మామిడిలో కొమ్మ కత్తిరింపులు, యాజమాన్య పద్ధతులు
మామిడి పంటకు మనదేశం ప్రసిద్ధి చెందినది. మామిడి సాగులో మనదేశం మొదటి స్థానంలో, ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉంది. ప్రపంచ ఉత్పత్తిలో మనదేశం వాటా దాదాపుగా 65 శాతం వరకు ఉంది. ఉత్పత్తిలో మనదేశం ముందు ఉన్నప్పటికీ ఉత్పాదకతలో మిగతా దేశాలతో పోలిస్తే చాలా వెనకబడి ఉన్నాము. అంతే కాకుండా గత థాబ్దకాలంలో ఉత్పత్తి కూడా హెక్టారుకు 8.1 టన్నుల నుండి 5.5 టన్నులకు పడిపోయింది. మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో రకాల లభ్యత మరియు వైవిధ్యం చాలా ఎక్కువ. వివిధ రకాల అవసరాలకు (పచ్చళ్ళు, రసాలు, కోత రకాలు మొదలైనవి) అనువైన రకాలు చాలా వున్నాయి. కాబట్టి ప్రపంచ మార్కెట్లో మన వాటా పెంచడానికి, ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచడానికి కొన్ని యాజమాన్య పద్ధతులు ముఖ్యంగా కత్తిరింపులు చేపట్టడం చాల అవసరం.
కత్తిరింపుల వలన లాభాలు
- ప్రతి సంవత్సరం నిలకడగా కాపు కాస్తుంది.
- చెట్టుకు గాలి వెలుతురు బాగా సోకి దిగుబడి పెరుగుతుంది.
- తోటలో అంతర కృషి పనులు చేయటానికి అనువుగా వుంటుంది
- నాణ్యమైన పండ్ల ఉత్పాదకత పెరుగుతుంది.
- చీడ పీడల బెడద తగ్గుతుంది.
- చెట్టు ఎత్తును అదుపులో ఉంచుకోవచ్చు
ఈ కత్తిరింపుల ప్రక్రియ మొక్క వయస్సును బట్టి చేపట్టాలి. లేత మొక్కలలో ఒకరకంగా, కాపుకు వచ్చిన తోటల్లో ఒకరకంగా, ముదిరిన తోటల్లో ఒకరకంగా చేయాలి.
లేత తోటలలో కత్తిరింపులు
మొక్కై వంగనదే మానై వంగదు అనే సామెత మన అందరికి తెలిసిందే. మొక్క థలోనే మామిడిని మంచి ఆకారంతో పెంచుకోవాలి. మొక్క నాటిన తర్వాత కాండం బలంగా పెరగడానికి ఒక మీటరు ఎత్తు వరకు పక్క కొమ్మలు లేకుండా పెరగనివ్వాలి. ఆ తర్వాత మొక్క మొదలు నుండి 70 సెం. మీ. ఎత్తులో కాండాన్ని అక్టోబర్-నవంబర్ నెలల్లో కత్తిరించాలి. తర్వాత అక్కడ నుండి ప్రధాన కొమ్మలు పెరుగుతాయి. నాలుగు వైపులా పెరిగిన 4 ప్రధాన కొమ్మలను మాత్రమే పెరగనిచ్చి 1 మీ. పొడవు పెరిగిన తర్వాత 70 సెం. మీ.కు కత్తిరిస్తే అక్కడనుండి ద్వితీయ కొమ్మలు పెరుగుతాయి. ప్రతి ప్రధాన కొమ్మపై 2-3 ద్వితీయ కొమ్మలను మాత్రమే సమాన దూరంలో పెరగనివ్వాలి. అలాగే ప్రతి ద్వితీయ కొమ్మపై 2 -3 తృతీయ కొమ్మలను పెరగనిచ్చి మిగతా కొమ్మలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. ఈ విధంగా చేయటం వలన చెట్టు నిటారుగా పెరగకుండా గుబురుగా పెరిగి దిగుబడి పెరుగుతుంది. ఈ కత్తిరింపులు చేసినపుడు ఎండిన కొమ్మలు, తెగులు సోకిన కొమ్మలు, అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు తీసివేయాలి.
కాపుకు వచ్చిన తోటల్లో కత్తిరింపులు
మామిడి కాయలు కొమ్మల చివర్లలో గుత్తులుగా కాస్తాయి. కనీసం 6-8 వారాల వయస్సు పై బడిన కొమ్మలపై మాత్రమే పూత వస్తుంది. అంతకన్నా తక్కువ వయస్సు ఉన్న కొమ్మలపై పూత రాదు. కాబట్టి కాయ కోత వెంటనే కత్తిరింపులు చేస్తే కొత్త చిగుర్లు పెరిగి పూత వచ్చేటప్పటికి వాటి వయస్సు 8 వారాలపైనే ఉంటుంది. కాపుకు వచ్చిన తోటల్లో రెండు సార్లు కత్తిరింపులు చేసుకోవాలి.
మొదటి కత్తిరింపులు
మొదటి కత్తిరింపులు కాయ కోత వెంటనే చేపట్టాలి. కాయలు పెరిగిన పూత కాడలను తొలగించి అక్కడనుండి కొమ్మలను కనీసం 10-15 సెం. మీ. వెనక్కి కత్తిరించాలి. అలాగే బాగా కిందకు వేలాడిన కొమ్మలను తీసేయాలి. చెట్టు లోపలి భాగంలో అడ్డదిడ్డంగా ఒకదానిపై ఒకటిగా పెరిగిన కొమ్మలను తీసివేస్తే చెట్టు లోపల భాగాలలో గాలి, వెలుతురు ప్రసరణకు అనువుగా ఉంటుంది. అదేవిధంగా చెట్టు లోపల భాగంలో నిటారుగా పెరిగే 2-3 కొమ్మలను కత్తిరించాలి. కత్తిరింపులు చేసినపుడు కొమ్మలు చీలిపోకుండా జాగ్రత్తగా కత్తిరించాలి. అయితే కాపుకు వచ్చిన చెట్లలో 25% కన్నా ఎక్కువ కొమ్మలు కత్తిరిస్తే దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ జాగ్రత్త తీసుకోవాలి. అలాగే తెగులు సోకిన కొమ్మలు, ఎండిన కొమ్మలు ఉంటే తీసివేయాలి.
రెండవసారి కత్తిరింపులు
రెండవసారి కత్తిరింపులు పూతకు ముందు అంటే నవంబర్ – డిసెంబర్ నెలల మధ్యలో చేయాలి. ఈ కత్తిరింపులు 1-2 వారాల్లో పూర్తి చేయాలి. ఈ కత్తిరింపుల్లో భాగంగా పూతకు ముందు ఏవైన కొత్త చిగుర్లు వస్తే 10-15 సెం మీ. వెనక్కి (ముదురు భాగం వరకు) కత్తిరించాలి. లేకపోతే ఆ కొమ్మలపై పూత రాదు. అలాగే బాగా కిందకు వేలాడి నేలను తాకే కొమ్మలను తీసేయాలి. ఈ థలో కూడా చెట్టు మధ్యలో లోపలి భాగంలో వత్తుగా పెరిగిన కొమ్మలు లేదా కొమ్మ భాగాలు, అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మ భాగాలను తీసేసి గాలి, వెలుతురు సోకేటట్లు చేయాలి. దీనివలన కాయలు పండిన తర్వాత మంచి రంగు సంతరించుకొని నాణ్యంగా ఉండి అధిక ధర పలుకుతాయి.
ముదిరిన తోటల్లో కత్తిరింపులు
మన రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మామిడి తోటలు 50-60 సంవత్సరాలు పైబడినవే ఉండటం వలన వాటి ఉత్పత్తి తగ్గి ఆదాయం రావటం లేదు. ఈ ముదురు తోటలు ఎత్తుగా ఉండడం వలన సస్య రక్షణ చర్యలు చేపట్టడానికి కూడా అనువుగా ఉండక దిగుబడులు తగ్గుతున్నాయి. అందువలన రైతులు వాటి యాజమాన్యం చేపట్టలేక ముదురు తోటలను తొలగించి వాటి స్థానంలో వేరే పంటలు అంటే నీటి వసతి ఉన్న వాళ్ళు ఆయిల్ పాం తోటలు నీటి వసతి లేని వాళ్ళు మళ్ళీ అంటు కట్టిన మామిడి మొక్కలను నర్సరీలనుండి తెచ్చుకొని వేసుకొంటున్నారు. మళ్ళీ కొత్తగా వేసుకోవటం వలన పెట్టుబడి ఎక్కవ అవటమే కాకుండా వాటి నుండి ఆదాయం పొందడానికి కనీసం 5 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ నష్టాన్ని భరించాలంటే కొత్త మొక్కలు వేసుకోకుండా ఉన్న ముదురు తోటలని పూర్తిగా తొలగించకుండా వాటి వేరు వ్యవస్థను ఉపయోగించుకొని ఎక్కువ పెట్టుబడి లేకుండా ప్రూనింగ్ పద్ధతి ద్వారా వాటిని సులభంగా పునరిద్ధరించుకొని మంచి దిగుబడులు పొందవచ్చు.
బాగా ఎత్తుగా పెరిగిన ముదురు చెట్ల కొమ్మలను భూమట్టం నుండి అంటే ఎక్కడైతే కొమ్మలు ఏర్పడతాయో అక్కడ నుండి ఒక అడుగు ఎత్తు వరకు ఉంచి కత్తిరించాలి. అన్ని కొమ్మలు ఒకే సారి కత్తిరించకుండా ఒక వైపు ఉన్న కొమ్మలను ఉంచి వేరొక వైపు ఉన్న కొమ్మలను కత్తిరించుకోవాలి. ఇలా చేస్తే కత్తిరించిన కొమ్మలపై మళ్ళీ చిగుర్లు వచ్చే వరకు కావలసిన పోషకాలను మిగతా సగం కొమ్మల నుండి (కత్తిరించకుండా చెట్టుపై వదిలేసిన కొమ్మలు) పొందుతుంది. అంతే కాకుండా ఈ కొమ్మలనుండి ఎంతో కొంత దిగుబడిని పొందవచ్చు. కత్తిరించిన కొమ్మలపై కొన్ని వారాల తర్వాత చిగుర్లు వస్తాయి. ఇలా వచ్చిన చిగుర్లను ఒక్కో కొమ్మకు 4 వైపులా 25-30 సెం.మీ. దూరంలో వచ్చిన బలమైన కొమ్మలు మాత్రమే ఉంచి మిగతావి ఎప్పటికప్పుడు వచ్చినవి వచ్చినట్టే తీసేయాలి.
ఒకవేళ ముదురు తోటలు టెంకల ద్వారా పెరిగినవి అయితే ప్రూనింగ్ తర్వాత పెరిగిన కొమ్మలపై మనకు నచ్చిన లేదా ఆయా ప్రాంతాల్లో ఎక్కువ గిరాకీ ఉండే రకాలను గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు. గ్రాఫ్టింగ్ చేసిన భాగం అతుక్కొన్న తర్వాత అతుకు కింద భాగం పై వచ్చిన చిగుర్లను ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. ఇలా చేసిన చెట్ల నుండి 3 సంవత్సరాల్లో దిగుబడి పొందవచ్చు.
కత్తిరింపులు చేసేటప్పుడు కొంచెం ఏటవాలుగా చేయాలి. లేకపోతే వర్షం పడినపుడు నీరు కొమ్మలపై ఉండిపోయి శిలీంద్రాలు ఆశించి చెట్లు చనిపోయే అవకాశంఉంటుంది. కొమ్మలు కత్తిరించిన ప్రతి సారి కత్తిరించిన ప్రదేశంలో బోర్దో పేస్టు పూయాలి.
కత్తిరింపుల తర్వాత యాజమాన్యం
కొమ్మ కత్తిరింపుల తర్వాత చెట్టు వయస్సును బట్టి సిఫార్సు చేసిన ఎరువులను వేసి నీటి తడులు ఇవ్వాలి.
ఎక్కువుగా సేంద్రియ ఎరువు మరియు జీవన ఎరువులను వేసుకోవాలి. కాపుకు వచ్చిన తోటల్లో మొదటి కత్తిరింపుల తర్వాత తొలకరి వర్షాల సమయంలో ఎరువులు వేసుకొంటే మొక్కకి పోషకాలు అందుతాయి ఒక వేళ వర్షాలు లేనట్లయితే నీటి తడులు ఇచ్చుకోవాలి.
కొత్త చిగుర్లు వచ్చిన తర్వాత సూక్ష్మధాతు (జింకు, బోరాన్, ఇనుము మొదలైన) లోపాలు గమనిస్తే జింక్ 2-5 గ్రా., బోరాన్ 1-2 గ్రా. ఐరన్ సల్ఫేట్ 2 గ్రా. మెగ్నీషియం సల్ఫేట్ 2 గ్రా. ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. నీటి యాజమాన్యాన్ని, పురుగులుా, తెగుళ్ల యాజమాన్యాన్ని సరైన సమయంలో చేసుకోవాలి.
కాబట్టి రైతులు ఈ విధంగా కత్తిరింపులు చేసుకొని తగిన యాజమాన్య చర్యలు చేపట్టినట్లైతే నాణ్యమైన దిగుబడి వచ్చి అధిక ఆదాయాన్ని పొందుతారు. దీ
డా. కె. రాధారాణి, ప్రిన్సిపల్ సైంటిస్ట్ (హార్టి), డా. బి.కె.ఎం. లక్ష్మి, ప్రిన్సిపల్ సైంటిస్ట్ (ప్లాంట్ పథాలజీ) మరియు డా. జి. స్రవంతి, సైంటిస్ట్ (ఎంటమాలజీ), మామిడి పరిశోధనా స్థానం, నూజివీడు.

