రైతులకు సకాలంలో వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు అందించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అధికారులను ఆదేశించారు. దీనికి అనుగుణంగా అవసరమైన సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల మంజూరు, పీఎం సూర్యఘర్‌, ఆర్డీఎస్‌ఎస్‌ పనుల పురోగతిపై ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో గురువారం ఆయన డిస్కంల సీఎండీలతో సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ.. ‘వచ్చే వ్యవసాయ సీజన్‌కు అర్హులైన రైతులకు విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వాలి. ప్రస్తుతం ఆర్డీఎస్‌ఎస్‌ పథకం కింద ఫీడర్ల విభజన, కొత్త ఫీడర్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. పనులు నిర్వహించే ప్రాంతంలో ఎల్‌సీ తీసుకుని విద్యుత్‌ సరఫరా నిలిపేస్తే.. ప్రజలు దాన్ని కోతలుగా భావిస్తున్నారు. ఈ దృష్ట్యా ప్రజలకు ముందుగా సమాచారం పంపాలి. విద్యుత్‌ ప్రమాదాల నియంత్రణకు ఉన్న అవకాశాలను పరిశీలించాలి’ అని డిస్కంల సీఎండీలకు సూచించారు. ఈ సమావేశానికి కేంద్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (సీపీడీసీఎల్‌) సీఎండీ పుల్లారెడ్డి, ఎస్‌పీడీసీఎల్‌, ఈపీడీసీఎల్‌ సీఎండీలు సంతోషరావు, పృధ్వీతేజలు వర్చువల్‌గా హాజరయ్యారు.