మళ్లీ అమెరికాకు మన రొయ్య
- ఎగుమతికి సిద్ధంగా 30 వేల నుంచి 40 వేల టన్నులు
- 100 కౌంట్ రొయ్యలకు కిలోకు రూ.220 నుంచి రూ.230
- 30, 60 కౌంట్ రొయ్యకు నామమాత్రపు ఊరట
- సుంకాలకు ముందున్న ధరలతో పోలిస్తే రూ.40 తక్కువే
పెంచిన సుంకాల అమలును వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యకక్షుడు ట్రంప్ ప్రకటించడంతో.. ఆంధ్ర రొయ్యకు మళ్లీ కాస్త ఊపిరొచ్చింది. వందల కంటెయినర్లు మళ్లీ సముద్ర మార్గాన బయల్దేరేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో శీతల గోదాముల్లోని నిల్వలు క్రమంగా ఖాళీ అవుతున్నాయి. అయితే రైతుకు మాత్రం.. సుంకాల ప్రకటనకు ముందున్న ధరలైతే దక్కడం లేదు. 100 కౌంట్కు ఇచ్చే ధర గతంలో రూ.240 ఉండగా ఇప్పుడు రూ. 230 వరకు లభిస్తోంది. 30 కౌంట్ ధరలో తేడా చాలా ఎక్కువగా ఉంది. సుంకాల ప్రకటనకు ముందు కిలో రూ.470 చొప్పున కొనగా.. ఇప్పుడు రూ.420 నుంచి రూ.430 మాత్రమే ఇస్తున్నారు. వీటికి ధరలు పెంచాలని రైతులు కోరుతున్నారు.
మధ్యాహ్నం నుంచి కాస్త పెరిగిన ధరలు
సుంకాల ప్రకటనకు ముందు రైతుల నుంచి కొన్న రొయ్యలు గోదాముల్లోనే ఉన్నాయి. సుంకాల అమలుకు 90 రోజులు గడువు ఇవ్వడంతో వాటన్నింటిని అమెరికాకు ఎగుమతి చేసేందుకు వ్యాపారులు సిద్ధమయ్యారు. ఇవి సుమారు 30 వేల నుంచి 40 వేల టన్నులు ఉంటాయని అంచనా. అంటే సుమారు 3 వేల నుంచి 4వేల కంటెయినర్ల సరకు. ఎగుమతికి వ్యాపారులు సిద్ధమవడంతో రొయ్యల కొనుగోలులో పురోగతి కనిపించింది. సోమవారం ఉదయంతో పోలిస్తే మధ్యాహ్నం నుంచి రొయ్య ధరల్లో కొంత పెరుగుదల కనిపించింది. 30 కౌంట్ రొయ్య ఉదయం కిలో రూ.420 ఉండగా మధ్యాహ్నం తర్వాత రూ.10 పెరిగి రూ.430 అయింది. 25 కౌంట్ రొయ్య కిలో రూ.470 నుంచి రూ.500కి చేరింది.
చిన్నకౌంట్ రొయ్యకు కిలోకు రూ.5-10 పెంచారు.
ఆక్వా సలహా కమిటీ సమావేశం అర్ధాంతరంగా ముగింపు
రొయ్యల ధరలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆక్వా సలహా కమిటీ సమావేశం సోమవారం జూమ్ విధానంలో జరిగింది. అప్సడా వైస్ చైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి, ఉపసభాపతి రఘురామకృష్ణరాజుతోపాటు ఎగుమతిదారులు, రైతు ప్రతినిధులు హాజరయ్యారు. రొయ్యలకు ధర పెంచాలని రైతులు కోరగా.. ఇప్పటికిప్పుడు ధరలు నిర్ణయించలేమని ఎగుమతి వ్యాపారులు సమాధానమిచ్చారు. 70% ఉత్పత్తి కొనుగోలు ట్రేడర్ల ద్వారా జరుగుతోందని వివరించారు. రైతుల నుంచి కొనుగోలు చేసేది ట్రేడర్లే అయినా చివరకు చేరేది వ్యాపారులకేనని రైతులు, ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. వ్యాపారులు నిర్ణయించిన ధరకే వారు కూడా కొంటారని.. ప్రతి 15 రోజులకోసారి ధరలు ప్రకటించాలని కోరారు. దీనిపై కొద్దిసేపు వాడీవేడిగా వాదనలు చోటుచేసుకున్నాయి. తాము మిగిలిన వ్యాపారులతో చర్చించి నిర్ణయం వెలువరిస్తామని, ఇప్పటికిప్పుడు ధరలు ప్రకటించలేమంటూ ఎగుమతిదారుల సంఘ ప్రతినిధులు స్పష్టం చేయడంతో సమావేశం అర్ధంతరంగా ముగిసింది.

