కుళ్ళిన పండ్లు లేక కూరగాయల మిశ్రమ ద్రావణం

ఈ మిశ్రమం సూక్ష్మక్రిములకు, వానపాములకు ఆహారంగా ఉపయోగపడి మొక్క ఆరోగ్యంగా పెరుగుటకు దోహదపడుతుంది.

మోతాదు : ఎకరానికి 50 లీటర్లు

కావలసిన పదార్థాలు : ఆవుపేడ : 25 కిలోలు; నీరు : 50 లీటర్లు; కుళ్ళిన పండ్లు లేదా కూరగాయలు : 20 కిలోలు.

తయారు చేయు విధానం: ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో నీరు, ఆవుపేడ కలిపి నాలుగు రోజులు మురగబెట్టాలి. కుళ్ళిన పండ్లు లేదా కూరగాయలను ఒక డ్రమ్ములో వేసి మూతబెడితే 4 రోజులలో కుళ్ళిపోతాయి. వీటిని అదే రోజున మెత్తగా పిసికి, ఆవుపేడ, నీళ్ళు కలిపిన డ్రమ్ములో వేసి కలియ పెట్టాలి. ఆపైన మూత వదులుగా పెట్టి, మరుసటి రోజున ఈ మిశ్రమాన్ని కర్రతో కలిపి డ్రమ్ముపై మూతపెట్టాలి. 10 రోజులలో మిశ్రమం తయారవుతుంది. 11వ రోజున ఈ మిశ్రమాన్ని వడబోసి, సుమారు 50 లీటర్లు ఒక ఎకరం పొలంలో నీటిద్వారా గాని, లేదా కళ్ళాపిలా గాని నేలపై చల్లాలి.

Read More

జీవ ఎరువుల తయారీ కోసం వియత్నాం సంస్థతో ఒప్పందం

హైదరాబాద్‌లోని జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆధునిక సాంకేతికతతో దేశంలోనే తొలిసారిగా ఆరు గంటల్లోనే వివిధ జీవ వ్యర్థ పదార్థాల(బయోవేస్ట్‌)ను పోషకాలు అధికంగా ఉండే ఎరువు(బయో ఫెర్టిలైజర్‌) గా మార్చే భారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఈ మేరకు వియత్నాంకు చెందిన ప్రసిద్ధ జీవ ఎరువుల తయారీ సంస్థ ‘బయోవే’తో అగ్రి వర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)లో రెండు నెలల్లో దీన్ని ఏర్పాటు చేసి ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు వర్సిటీ ఉపకులపతి అల్దాస్‌ జానయ్య తెలిపారు. బయోవే.. 11 దేశాలకు జీవ ఎరువులను ఎగుమతి చేస్తోంది. ఇటీవల విదేశీ పర్యటన సందర్భంగా ఈ కంపెనీ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన జానయ్య.. అగ్రివర్సిటీలో ప్లాంటును ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి వారు అంగీకరించి.. ఒప్పందం కుదుర్చుకున్నారు. వీసీ సమక్షంలో బయోవే సీఈవో లీతి కామ్‌టెన్‌, అగ్రి వర్సిటీ రిజిస్ట్రార్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌లు దీనిపై సంతకం చేశారు. ఈ సంస్థ అగ్రి వర్సిటీలో ఎకరం స్థలంలో ప్లాంటు ఏర్పాటుచేసి.. రెండేళ్లపాటు ఉత్పత్తి, ప్లాంటు నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది. ప్రస్తుతం మన దేశంలో జీవ ఎరువుల తయారీకి ఆరు నుంచి ఏడు రోజుల సమయం పడుతోంది. కొన్ని వ్యర్థాలను మాత్రమే దీనికి వినియోగిస్తున్నారు. బయోవే సంస్థ మాత్రం తమ దేశంలో లభించే వరి, మక్క, ఇతర ఆహార, ఉద్యాన పంటల వ్యర్థాలు, మాంసం వ్యర్థాలు, కుళ్లిపోయిన కూరగాయలు, పండ్లు, గుర్రపుడెక్కతోపాటు ఆహార పదార్థాల వ్యర్థాలను మర ఆడించి ఆ మిశ్రమంలో వాల్కనో నుంచి ఉద్భవించిన బ్యాక్టీరియాను కలిపి ఆరు గంటల్లోనే జీవ ఎరువులను తయారు చేస్తోంది. పది డాలర్ల విలువైన 35 కిలోల ఎరువుల బస్తాను ప్రస్తుతం ఎకరం పొలంలో వాడుతుండగా అది సత్ఫలితాలను ఇస్తోంది. అధిక దిగుబడితోపాటు ఆరోగ్యకరమైన పంటలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ ఎరువుల సాయంతో మేలిమి రకం వరిసాగులో వియత్నాం అగ్రస్థానంలో నిలుస్తోంది.

Read More