తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకర్లు మరింత సహకరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మార్కెటింగ్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నాబార్డ్‌ స్టేట్‌ ఫోకస్‌ పేపర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారితో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు అందించాల్సిన అవసరాన్ని బ్యాంకర్ల దృష్టికి తీసుకెళ్లారు. పశుపోషణ, మత్స్యపరిశ్రమ, కృషి ఆధారిత పరిశ్రమలు వంటి రంగాల్లో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, పోషకాహార భద్రతను మెరుగుపరచడం కోసం చిరుధాన్యాల సాగు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల అన్నారు. చిరుధాన్యాల ఉత్పత్తి, ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు, నాబార్డ్‌ తెలంగాణ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ బి. ఉదయ భాస్కర్‌ , ప్రతినిధులు, బ్యాంకింగ్‌ రంగ ప్రముఖులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.