.మీ.) కలిగి ఉంటుంది. జీడి కాయ పసుపు రంగులో పలుచని చర్మంతో, మెత్తని కండతో, అధిక రసం కలిగి ఉంటుంది.
సాధారణ నామం : కాష్య్ణు, శాస్త్రీయ నామం : అనకార్డియం ఆక్సిడెంటేల్, కుటుంబం: అనకార్డియేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
- జీడిమామిడి సిరప్ దగ్గు, జలుబులకు మంచి మందు, జీడిమామిడి రసం సిఫిలిస్ చికిత్సలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.
- పాతజీడిమామిడి లిక్కర్ తక్కువ మోతాదులో కడుపునొప్పి తగ్గిస్తుంది, జీడిమామిడి గుల్ల నుండి తీసిన నూనెని గ్రామస్థులు కాలి మడమ పగుళ్ళను నయం చేయడానికి ఉపయోగిస్తారు.
- జీడిమామిడిని కలరా, మూత్రపిండ సమస్యల చికిత్సలో ఉపయోగిస్తారు.
- జీడిమామిడి పెంకు నుండి తీసిన నూనెని విరేచనకారిగా, మధుమేహం, కిడ్నీ సమస్యలు, కాలి మడమ పగుళ్ళ, ఆనెల నివారణలో ఉపయోగిస్తారు.
- జీడి పప్పుని డయేరియా అరికట్టడానికుపయోగిస్తారు, మొగ్గలు, లేత ఆకులను చర్మవ్యాధులను నయం చేయడానికుపయోగిస్తారు.
- గింజల రసాన్ని మానసిక సమస్యలకు, కీళ్ళనొప్పులకు ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో
- జీడిమామిడి పెంకు ద్రావణం ధాన్యం నిల్వలో ఆశించే ట్రైబోలియం కాస్టానియం పురుగుని నివారిస్తుంది, నత్తల నివారణలో ఉపయోగపడుతుంది.
- జీడికాయ, పెంకులు బంబారా వేరుశనగ నిల్వలలో ఆశించే కాల్లసోబ్రూకస్ సబిన్నోటేటస్‌ని నివారిస్తాయి (ఒపరేక్, బన్ని, 2006)
- జీడి మామిడి కాయ రసం (20%) కొబ్బరిలో ఎర్రముట్టె పురుగు (రెడ్‌పామ్ వీవిల్)ని కాండానికి ఇంజక్ట్ చేయడం, మొవ్వులో పోయడం ద్వారా సమర్ధవంతంగా నివారించవచ్చు. ఇది రసాయన పురుగుమందు కార్బరిల్‌కి ప్రత్యామ్నాయం.
- జీడిమామిడి పెంకు ద్రవం నిల్వ ధాన్యాలను ఆశించే సైటోఫిలా ఒరైజే బీటిల్‌ని సమర్ధవంతంగా నివారిస్తుంది (బక్ట్సన్, అతని అనుచరులు, 2017).
- జీడిమామిడి చెట్టు అన్ని భాగాల ద్రావణాలు కీటకనాశక, పురుగు వికర్షక లక్షణాలు కలిగి చెద పురుగులు, కాఫీ గింజలను తొలిచే తెల్ల పురుగులను నివారించాయి. గింజల నుండి తీసిన నూనె ప్రత్తిలో రెడ్ కాటన్ బగ్, పొగాకులద్దె పురుగులను అరికట్టాయి (రిచర్డ్ విలియం హే ఫ్లూక్, 1999)
- జీడిమామిడి ద్రావణం (నీటిలో కలిపిన) అనేక చెట్లకు నష్టం కలిగించే మాక్రోటెరిమస్ చెద పురుగుని నివారించింది (ఓసిపిటన్, & ఓసెవేమి, 2012).
- జీడిమామిడి ఆకు పొడి చెద పురుగు ఒడొంటో టెర్మెస్ ఒబెసస్‌ని 53.33% నివారించాయి (రంజిత్, అతని అనుచరులు, 2017).
- జీడిమామిడి పెంకు ద్రవం శనగ పచ్చ పురుగు లార్వాలను నివారించింది (మహాపాత్రో, 2010).
- జీడి మామిడి గింజల పొడి, ద్రావణం అలసంద గింజల నిల్వ సమయంలో ఆశించే కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ అలసంద బ్రూచిడ్)ని సమర్ధవంతంగా నివారించాయి (ఇలెకి, 2012).
- జీడిమామిడి గింజల నూనె (3%) బెండ కాండం మరియు కాయతొలుచు పురుగు లార్వాలను 87.4% నివారించింది (ప్రవీణ; ఆమె అనుచరలు, 2012).
- జీడి మామిడి గింజల పొడి ద్రావణం జొన్న గింజల నిల్వ సమయంలో ఆశించే పురుగు (సైటోఫిలస్ ఒరైజె)ని నివారించింది (ఇలెకి, అతని అనుచరులు, 2013)
- జీడిమామిడి క్రూడ్ మిథనాల్ ద్రావణం క్యాబేజిలో డైమండ్ బ్యాక్‌మాత్‌ని నివారించింది. (మున్సెమన & ఆల్బర్టో, 2017).
- జీడిమామిడి బంక ద్రావణం కొన్ని శిలీంద్రాలు, బాక్టీరియా పెరుగుదల నరికట్టింది. కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ (బ్రూచిడ్) పెద్ద పురుగుల సంఖ్యను తగ్గించింది. (మార్క్వెస్, అతని అనుచరులు, 1992)
- జీడిమామిడి ద్రావణం క్షేత్రస్థాయిలో మాక్రోటెర్మస్ బెల్లికోసస్ (చెదపురుగు)ని పర్యావరణహిత పద్ధతిలో నివారించింది (ఓస్పిటాన్, ఒసెయెమి, 2012).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి