బొప్పాయి పాలు.. రైతులకు ఆదాయ వనరు
ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా చిన్నవంగలితో పాటు సమీపంలోని గ్రామాలైన వైఎస్సార్ కడప జిల్లా కానగూడూరు, క్రిష్ణంపల్లె గ్రామాల్లో రైతులు అధికంగా బొప్పాయి సాగు చేస్తుంటారు. మొక్క నాటిన కాలం నుంచి తొమ్మిది నెలలకు పంట చేతికొస్తుంది. పండ్ల సేకరణ అనంతరం 13 నెలల తర్వాత మిగిలినవి, ముదురు కాయలకు గాట్లు పెట్టి పాలను సేకరిస్తున్నారు. తెల్లవారుజాము సమయంలోనే కాయలకు గాట్లు పెడితే కేవలం రెండు గంటల్లోనే పాలు ఊరుతాయి. ఇలా సేకరించిన పాలను రాయచోటి, రాజంపేటకు చెందిన వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. 20 లీటర్ల పాలు రూ.6 వేలకు విక్రయిస్తున్నారు. సేకరించిన పాలను పరిశ్రమల్లో మందులు, కాస్మోటిక్స్, సబ్బుల తయారీలో ఉపయోగిస్తున్నారు. బెంగళూరు, చెన్నైతో పాటు నాణ్యతను బట్టి విదేశాలకు సైతం పాలను ఎగుమతి చేస్తున్నారు.

