చిన్న, సన్నకారు రైతుల్లో పౌష్టికాహారలోపం
వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు
తెలంగాణలోని చిన్న, సన్నకారు రైతులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తెలిపారు. విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘మానసిక పోషకాహార నాణ్యతలు, వ్యక్తి వికాసంపై ప్రభావం’ అనే అంశంపై సోమవారం సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ప్రణాళిక విభాగం డైరెక్టర్ శశికళ, రిజిస్ట్రార్ విద్యాసాగర్, కమ్యూనిటీ సైన్స్ డీన్ విజయలక్ష్మి తదితరులు ప్రసంగించారు. రాష్ట్రంలోని రైతుల్లో 68 శాతం మంది చిన్న, సన్నకారు రైతులేనని, పంటలను పండిస్తూ వారు సొంత ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారని తెలిపారు. అధిక పురుగుమందుల వినియోగం వల్ల పంట సారం దెబ్బతింటోందని, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

