ఈ మహిళలు ఒకప్పుడు పొలాల్లో కూలీలుగా పనిచేసేవారు. ఇప్పుడు చిరుధాన్యాలతో బిస్కెట్లను తయారు చేస్తున్నారు. వీరి విజయం గురించి తెలుసుకుంటే మీరూ సంతోషిస్తారు’ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ భద్రాచలం గిరిజన మహిళలను అభినందించారు. భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్‌, జిల్లా జాబ్స్‌ మేనేజర్‌ హరికృష్ణల సహకారంతో రాగి, సజ్జ, జొన్న, సామలతో భద్రాద్రి శ్రీరామ స్వయం సహాయక సంఘం నిర్వాహకులు వి. వెంకటలక్ష్మి, తాటి లలిత, సోయం మంగవేణి, జజ్జర సమ్మక్కలు ఏడాది నుంచి చిరుధాన్యాలతో బిస్కెట్లు తయారు చేస్తూ రాణిస్తున్నారు. ఆదివారం జరిగిన ‘మనీ కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రధాని ఈ విషయాన్ని ఉటంకించారు. మోదీ మాట్లాడుతూ.. ‘మన తల్లులు, సోదరీమణులు, అమ్మాయిలు సమాజానికి కొత్త దిశను సృష్టిస్తున్నారు. తెలంగాణలోని భద్రాచలం మహిళల విజయం అలాంటిదే’ అని ప్రస్తావించారు. ‘ఇక్కడ భద్రాద్రి మిల్లెట్‌ మ్యాజిక్‌ పేరుతో తయారయ్యే చిరుధాన్యాల బిస్కెట్లను హైదరాబాద్‌కు, అక్కడ నుంచి లండన్‌ దాకా పంపిస్తున్నారు. భద్రాచలం మహిళలు స్వయం సహాయక బృందంతో అనుసంధానమై శిక్షణ పొందారు. వీరు మరో ప్రశంసనీయమైన పని కూడా చేశారు. మూడు నెలల్లోనే 40 వేల గిరి శానిటరీ ప్యాడ్లను తయారుచేసి పాఠశాలలకు, కార్యాలయాలకు పంపిణీ చేశారు’ అంటూ ప్రధాని మెచ్చుకున్నారు.