తొలివిడతగా 12,500 టన్నులతో రేపు బయల్దేరనున్న నౌక
కాకినాడ పోర్టుకు మంత్రి ఉత్తమ్‌ వెళ్లే అవకాశం

ఫిలిప్పీన్స్‌కు 8 లక్షల టన్నుల తెలంగాణ బియ్యం ఎగుమతి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా అందులో తొలి విడతగా దాదాపు 12,500 టన్నులు కాకినాడ పోర్టుకు చేరింది. నౌకలో లోడింగ్‌ చేస్తున్నారు. ఫిలిప్పీన్స్‌కు వెళ్లే నౌక ప్రయాణం గురువారం ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ నౌక ప్రయాణాన్ని పౌరస రఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించే అవకాశం ఉంది. ‘ఎంటీయూ 1010’ రకం ముడి బియ్యాన్ని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఎగుమతి చేస్తోంది. బియ్యం అక్కడకు చేరిన 60 రోజుల్లోగా డబ్బులు చెల్లించాలని ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. కొద్దినెలల క్రితం హైదరాబాద్‌లో జరిగిన సదస్సుకు వచ్చిన ఫిలిప్పీన్స్‌ అధికారులు ఇక్కడి బియ్యం నాణ్యతను పరిశీలించారు. నచ్చడంతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌తో చర్చించి ఒప్పందం కుదుర్చుకున్నారు. మరో రెండు దేశాలకు కూడా బియ్యం ఎగుమతిపై పౌరసరఫరాల సంస్థ దృష్టి పెట్టింది. డీఎస్‌ చౌహాన్‌ ఇప్పటికే సంప్రదింపులు మొదలు పెట్టారు. ఆ ప్రక్రియ త్వరలో కొలిక్కి రానుందని సమాచారం. ఆ దేశాల పేర్లను పౌరసరఫరాలశాఖ వెల్లడించడం లేదు.