పోలవరం డయాఫ్రం వాల్‌ నిర్మాణం నేడు ప్రారంభం

పోలవరం ప్రాజెక్టులో కీలకమైన కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి కేంద్ర జలసంఘం అనుమతించింది. టీ5 ప్లాస్టిక్‌ కాంక్రీటు సమ్మేళనంతో దీన్ని నిర్మించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు ఆరు మీటర్ల ఎగువన 1396.6 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల మందంతో దీన్ని నిర్మిస్తారు. కనిష్ఠంగా 20 మీటర్లు, గరిష్ఠంగా 90 మీటర్ల లోతు నుంచి ఈ వాల్‌ నిర్మించుకుంటూ రావాలి. ఈ పనులను విదేశీ కంపెనీ బావర్‌ చేపడుతోంది. ఇందుకోసం మూడేసి చొప్పున ట్రెంచి కట్టర్లు, భారీ గ్రేబర్లు, డీశాండింగు యూనిట్ల వంటి యంత్ర పరికరాలను జర్మనీ నుంచి ఇక్కడికి తెప్పించారు. మొత్తం 383 ప్యానెళ్లతో లక్ష క్యూబిక్‌ మీటర్లకు పైగా ప్లాస్టిక్‌ కాంక్రీటు మిశ్రమంతో నిర్మాణం చేపడతారు. డయాఫ్రం వాల్‌ సగం నిర్మించాక ప్రధాన డ్యాం నిర్మాణం మొదలు పెట్టాలని భావిస్తున్నారు.

Read More

2027 నాటికి పోలవరం సాగునీటి ప్రాజక్టు పూర్తి కావాలి : చంద్రబాబు

పోలవరం సాగు నీటి ప్రాజెక్టు పనుల వేగాన్ని పెంచి 2027 జూలై నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థలు, జల వనరుల శాఖ అధికారులకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వెలగపూడి, సచివాలయంలో బుధవారం జల వనరుల శాఖపై మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌, ఈఎన్‌సీ ఎం. వెంకటేశ్వరరావు, చీఫ్‌ ఇంజనీరు నరసింహమూర్తి, మేఘా, బావర్‌ సంస్థల ప్రతినిధులతో ఆయన సమీక్షించారు. 1,396.60 మీటర్ల పొడవైన డయాఫ్రమ్‌వాల్‌ డిజైన్లను ఆప్రై సంస్థ… పోలవరం ప్రాజెక్టు అథారిటీకి, విదేశీ నిపుణుల ప్యానెల్‌కు అందజేసిందని అధికారులు ఆయనకు తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో నిపుణుల ప్యానెల్‌.. డిజైన్లపై వర్క్‌షాపు నిర్వహించి చర్చిస్తుందని, ఆ డిజైన్లను వచ్చే నెల 24 నాటికి ఆమోదిస్తామని వివరించారు. కొత్త వాల్‌కు రూ. 960.34 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర జలసంఘం ఆమోదించిందని, దానిని 2025 జూలై నాటికి పూర్తి చేస్తామని అధికారులతో పాటు కాంట్రాక్టు సంస్థలు వెల్లడించాయి. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పనులను 2025 నవంబరులో ప్రారంభించి 2027 జూలై నాటికి పూర్తి చేస్తామని పేర్కొన్నాయి. భూసేకరణ సహా కీలకమైన పనులన్నీ 2025 జూలై నాటికి పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు.

Read More