తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖ జలాశయాలలో పేరుకు పోయిన పూడిక వెలికితీత ద్వారా భారీ రాబడితో పాటు జలాశయాల్లో నీటి నిల్వ పెంపునకు చర్యలు ప్రారంభించింది. దీనికోసం సెడిమెంటేషన్‌ ప్రణాళికలో భాగంగా పైలట్‌ ప్రాజెక్టు కింద తొలుత కడెం, మధ్య మానేరు, దిగువ మానేరు జలాశయాల్లో పూడికతీతకు గురువారం టెండర్లు పిలిచింది. ఈ మూడు జలాశయాల నుంచి పూడికతీత ద్వారా 4.24 కోట్ల టన్నుల ఇసుక వెలికితీయవచ్చని ప్రాథమిక అంచనా. అయితే, టన్నుకు రూ.339.36 గుత్తేదారుల నుంచి నీటిపారుదలశాఖ వసూలు చేయనుంది.
20 ఏళ్ల సమయానికి టెండర్లు
ఈ మూడు జలాశయాల్లో పూడిక వెలికితీత కాల పరిమితిని 20 ఏళ్లుగా నిర్ధారించారు. పని అంచనా విలువను రూ.1439.55 కోట్లుగా నిర్ణయించారు. ఈ మేరకు టెండర్ల ప్రకటనలో నీటిపారుదలశాఖ(కరీంనగర్‌ సర్కిల్‌) పేర్కొంది. నిర్మల్‌ జిల్లాలోని కడెం నారా యణరెడ్డి ప్రాజెక్టు నుంచి 3.28 కోట్ల టన్నులు, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మనువాడలోని మధ్యమానేరు నుంచి 63 లక్షల టన్నులు, కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం అలుగునూర్లోని దిగువ మానేరు నుంచి 33 లక్షల టన్నుల ఇసుకను వెలికి తీయవచ్చని అంచనా వేస్తున్నారు. టెండర్ల దాఖలుకు ఈనెల 21 వరకు గడువు ఇచ్చారు. రాష్ట్ర భూగర్భగనులు, ఖనిజాల శాఖ విధివి ధానాలను అనుసరించి గుత్తేదారులు పన్నులు చెల్లించాలి. ఇసుక నిర్వహణ బాధ్యతలను కూడా టీజీఎండీసీ, నీటిపారుదల శాఖల సంయుక్త పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. దీనికోసం ఇసుక తరలించే ప్రాంతాల్లో వే బ్రిడ్జిలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మూడు జలాశయాల్లో పూడికతీత అనంతరం గుత్తేదారులు మట్టిని, ఇసుకను వేరు చేయనున్నారు. మట్టిని రైతులకు ఉచితంగా ఇచ్చేందుకు నీటిపారుదలశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.