ముడిసరకు కాదు.. ఉత్పత్తులే ఎగుమతి
మిర్చి, పసుపు, ఆముదం, అశ్వగంధలపై విస్తృత పరిశోధనలు
ఎగుమతులకు అనువుగా ఉత్పత్తి చేస్తేనే రైతులకు ప్రయోజనం
సీటీఆర్ఐ సంచాలకుడు మాగంటి శేషుమాధవ్
'వాణిజ్య పంటలకు సంబంధించి మన దగ్గర నుంచి అధిక శాతం ముడిసరకు విదేశాలకు వెళ్తోంది. ఆయా దేశాల్లో వాడే ఉత్పత్తులను స్థానికంగానే తయారు చేసి ఎగుమతి చేస్తే ఇటు రైతులకు.. అటు ప్రభుత్వానికి ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. ఈ దిశగా ఐకార్-ఎన్‌ఐఆర్‌సీఏ రెండేళ్లుగా పరిశోధనలు చేస్తోంది' అని కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ (సీటీఆర్ఐ) డైరెక్టర్ మాగంటి శేషు మాధవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమహేంద్రవరం కేంద్రంగా ఇప్పటివరకు పొగాకుపై పరిశోధనలు చేసిన సీటీఆర్ఐ, త్వరలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కమర్షియల్ అగ్రికల్చర్ (ఎన్‌ఐఆర్‌సీఏ) గా మారనుందని తెలిపారు. తమ సంస్థ శాస్త్రవేత్తలు రెండేళ్లుగా మిర్చి, పసుపు, ఆముదం, అశ్వగంధ తదితర వాణిజ్య పంటలపై పరిశోధనలు చేస్తున్నారని వెల్లడించారు.
ఉత్పత్తులు తయారు చేసి.. ఎగుమతులు పెంచాలి
దేశంలో మిర్చి 25.96 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఉత్పత్తి అవుతుంటే.. అందులో 6.01 లక్షల మెట్రిక్ టన్నుల ముడిసరకు (రూ.12492 కోట్లు) ఎగుమతి అవుతోంది. మన దేశ వాటా 58 శాతంతో అగ్రస్థానంలో ఉన్నా.. 0.5 శాతం మాత్రమే విలువ ఆధారిత ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. వచ్చే రెండేళ్ళలో వాటిని 3 లక్షల టన్నులకు పెంచాలన్నదే లక్ష్యం. ఉదాహరణకు దుబాయ్ ప్రజలకు మిర్చి ఎర్రగా… కారంగా ఉండాలి. యూరప్‌లో కారం తక్కువగా ఉంటూ.. ఫ్లెక్స్‌గా వినియోగిస్తారు. ఏ దేశంలో ఏ తరహా ఉత్పత్తులకు గిరాకీ ఉందో గుర్తించి.. అందుకు అనుగుణంగా వంగడాలు, ఉత్పత్తుల తయారీ దిశగా పరిశోధనలు సాగుతున్నాయి. నాలుగు వాణిజ్య పంట ఉత్పత్తులు అధికంగా సాగు చేసే ప్రాంతాలను మ్యాపింగ్ చేశాం. సాగు పద్ధతులను రైతులకు వివరిస్తాం. ఉత్పత్తులు కొనుగోలు చేసి, శుద్ధి చేసేందుకు ప్రాథమిక స్థాయిలో ఎఫ్‌పీవో, రెండో థలో ఎఫ్పీసీ, మూడో స్థాయిలో సంబంధిత పరిశ్రమలతో ఒప్పందం చేసుకొని రైతులకు మేలు జరిగేలా చూస్తాం. ఇప్పటికే రాజమహేంద్రవరం కేంద్ర కార్యాలయ ప్రాంగణంలో నిర్కా నెస్ట్ (ఎన్ఐఆర్ సీఏ నెస్ట్) పేరుతో స్టాల్ పెట్టి, విక్రయాలకు ఏర్పాట్లు చేస్తున్నాం.
అధిక ధరలకు దిగుమతి చేసుకుంటూ నష్టపోతున్నాం
దేశం నుంచి మిర్చి, ఆముదం ముడిసరకును విదేశాలకు పంపిస్తున్నాం. వాటితో అక్కడి వారు ఉత్పత్తులు తయారు చేస్తుంటే.. తిరిగి మనం అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నాం. భారత్‌లో 17.95 లక్షల మెట్రిక్ టన్నుల ఆముదం దిగుబడి ఉంటే.. అది కేవలం నూనె ఉత్పత్తికే పరిమితం. టూత్‌పేస్టు, లిప్‌స్టిక్, రంగులు, వార్నిష్ ఇక్కడా చేయొచ్చు. ఏటా 6.46 లక్షల మెట్రిక్ టన్నుల ఆముదం నూనె (రూ. 7,805 కోట్లు) ఎగుమతి చేస్తూ… దాని ఆధారంగా తయారు చేసిన వస్తువులను రూ. 11 వేల కోట్లకు దిగుమతి చేసుకుని నష్టపోతున్నాం. మన నుంచి వియత్నాం విర్చి దిగుమతి చేసుకుంటోంది. మిర్చి ఆయిల్, చాక్లెట్, సాస్ తదితర 100 రకాలు తయారు చేసి, వాటిని ఎగుమతులు చేస్తూ లాభాలు ఆర్జిస్తోంది. అలాంటివి మనవద్దే తయారు కావాలి. ఔషధాల్లో వినియోగించే అశ్వగంధకు 9 శాతం క్యుమిలేటివ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సీఐజీఆర్) ఉంది. దీని చూర్ణంతో హెల్త్‌మిక్స్, ఇమ్యూనిటీ బూస్టర్, క్యాప్సిల్ తయారు చేశాం. అనంతపురంలో అశ్వగంధ, ఆముదం సాగును ప్రోత్సహిస్తున్నాం. ఆహారం, డెయిరీ, ఆక్వా రంగాల్లో వినూత్న ఆలోచనలతో వచ్చేవారికి తోడ్పాటు అందించేందుకు రాజమహేంద్రవరం సీటీఆర్‌ఐలో ఆరు నెలల్లో ఇంక్యుబేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తాం.

