విలువ జోడింపుతోనే మామిడి సాగు లాభదాయకం
పండ్లలో రారాజుగా మామిడిని పిలుస్తారు. మామిడి పండుకు ఉండే రుచి వలన ఆ పండుకు ఆపేరు వచ్చింది. మన దేశంలోనే కాక ఇతర దేశాలలో కూడా మామిడి పండును బాగా ఇష్టపడుతుంటారు. కానీ అన్ని దేశాల వాతావరణాలు మామిడి పంటకు అనుకూలం కాదు కాబట్టి పండే దేశాల నుండి దిగుమతి చేసుకుని మామిడి పండ్ల రుచిని ఆస్వాదిస్తుంటారు. ప్రజలకు మధురానుభూతిని అందించే మామిడి పండు రైతులకు లాభాలను చేకూర్చుతుందా అంటే జవాబు కాదు అని వస్తుంది. మామిడి సాగు చేసే రైతులు చాలా వరకు సరైన లాభాలు ఆర్జించలేకపోతున్నారు. దిగుబడి ఉంటే ధర ఉండదు. ధర ఉంటే దిగుబడి ఉండదు. రెండూ ఉంటే ప్రతికూల వాతావరణ పరిస్థితుల వలన కాయలు రాలిపోతవి. సాధారణంగా మామిడి కాయలు మార్చి, ఏప్రియల్, మే, జూన్ మాసాలలో (కొన్ని రకాలు తప్ప) ఎక్కువ రకాలు దిగుబడులను ఇస్తాయి. కానీ ఈ మాసాలలో వాతావరణంలో మార్పులు జరిగి విపరీతంగా గాలులు రావడం జరుగుతుంది. గాలి ఎక్కువగా వచ్చిన సందర్భాలలో మామిడి కాయలు చాలా వరకు రాలిపోతుంటాయి. అలా రాలి పోయిన కాయలను రైతులు అయినకాడికి అమ్ముకొని ఎంతో కొంత వచ్చిందని సర్దుకుపోతుంటారు. అన్నీ ఒడిదుడుకులు తట్టుకుని దిగుబడిని మొత్తాన్ని సరైన ధరలకు అమ్ముకోగలిగితే మామిడి సాగు లాభదాయకంగా ఉంటుంది. లేదంటే మామిడి రైతులు నష్టాలు భరించవలసిందే. దానికి సరైన పరిష్కారం విలువ జోడింపే అని మామిడికి వివిధ రకాలుగా విలువ జోడించి మామిడితో అనేక రకాల ఉత్పత్తులు తయారు చేస్తూ తన మామిడి సాగును లాభాల బాటలో నడిపిస్తున్నాడు కృష్ణాజిల్లా జి.కొండూరు ప్రాంతానికి చెందిన ఎం. నారాయణ ప్రసాదు.

నారాయణ ప్రసాదుది వ్యవసాయ నేపధ్యమైనాకానీ ఇంజనీరింగు వరకు చదువుకుని తన ఇంజనీరింగ్ నైపుణ్యంతో వివిధ రకాల పరిశ్రమలకు సలహాలు ఇస్తుంటారు. వీరికి 50 సంవత్సరాల పైబడ్డ వయస్సు గల 50 ఎకరాల మామిడితోట ఉంది. అయినా కాని మామిడి సాగుపై అంత శ్రద్ధ పెట్టకుండా వచ్చిన కాడికి ఆదాయం పొందుతూ తన ఇంజనీరింగ్ వృత్తిలో కొనసాగుతున్న సమయంలో 2014 వ సంవత్సరంలో విజయవాడలో సుభాష్పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ పద్ధతిలో ప్రధానంగా ఒక దేశీ ఆవుతో 30 ఎకరాలు సాగు చేయగల పద్ధతి వారికి బాగా నచ్చి అటు వైపు ఆలోచించి తన మామిడి తోటలో సేంద్రియ పద్ధతులు పాటించాలని తలచి 2014 నుంచి తన మామిడి తోటలో పూర్తి సేంద్రియ పద్ధతులు పాటించడం మొదలు పెట్టి కొనసాగిస్తున్నాడు.
సేంద్రియ పద్ధతులు పాటించడము మొదలు పెట్టిన తరువాత అందుకు అవసరమైన దేశీయ ఆవుల పోషణ మొదలు పెట్టి వాటి వ్యర్థాలను తన మామిడి తోట సాగులో వినియోగిస్తున్నాడు. పాదులలో మాగిన పశువుల ఎరువు క్రమం తప్పకుండా అందించడంతో పాటు ఘనజీవామృతం, ద్రవ జీవామృతాలను కూడా అవసరాన్ని బట్టి క్రమం తప్పకుండా అందిస్తూ వస్తున్నాడు. చీడపీడల నివారణకు వేపనూనె, వేప కషాయం, పుల్లటి మజ్జిగలను పంటపై క్రమం తప్పకుండా ఉపయోగించడంతోపాటు లింగాకర్షక ఎరలను, పండుఈగ బుట్టలను కూడా ఏర్పాటు చేస్తుంటాడు. మామిడి తోటలో ఎత్తులో ఉన్న కాయలకు కవరు తొడగడము ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మధ్యస్థంగా ఉన్న కాయలకు కవరు తొడుగుతున్నాడు. కవరు తొడిగిన కాయలు నాణ్యత పెరిగింది కాబట్టి మంచి ధరకు అమ్మగలుగుతున్నాడు. యాజమాన్య పద్ధతులు సక్రమంగా పాటిస్తే పెద్ద వయస్సు ఉన్న మామిడి చెట్టు నుంచి కూడా మంచి దిగుబడిని సాధించవచ్చని నిరూపిస్తున్నాడు.
మామిడి సాగులో మంచి ఆదాయం రావాలంటే మామిడికాయల వృథాను తగ్గించగలగాలి. ఇందుకు గాను కొన్ని కాయలను ఆమ్చూర్ తయారు చేయడానికి, కొన్ని పండ్లను మామిడి తాండ్ర తయారు చేయటానికి, కొన్నింటిని మామిడి పండ్లుగా అమ్మకం చేస్తున్నాడు. ఏది ఏమయినా కాని తన మామిడి తోటలో సాధించిన దిగుబడి ఏమాత్రం వృథాకాకుండా పంట మొత్తాన్ని అమ్ముకోగలుగుతున్నాడు. తన మామిడి తోటలో తోతాపురి, రసాలు, బంగినపల్లి, అల్ఫోన్సా లాంటి మామిడి రకాలను సాగు చేస్తున్నాడు.
మామిడి తాండ్ర: సరైన ధరకు అమ్మకం చేయలేని మామిడి పండ్ల నుంచి మామిడి తాండ్రను తయారు చేస్తున్నాడు. ఇందుకు గాను అప్పట్లో 8 లక్షలు ఖర్చు చేసి డ్రయ్యరును కొనుగోలు చేసుకున్నాడు. మామిడి పండ్లను శుభ్రంగా కడిగి తొక్క తీసి మిక్సీ సహాయంతో మామిడి గుజ్జు చేసి అందులో పూర్తి సేంద్రియంగా తయారు చేసిన బెల్లాన్ని కలిపి అవసరమైనంత మందంలో ట్రేలలో పోసి ట్రేలను డ్రైయ్యరులో పెట్టినట్లయితే గంటకు రెండు లీటర్ల నీళ్ళు ఆవిరి అయిపోతాయి. అందులో ఉన్న నీటిశాతాన్ని బట్టి గట్టిగా తయారయిన తరువాత ట్రేల నుంచి తీసి అవసరమయినంత కొలతల ప్రకారం ముక్కలుగా కోసి మామిడి తాండ్రను అమ్మకం చేస్తున్నాడు. మామిడి కాయలకంటే రెండు, మూడు రెట్ల అధిక ధరకు మామిడి తాండ్రను అమ్మగలుగుతున్నారు.

ఆమ్చూర్ తయరీ: ఆమ్చూర్కి గిరాకి రోజురోజుకి పెరుగుతూ ఉంది. మన దేశంలోనే కాకుండా కొన్ని ఇతర దేశాలలో కూడా ఆమ్చూర్ని ఉపయోగిస్తున్నారు. పుల్లగా ఉన్న కాయలు ఆమ్చూర్కి ఉపయోగిస్తుంటారు. రాలిపోయిన కాయలు లేదా పండించడానికి అవకాశాలు లేని కాయలతో ఆమ్చూర్ తయారు చేస్తున్నారు. ఇందుకు గాను కాయలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసి డ్రై చేస్తున్నాడు. మామిడి ముక్కలను డ్రై చేయడానికి తన ఇంజనీరింగ్ నైపుణ్యంతో సుమారు 8 లక్షల వ్యయంతో 60þ20 అడుగులలో పాలీ డ్రైయ్యరును తయారు చేసుకున్నాడు బయట కంటే ఈ డ్రయ్యరులో సుమారు 15 సెంటిగ్రేడు డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టే త్వరగా ఎండుతున్నాయి. ఈ డ్రయ్యరును ఆమ్చూర్ తయారీకి, పొదీనా పొడి తయారీకి, అల్లంతో శొంఠి తయారీకి ఉపయోగిస్తున్నాడు. తన మామిడితోటలో అంతర పంటలుగా పొదీనా మరియు అల్లంలను సాగు చేస్తూ వాటిని పొడి చేస్తున్నారు. పచ్చి అల్లంకి మార్కెట్లో మంచి ధర లభించడం లేదు కనుక అల్లంని ఎండబెట్టి శొంఠి పొడిచేసి కిలో 150/-లకు అమ్మకం చేస్తున్నాడు. ఆమ్చూర్ పొడిని కిలో రూ. 300/- నుంచి రూ. 400/- లకు అమ్మకం చేస్తూ వృథా మామిడి కాయల నుంచి కూడా ఆదాయం పొందుతున్నాడు.

మామిడిపండ్లు మాగబెట్టుట: మామిడి పండ్లను మాగబెట్టటానికి 24 టన్నుల సామర్థ్యం గల గదిని నిర్మించుకుని ఆ గదిలో తన ఇంజనీరింగ్ ఆలోచనతో స్లాండ్లు ఏర్పాటు చేసుకుని మామిడి పండ్లను మాగబెడుతున్నాడు. ఇందుకుగాను తయారయిన కాయలను చెట్టు నుంచి చిక్కం సహాయంతో కోసి స్టాండ్లలో ఏర్పాటు చేసిన గడ్డిపై అమర్చి కొంతకుళ్ళిన టమాటాలు లేదా కుళ్ళిన అరటి పండ్లను ఆ గదిలో ఉంచడం జరుగుతుంది. ఈ కుళ్లిన అరటి లేదా టమాటాల నుంచి ఇథలిన్ అనే గ్యాసు ఉత్పత్తి అయ్యి మామిడి కాయలను పండించటానికి ఉపయోగపడుతుంది. హానికారకమైన కార్బైడ్ లాంటి పొడులను ఉపయోగించకుండా సహజ సిద్ధంగా పండించి నాణ్యత దెబ్బతినకుండా అట్టపెట్టెలలో స్టాక్ చేసి వినియోగదారులకు అందిస్తున్నాడు. కొంతమంది వినియోగదారులు నేరుగా తోట వద్దకు వచ్చి కొనుగోలు చేస్తుంటారు.

అన్ని రకాల మెలకువలు పాటిస్తూ పూర్తి సేంద్రియ పద్ధతులతో మామిడి సాగు చేస్తూ దిగుబడి వృధా కాకుండా మామిడి పండ్లు, ఆమ్చూర్, మామిడి తాండ్రలుగా అమ్మకం చేస్తూ తన మామిడి సాగును లాభాల బాటలో నడిపిస్తున్నాడు.
మరిన్ని వివరాలు 95155 04531 కి ఫోను చేసి తెలుసుకోగలరు. – వై. శ్రవణ్ కుమార్, స్పెషల్ కరస్పాండెంట్

