వర్షాభావ పరిస్థితులను తట్టుకునే వివిధ పంట రకాలు, ప్రయోజనాలు

పప్పు ధాన్యాలు ` నూనెగింజలు

మినుము :
ఆంధ్ర రాష్ట్రంలో మినుము 9.71 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ, దాదాపు 3.65 లక్షల టన్నుల ఉత్పత్తిని, సగటున ఎకరాకు 376 కిలోల దిగుబడి నిస్తుంది. రాష్ట్రంలో మినుమును తొలకరిలో, రబీలో మరియు వేసవిలో వరి కోతల తర్వాత పండిస్తారు.

మినుము పంటను జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. మినుములో అనువైన రకాలు :

జి.బి.జి-1 : ఈ రకం పంట కాలం 70-75 రోజలు, దిగుబడి 8-9 క్వింటాళ్ళు. ఇది పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. అన్ని కాలాలకు అనువైన రకం ఇది. వ్యవసాయ పరిశోధనా స్థానం, ఘంటశాల, కృష్ణాజిల్లా నుండి లభ్యం అవుతుంది- 9248838628

టి.బి.జి. 104 : పంట కాలం- 70-75 రోజలు, దిగుబడి, 8-9 క్వింటాళ్ళు. పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. ఇది అన్ని కాలాలకు అనువైన రకం. ఇది కృషి విజ్ఞాన కేంద్రం, దర్శి, ప్రకాశం జిల్లా నుండి లభ్యం అవుతుంది – 9989623827.

ఎల్.బి.జి-352: ఈ రకం పంట కాలం 75-80 రోజలు . దిగుబడి 6-7 క్వింటాళ్ళు. వరి మాగాణుల్లో ఆలస్యముగా విత్తుటకు కూడా అనువైన రకం. ఇది కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటశాల, కృష్ణా జిల్లా నుండి లభ్యం అవుతుంది – ఫోన్ నంబర్- 8008201253.

ఎల్.బి.జి`904 మరియు టి.బి.జి-129 రకాలు కెవికె, రెడ్డిపల్లి, అనంతపూరం జిల్లా నుండి లభ్యం అవుతున్నాయి – ఫోన్ నెంబర్ -9989623825

పెసర :
ఆంధ్ర రాష్ట్రంలో పెసర సాగు విస్తీర్ణం 2.59 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ, దాదాపు 0.81 లక్షల టన్నుల ఉత్పత్తిని, సగటున ఎకరాకు 313 కిలోల ఉత్పాదకతనిస్తుంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో తొలకరి పంటగాను, కోస్తా ఆంధ్రలో తొలకరి మరియు రబీ పంటగా పండిస్తారు. రబీ వరి తర్వాత మాగాణి భూముల్లో, వేసవిలో కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతంలో మూడవ పంటగాను పండిస్తున్నారు. నీరు ఆలస్యంగా వచ్చి వరి నాట్లు ఆలస్యంగా పడే ప్రాంతాల్లో వరి కంటే ముందు పెసరను పండించవచ్చు. కంది, ప్రత్తి మరియు పండ్ల తోటలలో అంతర పంటగా కూడా పండించవచ్చు.

ఎల్.జి.జి-574: ఈ రకం పంట కాలం 65-70 రోజులు. దిగుబడి 6 నుండి 7 క్వింటాళ్ళు. ఇది పల్లాకు తెగులును తట్టుకుంటుంది. ఈరకం కెవికె, రెడ్డిపల్లి అనంతపురం నుండి లభిస్తుంది – 9989623825.

డబ్ల్యు.జి.జి.-42: ఇది ఖరీఫ్ పంటకు అనుకూలం, పంట కాలం 55-60 రోజులు. 4-6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. గింజలు లావుగా ఉండి మెరుస్తుంటాయి. ఇవి కెవికె, ఊటుకూరు, వై.యస్.ఆర్. కడప జిల్లాలో లభ్యం అవుతాయి. ఫోన్ నెంబర్:9848809236,

కంది : అనువైన రకాలు ఎల్.ఆర్.జి-52 రకం. వ్యవసాయ పరిశోధనా స్థానం, గరికపాడు, ఎన్.టి.ఆర్. జిల్లా నుండి లభ్యం అవుతుంది. ఫోన్ నెంబర్-9491003499 మరియు టి.ఆర్.జి.-59 మరియు జి.ఆర్.జి-152 రకాలు కెవికె, బనవాసి నుండి అభ్యం అవుతున్నాయి – 8074420092.

వేరుశనగ : పంట కాలం 105-110 రోజులు. ఇందులో కదిరి లేపాక్షి రకం తీవ్ర బెట్ట పరిస్థితులను తట్టుకుని 6-8 క్వింటాళ్ళు దిగుబడి ఇస్తుంది. ఈరకం కెవికె, రెడ్డిపల్లిలో లభ్యం అవుతుంది -9989623825, కదిరి చిత్రావతి కూడా లభ్యం అవుతుంది. కె-6, కదిరి, అమరావతి రకాలు వ్యవసాయ పరిశోధనా స్థానం, కదిరి నుండి లభ్యం అవుతున్నాయి. సంప్రదించవలసిన నంబరు – 9490081470. విశిష్ట రకం వ్యవసాయ పరిశోధనా స్థానం, ఊటుకూరు నుండి లభ్యం ఆవుతుంది. ఫోన్ నెంబర్ – 7981982531.

నువ్వులు : నువ్వులలో YLM-66 రకం,YLM-17 రకం ఖరీఫ్‌కు అనువైనవి. పంటకాలం 75-80 రోజులు, దిగుబడి 5-6 క్వింటాళ్ళు. ఇవి రాయలసీమకి ఆనుకూలం. వ్యవసాయ పరిశోధనా స్థానం, యలమంచిలి, అనకాపల్లి జిల్లా నుండి లభిస్తుంది. ఫోన్ నెంబర్: 9440977352, 9849275470.

ఆముదం : ఆముదం పంట కాలం 90-150 రోజులు, దిగుబడి 6 – 7 క్వింటాళ్ళు. ఇందులో కిరణ్ రకం బెట్టను తట్టుకుంటుంది. బూజు తెగులు తక్కువ. డి.సి.ఎస్-107 మరియు ప్రగతి ఎండు తెగులును తట్టుకుంటుంది. ఐ.సి.హెచ్- 66 ఎండు తెగులు మరియు బెట్టను తట్టుకుంటుంది. ఇవి వ్యవసాయ పరిశోధనా స్థానం అనంతపురం నుండి లభ్యం అవుతున్నాయి. ఫోన్ నెంబర్: 9989210879.

వరితో పోల్చితో చిరుధాన్యాల్లో అధిక పోషక విలువలు ఉన్నాయి. వీటిలో అధిక మాంసకృకృత్తులతో పాటుగా మంచి అమైనో ఆమ్లాలు ఉంటాయి. పిండి పదార్థాలు తక్కువ. పీచు పదార్థం ఎక్కువ ఉండి రాగి, కాల్షియం అధిక మోతాదులలో ఉంటాయి. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం వల్ల ఏర్పడే తీవ్ర కరువు ప్రభావాన్ని తగ్గించడానికి, రైతులు అధిక నీటి అవసరం ఉన్న పంటలను కాక నీటి ఎద్దడిని తట్టుకునే చిరుధాన్యాలను సాగు చేసుకున్నట్లయితే తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడులను సాధించవచ్చు.

జొన్న: ఇది అధిక కరువు నిరోధకత కలిగిన పంట. దీని లోతైన “వేరువ్యవస్థ కారణంగా సుదీర్ఘ వర్షాభావ పరిస్థితులను తట్టుకోగలదు. ముఖ్యంగా చిరుధ్యాల సాగు అధికంగా ఉండే రాయలసీమ జిల్లాల్లో ఒకటైన కడపలో ఇటీవల కాలంలో సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. నల్లరేగడి నేలలుండి కెసి కెనాల్ ఆయకట్టు ప్రాంతాలైన ప్రొద్దుటూరు మరియు పులివెందుల ప్రాంతాలలో NTJ NJ-1 CSV-29 రకాలను సాగు చేయవచ్చు. అలాగే ఇవి ధాన్యం మరియు పశుగ్రాసం రెండింటిని అందిస్తాయి. సజ్జ పంట విషయానికి వస్తే తక్కువ తేమగల నల్లరేగడి నేలలలో ABH-1, CTP-8203 హైబ్రిడ్ రకాలను ఎంచుకోవచ్చు. ఆలస్యమైనా ఖరీఫ్ సీజన్‌లో ఆగష్టు రెండవ వారం నుండి సెప్టెంబర్ మొదటి వారం లోపు వేసుకోవచ్చు. ఎర్రనేలలు అధికంగా ఉన్న జమ్మలమడుగు మండలంలో కొర్రలు(స్వల్పకాలిక రకాలు) సియా`3223 (రేనాడు/గరుడ) లేదా సూర్యనంది వంటి అధిక దిగుబడులు ఇచ్చే రకాలు నాటుకోవచ్చు.

రాగి రకాలు చూసినట్లయితే గౌతమి (PR) వకుళ, చైతన్య మరియు ఇంద్రావతి వర్షాధార పరిస్థితులకు అనుకూలం. ఈ రకాలు బ్లాస్ట్ తెగులు మరియు తేమ ఒత్తిడిని అధికంగా తట్టుకుంటాయి. పంట ఏది వేసినా విత్తనశుద్ధి తప్పకుండా చేయాలి. సాళ్ళలో నాటడం వలన అప్పుడప్పుడు పడిన వర్షం బొట్టును కూడా ఒడిసి పట్టుకుని పంట నిలబడుతుంది. అలాగే అంతర పంటల సాగుకు కూడా అనుకూలం. కొర్ర లేదా జొన్నను కంది తో కలిపి 4:1 లేదా 5:1 నిష్పత్తిలో అంతర పంటగా వేసుకోవచ్చు. విత్తనం కొరకు భారత చిరుధ్యాల పరిశోధనా సంస్థ, రాజేంద్రనగర్, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు.ఫోన్ నంబరు : 040 – 24599300.

నీటి ఎద్దడిని తట్టుకునే పశుగ్రాస రకాలు
నీటి ఎద్దడిని (Drought) తట్టుకుని, తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పశుగ్రాస రకాలు పాడి రైతులకు ఎంతో మేలు చేస్తాయి. అనంతపురం, వై ఎస్ ఆర్ కడప జిల్లాల పరిసర ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులను తట్టుకునేందుకు ఈ క్రింది రకాల పశుగ్రాసాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి:

ధాన్యపు జాతి పశుగ్రాసాలు:

జొన్న గడ్డి రకాలు :
ఏకవార్షికాలు – పి.సి -9, ఎం.పి. చారి, పంత్ చారి-5,7, సి.ఎస్.వి. -30F,
32F,

బహు వార్షికాలు – ఎస్. ఎస్. జి 59 -3 , పూస చారి – 6, 23, సి.ఎస్.వి. -33 COFS 29 (కోఎస్ఎస్ 29) COFS 31 (కోఎస్ఎస్ 31). బహుళ కోతలు (మల్టీ కట్) జొన్న రకాలు. కరవును తట్టుకుని, వర్షాలు పడగానే మళ్లీ చిగురిస్తుంది.

సోర్గమ్ -సూడాన్ గడ్డి (SSG): ఇది జొన్న మరియు గడ్డి జాతుల సంకరం. ఇందులో కాండం మందంగా ఉండి రసం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఉష్ణోగ్రతలను సైతం తట్టుకుని పెరుగుతుంది
సజ్జ గడ్డి రకాలు : జైంట్ బాజ్ర , ఎస్ – 530, జె-55 , కె – 533

కాయజాతి (లెగ్యూమ్) పశుగ్రాసాలు:
హెడ్జ్ లూసర్న్ (దశరథ గడ్డి): ఇది బహువార్షిక (3-4 ఏళ్లు వచ్చే) పశుగ్రాసం. ఇందులో ప్రోటీన్లు ఎక్కువ. నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది.

అలసందలు / బొబ్బర్లు: వర్షాభావ పరిస్థితుల్లో స్వల్పకాలికంగా పండించడానికి ఇది అనువైన పశుగ్రాసం.
స్టైలో హేమాటా – ఇది నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. దీనిని వర్షాధారంగా సారవంతం కాని భూముల్లో సాగుచేయవచ్చు. భూసారాన్ని పెంచుతుంది. మిశ్రమ పంట లాగా తోటల్లో సాగు చేయవచ్చు.

గడ్డి జాతులు:
బాజ్రా నేపియర్ హైబ్రిడ్ : నేపియర్ రకాల వేర్లు లోతుగా చొచ్చుకుపోయి నీటిని గ్రహిస్తాయి కాబట్టి కరవును తట్టుకుంటాయి.

అంజన్ గడ్డి – ఇసుక నేలల్లో కూడా సాగు చేయవచ్చు. తోటల్లో మిశ్రమ పంటగా సాగు చేసుకోవచ్చు
గిన్ని గడ్డి – ఇది నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. నీటి కొరత ఉన్న ప్రాంతాలలో బాగా అనువైన రకం.

చెట్ల మేత:
సుబాబుల్ మరియు అవిశ: నీరు లేని సమయాల్లో వీటి కొమ్మలు, ఆకులను పశువులకు మేతగా వేయవచ్చు.

విత్తనాలు లభ్యత :
పశుగ్రాస విత్తనాలను ఆంధ్రప్రదేశ్ లోని పశువైద్య విశ్వ విద్యాలయ పరిధిలోని పరిశోధన కేంద్రాలు, ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణ కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు లేదా వ్యవసాయ సంభందిత ఆన్లైన్ ప్లాట్ ఫారముల ద్వారా పొందవచ్చు.

రైతుల సమాచారం కోసం కెవికె శాస్త్రవేత్తలచే రూపొందించబడినది. సంప్రదించవలసిన చిరునామా, కెవికె, ఒనిపెంట`9398982828, 7032463875, 8121136184

డా. శ్రీవిద్య రాణి.ఎన్, శాస్త్రవేత్త, విస్తరణ విభాగం , డా.బి.ఎస్.కాంతి శ్రీ, శాస్త్రవేత్త, గృహవిజ్ఞాన విభాగం, డా. టి.విజయ నిర్మల, శాస్త్రవేత్త, పశుపోషణ విభాగం. Ph: 93989 82828

Read More

ఎల్ నినో పరిస్థితుల్లో రైతు ఆదాయ స్థిరత్వానికి వ్యూహాలు: అనుకూల పంటల ఎంపిక మరియు వ్యవసాయ రికార్డుల నిర్వహణ

భారతదేశ జనాభాలో సుమారు 68.84 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, మొత్తం శ్రామిక శక్తిలో 54.6 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. తెలంగాణలో కూడా సుమారు 61.12 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, దాదాపు 55 శాతం మంది వ్యవసాయ రంగంతో అనుసంధానమై ఉన్నారు. వ్యవసాయ గణాంకాల ప్రకారం భారతదేశంలో 86 శాతం కంటే ఎక్కువ వ్యవసాయ కమతాలు చిన్న మరియు సన్నకారు వర్గాలకు చెందుతాయి.

తెలంగాణ వ్యవసాయం నీటిపారుదల మరియు వర్షాధార వ్యవసాయ వ్యవస్థల సమ్మేళనంగా ఉండి, వర్షపాతం వ్యవసాయాభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇటీవలి సంవత్సరాల్లో సాగునీటి వసతులు పెరిగినప్పటికీ, వాతావరణ మార్పులు రైతుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు తీసుకునే ప్రతి పంట నిర్ణయం కుటుంబ ఆదాయంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా వర్షపాతం అస్థిరంగా ఉండే సంవత్సరాలలో పంటల ఎంపిక మరింత కీలకంగా మారుతుంది. ఎల్నినో (Elnino) వంటి వాతావరణ పరిస్థితులు వర్షపాతాన్ని ప్రభావితం చేసి వ్యవసాయ ఉత్పత్తిపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం ఎల్నినో ప్రభావం ఉన్న సంవత్సరాలలో సాధారణంగా రుతుపవనాల బలహీనత, సగటు కంటే తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. 2025-26 సంవత్సరానికి కూడా వాతావరణ పరిస్థితులపై ఎల్నినో ప్రభావం కొనసాగే అవకాశాలపై వివిధ వాతావరణ సంస్థలు సూచనలు చేస్తున్నాయి.

తెలంగాణలోని ప్రధాన పంటలు మరియు వాటిపై ఎల్ నినో ప్రభావం
వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం తెలంగాణలో 2025 వానాకాలంలో తెలంగాణ రాష్ట్ర మొత్తం పంటల సాగు విస్తీర్ణంలో వరి పంట 50.57 శాతం వాటాతో ప్రథమ స్థానంలో నిలవగా, రెండవ స్థానంలో పత్తి 34.52 శాతం విస్తీర్ణాన్ని ఆక్రమించింది. ఈ గణాంకాలు రాష్ట్ర వానాకాల పంటల సరళిలో వరి మరియు పత్తి పంటల ప్రాబల్యాన్ని సూచిస్తున్నాయి. అయితే ఎల్నినో వంటి వాతావరణ అనిశ్చిత పరిస్థితులు ఎదురైనప్పుడు కేవలం సంప్రదాయ పద్ధతిలో వరి సాగుపైనే ఆధారపడకుండా, నీటి లభ్యత తక్కువగా అవసరం ఉన్న కందులు, పెసర వంటి పప్పుధాన్యాలు లేదా స్థానిక పరిస్థితులకు అనుకూలమైన ప్రత్యామ్నాయ పంటలను కూడా పరిగణనలోకి తీసుకోవడం అవసరం.

డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రచురించిన గణాంకాల ప్రకారం, ఎల్నినో ప్రభావం ఉన్న సంవత్సరాలలో (2014-15 మరియు 2015-16) తెలంగాణలో ప్రధాన పంటల నికర ఆదాయంలో గణనీయమైన మార్పులు నమోదయ్యాయి.

2015-16 తీవ్రమైన ఎల్ నినోలో పరిస్థితి మరింత తీవ్రంగా కనిపించింది. వరి (-14007.72), మొక్కజొన్న – 11373.53), పత్తి (-10908.38), కందులు (-9818.09), పెసర (-5207.97) పంటలన్నింటిలోనూ నికర ఆదాయాలు గణనీయంగా తగ్గాయి. ఇది తీవ్రమైన వర్షాభావ పరిస్థితులలో పంటలు ఎంతగా దెబ్బతింటాయో సూచిస్తుంది. అదే విధంగా తక్కువ నీటి అవసరం ఉన్న పంటలు వర్షాభావాన్ని తట్టుకొని రైతులకు నష్టాలను తగ్గించే అవకాశాన్ని కల్పించాయి. దీనినిబట్టి ఎల్నినో ప్రభావం ఉన్న సంవత్సరాలలో అన్ని పంటలు ఒకే విధంగా ప్రభావితమవలేదని గమనించవచ్చు. కొన్ని సంవత్సరాలలో వరి అత్యధిక నష్టాలను చవిచూడగా, కొన్ని ప్రత్యామ్నాయ పంటలు లాభాలను మరియు తక్కువ నష్టాలను నమోదు చేశాయి.

అదేవిధంగా పంటల ఎంపికలో కూడా ఒకే సూత్రం అందరికీ వర్తించదు. రైతు నేల స్వభావం, నీటి వనరులు, గత అనుభవం, మార్కెట్ పరిస్థితులు మరియు కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయాన్ని శాస్త్రీయంగా తీసుకోవడానికి వ్యవసాయ రికార్డులు ఎంతో ఉపయోగపడతాయి. గత సంవత్సరాలలో ఏ పంటకు ఎంత ఖర్చు అయింది, ఎంత దిగుబడి వచ్చింది, ఎంత ఆదాయం లభించింది, వర్షాభావ పరిస్థితుల్లో ఏ పంట మెరుగ్గా నిలిచింది వంటి వివరాలు రికార్డుల ద్వారా స్పష్టంగా తెలుస్తాయి.

దీనికోసం రైతు పొలంలో జరిగే వివిధ కార్యకలాపాలకు వేర్వేరు రికార్డులు అవసరం. రైతు నిర్వహించుకోదలచిన ముఖ్యమైన రికార్డు రకాలు ఇవి:

  1. వ్యవసాయ దినచర్య రికార్డు
  2. పంటల వారీ ఖర్చు-ఆదాయ రికార్డు
  3. ఎరువుల వినియోగ రికార్డు
  4. పురుగుమందుల వినియోగ రికార్డు
  5. కార్మికుల వినియోగ రికార్డు
  6. యంత్రాల వినియోగ రికార్డు
  7. నీటి వినియోగ రికార్డు
  8. దిగుబడి రికార్డు
  9. పశుసంవర్ధక రికార్డు
  10. నిల్వ మరియు విక్రయాల రికార్డు

ప్రస్తుతం తెలంగాణలోని అభ్యుదయ రైతులు కొంతమంది ప్రధానంగా కాగితపు రికార్డుల ద్వారానే వ్యవసాయ సమాచారాన్ని నమోదు చేసి భద్రపరుస్తున్నారు. అయితే, కాలానుగుణంగా అందుబాటులోకి వచ్చిన వివిధ ఆధునిక పద్ధతులను కూడా వినియోగించి వ్యవసాయ రికార్డులను మరింత సమర్థవంతంగా భద్రపరచుకోవచ్చు. వీటిలో సంప్రదాయ కాగితపు పద్ధతులతో పాటు డిజిటల్ రికార్డు పద్ధతులు, స్మార్ట్ఫోన్ ఆధారిత పద్ధతులు మరియు ప్రభుత్వ డిజిటల్ వేదికలు ముఖ్యమైనవి. ఈ పద్ధతుల వివరాలు క్రింది చిత్రంలో చూపించబడ్డాయి.

వివిధ వ్యవసాయ రికార్డుల పద్ధతులు
ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల్లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటి అవసరం గల అనుకూల పంటలను ఎంపిక చేసి సాగు చేయడం రైతుల ఆదాయ స్థిరత్వాన్ని పెంపొందించడంతో పాటు వాతావరణ మార్పులు మరియు వర్షాభావ పరిస్థితుల ప్రభావాలను తగ్గించడంలో ముఖ్యమైన వ్యూహంగా నిలుస్తుంది. అదే సమయంలో, పంటల ఎంపిక, ఖర్చులు, దిగుబడులు, ఆదాయం మరియు వనరుల వినియోగానికి సంబంధించిన వ్యవసాయ రికార్డులను క్రమం తప్పకుండా నమోదు చేసి భద్రపరచడం ద్వారా రైతులు గత అనుభవాలను విశ్లేషించి భవిష్యత్ సాగు నిర్ణయాలను మరింత శాస్త్రీయంగా మరియు సమర్థవంతంగా తీసుకునే అవకాశం కలుగుతుంది. అందువల్ల, అనుకూల పంటల సాగుతో పాటు సమగ్ర వ్యవసాయ రికార్డుల నిర్వహణ కూడా వాతావరణ అనిశ్చితులను ఎదుర్కొంటూ స్థిరమైన మరియు లాభదాయకమైన వ్యవసాయాభివృద్ధికి కీలకమైన అంశంగా పరిగణించబడుతుంది.

డా. డి. ఎ. రజిని దేవి, సహాయ ప్రొఫెసర్, వ్యవసాయ ఆర్థిక శాస్త్ర విభాగం, వ్యవసాయ కళాశాల,రాజేంద్రనగర్
డా. కె. శేఖర్, సహాయ ప్రొఫెసర్, సేద్య విభాగం, వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్, ఫోన్: 9032128184

Read More

పచ్చిరొట్ట ఎరువులు – ప్రాముఖ్యత

పంటలకు అవసరమయ్యే పోషకాలు సేంద్రియ రూపంలో సమర్ధవంతంగా అందించాలంటే పచ్చిరొట్టను బాగా అందించే పంటలను అదే మడిలో ముందే వేసుకోవాలి. తక్కువ వనరులతో బాగా పెరిగే పంటలను సుమారు 2 నెలల ముందే మడిలో విత్తుకోవాలి, ఆ పంట పూతకువచ్చే సమయంలో భూమిలో కలియదున్నాలి. ఈ పంట భాగాలు నేలలోని తేమ సరిపడినంత ఉన్నప్పుడు త్వరగా కుళ్ళిపోతాయి. దున్నిన 2-3 వారాలకు బాగా కుళ్ళటం వల్ల విడుదలయిన పోషకాలు అప్పుడు మడిలో విత్తిన ముఖ్యపంటకు అందుతాయి. ఉదా: జనుము, పెసర, మినుము, బఠాణి, ఉలవలు.

దబోల్కర్ పద్ధతి
భూసారం పెంచుకోవటానికి మన ప్రక్క రాష్ట్రమైన మహారాష్ట్రకి చెందిన శ్రీపాద దబోల్కర్ అనే శాస్త్రవేత్త కొన్ని సూచనలు చేశారు.
ధాన్యపు గింజలు : 5 కేజీలు (మొక్కజొన్న, జొన్న, సజ్ౙ, తైదలు, రాగులు మొ….)
పప్పు గింజలు : 5 కేజీలు (మినుములు, పెసలు, శనగలు, కంది, అలసంద మొ….)
నూనె గింజలు : 5 కేజీలు (నువ్వులు, వేరుశనగ, ఆముదం, ప్రొద్దుతిరుగుడు, కుసుమ, మొ…)
సుగంధ ద్రవ్యములు : 50 గ్రాములు (ఆవాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర మొ…)
పచ్చిరొట్ట పంట విత్తనాలు : 5 కేజీలు (జనుము, జీలుగ, అవిశ, పిల్లిపెసర మొ॥)

దుక్కి దున్ని మండలాగిన తరువాత ఈ విత్తనాలన్నీ కలగలిపి ఎకరానికి 20-25 కిలోలను చల్లుకోవాలి. 45 రోజుల వరకు పెరగనిచ్చి భూమిలో కలియదున్నాలి.

ఇలా చేయడం వల్ల పంటకాలం నష్టపోతామని భావించినట్లయితే రైతులు తమ పొలాన్ని కొన్ని భాగాలుగా విభజించుకొని, ఏటా ఒక భాగంలో ఈ పద్ధతి పాటిస్తూ కొద్ది సంవత్సరాలలో మొత్తం పొలాన్ని సారవంతంగా చేసుకోవచ్చు.

పచ్చి ఆకు ఎరువులు
పచ్చిరొట్ట పంట వేసుకోవటం కుదరని పరిస్థితుల్లో దగ్గరలో ఉన్న చెట్ల ఆకులను, లేత కొమ్మలను తీసుకువచ్చి పొలంలో కలుపుకోవచ్చు. ఇది పచ్చి ఆకుల ద్వారా నేలకు ఎరువులు అందించే పద్ధతి.
పచ్చి ఆకు ఎరువుగా ఉపయోగపడే మొక్కలు గ్లైరిసీడియా, కానుగ, మోదుగ, సీతాఫలం, వెంపలి. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గట్ల మీద ఈ మొక్కలను నాటుకుంటే సాగు భూమికి ఎరువు అవసరాలు సులువుగా అందించవచ్చు.

వరిపొలాలలో వేసుకునేందుకు అనువైన పప్పుధాన్యాలు – పెసర, అలసంద, శనగ, సోయాచిక్కుడు, వేరుశనగ, కంది.

వరి పొలాలలో అనువైన పశుగ్రాస పంటలు – సిరట్రో, క్లైటోరియా, టెస్మాంథస్, జనుము, చిక్కుడు. వరి పొలాలలో సాగుకు అనువైన పచ్చిరొట్టనిచ్చే పంటలు – జీలుగ, జనుము.

Read More