రైతులే నిజమైన శాస్త్రవేత్తలు : మంత్రి తుమ్మల
రైతులే నిజమైన శాస్త్రవేత్తలని, వారి అనుభవాలతోపాటు వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులు సాధించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వికారాబాద్ జిల్లా ధారూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సేంద్రియ వ్యవసాయానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. పంట నష్టపోయిన రైతులకు పంట బీమా వర్తింపచేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తే నష్టాలుండవన్నారు. రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ.. భూభారతి చట్టం ద్వారా లక్షలమంది రైతులకు భూహక్కులు కల్పిస్తామన్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్, వ్యవసాయశాఖ కమిషనర్ గోపి, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి జానయ్య తదితరులు పాల్గొన్నారు.
*మామిడి పక్వానికి కార్బైడ్ వాడితే కఠిన చర్యలు*
మామిడికాయలు పండేందుకు హానికర రసాయనం కార్బైడ్ వాడితే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వెంటనే రాష్ట్రవ్యాప్తంగా పండ్ల మార్కెట్లలో తనిఖీలు చేపట్టాలని సూచించారు. సోమవారం మామిడి మార్కెట్లపై మార్కెటింగ్ డైరెక్టర్ సురేంద్రమోహన్ ఇతర అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ”ఈ సీజన్లో కార్బైడు భారీగా వాడుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఎవరైనా కార్బైడ్‌ను వినియోగిస్తున్నారని తేలితే వారి లైసెన్సులు రద్దు చేస్తాం” అని మంత్రి చెప్పారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం నుంచి మార్కెటింగ్ అధికారులు, జీహెచ్ఎంసీ ఆహార భద్రత విభాగం డిప్యూటీ డైరెక్టర్ ప్రసాద్‌రావు తదితరులు హైదరాబాద్‌లోని జాంబాగ్, బాటసింగారం పండ్ల మార్కెట్లలో తనిఖీలు చేపట్టారు. పలుచోట్ల పండ్లను నాణ్యత పరీక్షల కోసం ప్రయోగశాలలకు పంపారు.

