అధిక దిగుబడుల కోసం కొందరు రైతులు పరిమితికి మించి యూరియా (నత్రజని) వాడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.. ఎంత యూరియా పోస్తే అంత పంట దిగుబడి అనే ధోరణి నెలకొంది. ముఖ్యంగా జొన్న పంటకు ఎకరానికి 96 కిలోలు వేయాలని వ్యవసాయశాఖ సిఫారసు చేస్తే.. రైతులు ఏకంగా 400 కిలోల నుంచి 800 కిలోల వరకు చల్లుతుండటం గమనార్హం. దీంతో నేల ఆరోగ్యం దెబ్బ తింటుందని, చౌడుగా మారుతుందని గుర్తించలేకపోతున్నారు. అధికశాతం కౌలు రైతులే కావడంతో.. ఈ ఏడాది దిగుబడి బాగా వస్తే చాలని ఆలోచించడమే దీనికి ప్రధాన కారణం.

ఎకరాకు 8 – 16 బస్తాలు
కృష్ణా పశ్చిమడెల్టాలో ఖరీఫ్‌లో వరి పూర్తయ్యాక గతంలో మినుము, పెసర వేసేవారు. దీంతో నేల ఆరోగ్యం స్థిరంగా ఉండేది. రెండు థాబ్దాలుగా తెగుళ్లు ఆశించి నష్టాలు వస్తుండటంతో రైతులు జొన్న, మొక్కజొన్న వైపు మళ్లారు. ఇదేక్రమంలో దిగుబడులు, ఆదాయం పెంచుకోవడానికి ఎరువుల వాడకాన్ని పెంచారు. ఈ పంటల్లో ఎకరాకు 96 కిలోల నత్రజని, 32 కిలోల డీఏపీ, 32 కిలోల పొటాష్‌ ఎరువులను శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇందుకు భిన్నంగా రెండు రెట్లకు పైగా వాడుతున్నారు. వరి కోత తర్వాత జీరో టిల్లేజ్‌లో విత్తనం నాటడం, నదీతీర డెల్టా భూములు సారవంతమైనవి కావడంతో అధిక దిగుబడులు సాధించాలన్న యోచనతో రైతులు విచక్షణరహితంగా యూరియా వినియోగిస్తున్నారు. ఎకరాకు 8 నుంచి 16 బస్తాల యూరియా, 2 బస్తాల డీఏపీ, ఒక బస్తా పొటాష్‌ వేస్తున్నారు. దీనివల్ల ప్రస్తుతానికి దిగుబడులు బాగున్నా భూమి ఆరోగ్యం దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.tft

భూమి చౌడుగా మారిపోతుంది
యూరియా అవసరానికి మించి వాడితే భూమి చౌడు బారిపోతుంది. ప్రధాన మూలకాలు లోపించి నేల గట్టి పడిపోతుంది. మొక్కకు మేలు చేసే సూక్ష్మజీవులు నశించి పోషకాలు అందని పరిస్థితి ఏర్పడుతుంది. మొక్కజొన్న, జొన్నల్లో చీడపీడల ఉద్ధృతి నివారణకు రసాయనాలు పిచికారి వల్ల రైతుకు ఖర్చు పెరుగుతుంది.

సేంద్రియ కర్బనం పెంచాలి
యూరియా అధికంగా వాడటం వల్ల భూభౌతిక స్థితిలో మార్పు వచ్చి నీటి నిల్వ సామర్థ్యం, ఎరువులను కరిగించుకుని మొక్కకు అందించే గుణం తగ్గిపోతుంది. పోషకాల సమతుల్యత దెబ్బతింటుంది. రైతులు దిద్దుబాటు చర్యలు చేపట్టి నేలలో సేంద్రియ కర్బనం పెంచుకోవాలి. వరిని యంత్రంతో కోసిన తర్వాత మిగిలిన మోడును కాల్చకుండా రోటోవేటర్‌తో భూమిలోకి కలిసేలా చేయాలి. జీవ ఎరువులు వాడటం, పచ్చిరొట్ట సాగుచేసి భూమిలో కలియదున్నడం, పశువులు, కోళ్ల ఎరువు వాడటం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. మొక్కకు పోషకాలు సక్రమంగా అంది అధిక దిగుబడులు సాధ్యమవుతాయి.
– చంద్రమోహన్‌రెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త, ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం