తొలకరిలో జీవాల సంరక్షణగొర్రెలు, మేకల పెంపకందారులు తీసుకోవలసిన జాగ్రత్తలు
గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గొర్రెలు మేకల పాత్ర:
పాడిపరిశ్రమ తరువాత రైతులు, గ్రామీణ యువత అత్యధికంగా ఆసక్తి చూపుతున్న అనుబంధ రంగం గొర్రెలు, మేకల పెంపకం. తక్కువ పెట్టుబడి, తక్కువ స్థలంలో ఎక్కువ లాభాలు అందించే ఈ రంగం చిన్న, సన్నకారు, భూమిలేని రైతులకు జీవనోపాధిగా మారింది. దేశంలో 20వ పశుగణన ప్రకారం గొర్రెల సంఖ్య సుమారు 7.43 కోట్లు (మొత్తం పశుసంపదలో 13.83%) కాగా, మేకల సంఖ్య 14.89 కోట్లు (27.74%)గా నమోదైంది. ప్రపంచంలో మేకల పెంపకంలో భారతదేశం మొదటి స్థానంలో, గొర్రెల పెంపకంలో మూడో స్థానంలో నిలుస్తోంది. కేంద్ర పశుసంవర్థక శాఖ ప్రాథమిక గణాంకాల (BAHS 2024–25) ప్రకారం, దేశ మొత్తం మాంసోత్పత్తిలో గొర్రెల వాటా 11.29%, మేకల వాటా 15.06%గా ఉంది. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యధిక గొర్రెల జనాభా కలిగిన రాష్ట్రంగా, గొర్రెల మాంసోత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. ఈ గణాంకాలే ఈ రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎంత కీలకమో స్పష్టం చేస్తున్నాయి.

దేశంలో జనాభా (20వ పశుగణన)
గొర్రెలు: 7.43 కోట్లు (13.83%)
మేకలు: 14.89 కోట్లు (27.74%)
ప్రపంచంలో స్థానం
గొర్రెలు: 3వ స్థానం
మేకలు: 1వ స్థానం
మొత్తం మాంసోత్పత్తిలో వాటా (2024–25)
గొర్రెలు: 11.29%
మేకలు: 15.06%
తొలకరి వర్షాలు తెచ్చే సవాళ్లు:
మన రైతులు ఎక్కువగా గొర్రెలు, మేకలను ఆరుబయట మేపే సంప్రదాయ పద్ధతిని లేదా ఉదయం పచ్చికభూముల్లో మేపి రాత్రి కొట్టాల్లో బంధించే పాక్షిక సాంద్ర పద్ధతిని పాటిస్తారు. తొలకరి జల్లులకు కొత్తగా మొలకెత్తిన లేత పచ్చిగడ్డిని మేయడం, గుంతల్లో నిల్వ ఉన్న మురికినీటిని తాగడం, వర్షాలకు ఎక్కువసేపు తడవడం వంటివి జీవాలలో అనేక వ్యాధులకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ఈ కాలంలో తేమ శాతం పెరగడం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లతో పాటు ఈగలు, దోమలు వంటి బాహ్యపరాన్న జీవులు కూడా విపరీతంగా వృద్ధి చెందుతాయి. ఫలితంగా చిటుక వ్యాధి, గాలికుంటు వ్యాధి, నీలినాలుక, పారుడు రోగం (పిపిఆర్), కాలిపుండు, గొంతువాపు లాంటి వ్యాధుల ముప్పు గణనీయంగా పెరుగుతుంది.
తరచుగా కనిపించే ప్రధాన వ్యాధులు
బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు
చిటుక వ్యాధి (ఎంటిరోటాక్సీమియా): క్లోస్ట్రిడియం పెర్ఫ్రింజెన్స్ టైప్-డి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. తొలకరి జల్లులకు మొలచిన లేత గడ్డిని అధికంగా తినడం ఇందుకు ప్రధాన కారణం. అన్ని వయసుల గొర్రెలు, మేకలు దీని బారిన పడతాయి. హఠాత్తుగా మరణించే ప్రమాదం ఉన్నందున తొలకరికి ఒక నెల ముందే టీకా వేయించడం ఏకైక రక్షణ మార్గం.
కాలిపుండు వ్యాధి: బురద, చిత్తడి నేలల్లో ఎక్కువసేపు తిరగడం వల్ల గిట్టల మధ్యభాగం కందిపోయి, జీవాలు కుంటుతూ నడుస్తాయి. వ్యాధి సోకిన జీవాలను మంద నుంచి వేరు చేసి, పశువైద్యుని సలహాతో యాంటీబయోటిక్స్ వాడాలి.
వైరస్‌ల వల్ల కలిగే వ్యాధులు
పారుడు రోగం (పిపిఆర్): గొర్రెలు, మేకల్లో అత్యధిక నష్టాన్ని కలిగించే వ్యాధి ఇది. అధిక జ్వరం, ముక్కు నుంచి స్రావాలు, నోటిపూత, రక్తపు విరేచనాలు దీని లక్షణాలు. చికిత్స లేని ఈ వ్యాధికి నివారణే ఏకైక మార్గం. మూడు నెలలు దాటిన పిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు వేయించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి పిపిఆర్ వ్యాధిని దేశం నుంచి పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో జాతీయ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.
నీలినాలుకవ్యాధి(Bluetongue):
క్యులికోయిడ్స్ (Culicoides) అనే చిన్న దోమల కాటు ద్వారా వ్యాపించే ఆర్బోవైరస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. ప్రధానంగా గొర్రెలలో ఎక్కువగా కనిపిస్తుంది. అధిక జ్వరం, నాలుక నీలిరంగులోకి మారడం, పెదవులు మరియు ముఖం వాచిపోవడం, నోటిలో పుండ్లు, గిట్టల వద్ద వాపు, కుంటుతూ నడవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి నివారణకు మూడు నెలల వయస్సు దాటిన పిల్లలకు నీలినాలుక టీకా వేయించి, ఒక నెల తర్వాత బూస్టర్ డోసు ఇవ్వాలి. అదనంగా దోమల నియంత్రణ, పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని తగ్గించవచ్చు.
గాలికుంటువ్యాధి(FMD):
ఇది అత్యంత వేగంగా వ్యాపించే వైరస్ వ్యాధి. గొర్రెలు, మేకల నోరు, నాలుక, పెదవులు మరియు గిట్టల మధ్య బొబ్బలు, పుండ్లు ఏర్పడి తీవ్రమైన నొప్పి కలుగుతుంది. ఫలితంగా జీవాలు మేత మేయలేకపోవడం, కుంటుతూ నడవడం, బరువు తగ్గడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఈ వ్యాధికి ప్రత్యేక చికిత్స లేదు. క్రమం తప్పకుండా ఎఫ్‌ఎమ్‌డి టీకాలు వేయించడం, వ్యాధి సోకిన జీవాలను వెంటనే వేరు చేయడం, పరిశుభ్రత మరియు బయోసెక్యూరిటీ చర్యలు పాటించడం ద్వారా వ్యాధిని సమర్థవంతంగా నివారించవచ్చు.
రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
● టీకాలు సకాలంలో వేయించడం: తొలకరి ప్రారంభానికి ఒక నెల ముందే చిటుక వ్యాధి, గాలికుంటు, పారుడు రోగం, నీలినాలుక వ్యాధుల నివారణ టీకాలను పశువైద్యుని సలహాతో వేయించుకోవాలి.
గొర్రెలు మరియు మేకలకు సిఫార్సు చేయబడిన టీకాల పట్టిక:
వ్యాధి: చిటుక వ్యాధి (ఎంటిరోటాక్సీమియా – ET)
మొదటి టీకా వేయవలసిన వయస్సు: 3–4 నెలల వయస్సులో
బూస్టర్ డోసు: 21–30 రోజుల తర్వాత
తదుపరి టీకా: ప్రతి సంవత్సరం, ముఖ్యంగా వర్షాకాలానికి ఒక నెల ముందు

వ్యాధి: పారుడు రోగం (PPR)
మొదటి టీకా వేయవలసిన వయస్సు: 3 నెలల వయస్సు తర్వాత
బూస్టర్ డోసు: అవసరం లేదు
తదుపరి టీకా: ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి

వ్యాధి: గాలికుంటు వ్యాధి (Foot and Mouth Disease – FMD)
మొదటి టీకా వేయవలసిన వయస్సు: 3–4 నెలల వయస్సులో
బూస్టర్ డోసు: 21–30 రోజుల తర్వాత
తదుపరి టీకా: ప్రతి 6 నెలలకు ఒకసారి
వ్యాధి: నీలినాలుక వ్యాధి (Bluetongue) (వ్యాధి ప్రబల ప్రాంతాల్లో)
మొదటి టీకా వేయవలసిన వయస్సు: 3 నెలల వయస్సు తర్వాత
బూస్టర్ డోసు: 1 నెల తర్వాత
తదుపరి టీకా: ప్రతి సంవత్సరం


వ్యాధి: గొర్రె మశూచి (Sheep Pox) (గొర్రెలకు మాత్రమే)
మొదటి టీకా వేయవలసిన వయస్సు: 3–5 నెలల వయస్సులో
బూస్టర్ డోసు: అవసరమైతే పశువైద్యుని సలహా మేరకు
తదుపరి టీకా: ప్రతి సంవత్సరం
వ్యాధి: మేక మశూచి (Goat Pox) (మేకలకు మాత్రమే)
మొదటి టీకా వేయవలసిన వయస్సు: 3–5 నెలల వయస్సులో
బూస్టర్ డోసు: అవసరమైతే పశువైద్యుని సలహా మేరకు
తదుపరి టీకా: ప్రతి సంవత్సరం
● నట్టల నివారణ: తొలకరి ప్రారంభానికి ముందే పశువైద్యుని సూచన మేరకు నట్టల నివారణ మందులను వాడాలి. లేత గడ్డి మేయడం వల్ల అంతరపరాన్న జీవుల బెడద ఎక్కువగా ఉంటుంది.
● కొట్టాల నిర్వహణ: కొట్టాలు పొడిగా, తేమ లేకుండా ఉండేలా చూసుకోవాలి. మలమూత్రాలను ఎప్పటికప్పుడు తొలగించి, ప్రతి 15 రోజులకు ఒకసారి సున్నం లేదా బ్లీచింగ్ పౌడర్ చల్లాలి. కొట్టాల్లోకి గాలి, వెలుతురు బాగా ప్రసరించేలా నిర్మాణం ఉండాలి; లేకుంటే అమ్మోనియా శాతం పెరిగి శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.
● బాహ్యపరాన్న జీవుల నివారణ: ఈగలు, దోమల నివారణకు ప్రతి 15 రోజులకు ఒకసారి మలాథియాన్, బ్యూటాక్స్, అమిత్రాజ్ వంటి కీటకనాశనులను కొట్టాల్లో పిచికారీ చేయాలి.
● గిట్టల సంరక్షణ: బురద, చిత్తడి నేలల్లో మేపే రైతులు ఫుట్ బాత్‌లలో పొటాషియం పర్మాంగనేట్ లేదా జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని వాడి, గిట్టల వ్యాధులను నివారించుకోవాలి.
● మేత జాగ్రత్తలు: బూజు పట్టిన, తడిసిన మేతను గొర్రెలకు, మేకలకు వేయకూడదు — ఇది అఫ్లాటాక్సికోసిస్ అనే ఫంగల్ వ్యాధికి దారితీస్తుంది. వీలైనంత వరకు ఎండిన, నాణ్యమైన మేతనే అందించాలి.
● కొత్త జీవాల నిర్బంధం (క్వారంటైన్): సంతలో కొత్తగా కొనుగోలు చేసిన జీవాలను వెంటనే మందలో కలపకూడదు. వాటిని కొన్ని రోజులు వేరుగా ఉంచి, అవసరమైన టీకాలు వేయించి, ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాతే మందలో చేర్చాలి.
● వ్యాధిగ్రస్త జీవాల నిర్వహణ: వైరస్ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే ఆ జీవిని మంద నుంచి వేరు చేసి చికిత్స అందించాలి. నోటిపూత వల్ల మేత తినలేని జీవాలకు జావ, ఓఆర్‌ఎస్ ద్రావణం అందించాలి.
● గొర్రె పిల్లల సంరక్షణ: తొలకరి జల్లుల వల్ల గొర్రె పిల్లల్లో ఊపిరితిత్తుల వ్యాధులు అధికంగా వచ్చి 30% వరకు మరణాలు సంభవించే అవకాశం ఉంది. పిల్లలను తడవకుండా, చలి తాకకుండా ప్రత్యేక శ్రద్ధతో పెంచాలి.
● వెంటనే వైద్య సహాయం: ఏ చిన్న అనుమానం వచ్చినా ఆలస్యం చేయకుండా సమీప పశువైద్యాధికారిని సంప్రదించి తగిన చికిత్స అందించాలి.
ప్రభుత్వ తోడ్పాటు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ పశు వ్యాధి నియంత్రణ కార్యక్రమం (NADCP) ద్వారా గాలికుంటు, బ్రూసెల్లోసిస్ వంటి వ్యాధుల నివారణకు ఉచిత టీకాలు అందిస్తోంది. అలాగే పారుడు రోగం (పిపిఆర్) నిర్మూలన కార్యక్రమం, గొర్రెలు మేకల మశూచి, నీలినాలుక వ్యాధుల నివారణకు రాష్ట్ర పశుసంవర్థక శాఖ ద్వారా క్రమం తప్పకుండా టీకా శిబిరాలు నిర్వహిస్తున్నారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకుని తమ మందలను రక్షించుకోవాలి.
ముగింపు
“చికిత్స కన్నా నివారణ మేలు” అనే సూత్రాన్ని గొర్రెలు, మేకల పెంపకందారులు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. తొలకరి ప్రారంభంలోనే తగిన టీకాలు, నట్టల నివారణ మందులు, పరిశుభ్రమైన కొట్టాల నిర్వహణ వంటి యాజమాన్య పద్ధతులను సక్రమంగా పాటించడం ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో తమ మందలను వ్యాధుల బారి నుంచి కాపాడుకోవచ్చు. తద్వారా ఆశించిన దిగుబడిని, మెరుగైన ఆదాయాన్ని పొంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో తమ వంతు పాత్రను పోషించవచ్చు.
Dr. ఎ. సురేష్ నాయక్, అసోసియేట్ ప్రొఫెసర్, పశువైద్య కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్. Ph; 9491394455







