ప్రకృతి వ్యవసాయ విధానాలపై అవగాహన
ప్రకృతి వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీష సంబంధిత అధికారులకు సూచించారు. పర్యావరణానికి మేలు చేయడంతో పాటు, ఆరోగ్యకర జీవనానికి ఉపకరించే స్వచ్ఛమైన పంట ఉత్పత్తులు ప్రకృతి వ్యవసాయం ద్వారా లభిస్తాయన్నారు. ఈ క్రమంలో ప్రకృతి సాగు విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. పత్తి తదితరాల్లో అంతర పంటల సాగు వంటివి చేపట్టి, తక్కువ పెట్టుబడితో… రైతులకు అధిక ఆదాయం లభించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని కలెక్టరేట్లో వ్యవసాయ, ఉద్యాన, సూక్ష్మ సేద్య విభాగాల అధికారులతో బుధవారం సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ… వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పొలం పిలుస్తోంది కార్యక్రమాలను ప్రతి మంగళ, బుధవారాల్లో నిర్వహించాలని అదేశించారు. రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) సిబ్బంది, గ్రామ వ్యవసాయ సహాయకులు క్షేత్ర స్థాయిలో కీలకంగా వ్యవహరించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలన్నారు. వ్యవసాయం, రైతుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని కోరారు. మామిడి, మిర్చి, పామాయిలు తదితర పంటల సాగు, విస్తీర్ణంపై ఆయా శాఖల అధికారులు కలెక్టర్కు నివేదించారు. డీఏవో డి.ఎం.ఎఫ్. విజయకుమారి, ఉద్యానశాఖ అధికారి పి. బాలాజీ కుమార్, ఏపీఎంఐపీ పీడీ పి.ఎం. సుభానీ తదితరులు పాల్గొన్నారు.

