పశువుల సంతానోత్పత్తిలో పిండమార్పిడి ప్రక్రియ, ప్రయోజనాలు
భారతదేశంలో విస్తారంగా ఉన్న పశుసంపద ఒక ముఖ్యమైన జీవనోపాధి, ఇతర ఆదాయాలకు అనుబంధంగా, ఉపాధి అవకాశాలను అందిస్తుంది. పాడిపశువులు గ్రామీణ ప్రజల సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. గడిచిన 30-40 సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు మన దేశవాళీ ఆవుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది, దీనికి ముఖ్య కారణం వీటి యొక్క తక్కువ పాల ఉత్పాదక శక్తి. పాలలోని మాంసకృత్తుల పైన జరిపిన పరిశోధనల ఆధారంగా పాలను ఏ1 మరియు ఏ2 పాలుగా విభజించడం జరిగినది. వీటిలో ఏ2 పాలు ఏ1 పాలకంటే మెరుగైనవని తేలింది. మనదేశీయ ఆవుల పాలు ఏ2 రకం కిందకు వస్తాయి అదే విదేశీ ఆవుల పాలు ఏ1 క్రింద పరిగణించబడతాయి. ఏ2 పాలను నగరంలో ఎక్కువ ధరకు అమ్మి రైతులు లాభాన్ని పొదుతున్నారు. అంతేకాక దేవవాళీ పశువులలో వేడిని తట్టుకునే శక్తి మరియు తీవ్రమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాయి. వ్యాధినిరోధక శక్తి మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితులు తట్టుకునే శక్తి వలన, వీటిని వేరే దేశాలకు ఎగుమతి చేయడం జరుగుతోంది. పాలు, ఆవు పేడ (సేంద్రియ ఎరువు), ఆవు మూత్రం (ఔషధ విలువలు), పెరుగు మరియు నెయ్యి మొదలగు వాటి సరఫరా ద్వారా దేశీయ పశువులు జాతీయ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ జనాభా యొక్క అవసరాలకు అనుగుణంగా జంతు ఉత్పత్తులకు గిరాకీ అనేక రెట్లు పెరిగింది. దీని మూలంగా, పశువుల ఉత్పాదక శక్తి నాటకీయంగా రూపాంతరం చెంది తద్వారా వాటి యొక్క సామర్థ్యం మరియు ఉత్పాదకత మెరుగుపడబడుతోంది.
గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతోన్న వివిధ పరిశోధనల మూలంగా సాంకేతికతను అందిపుచ్చుకొని మనం ముందుకు వెళ్తున్నాము. వీటి ద్వారా పశువుల ఉత్పాదకతలో గణనీయమైన అభివృద్ధి సాధించబడుతోంది. పిండ బదిలీ అనేది మేలు జాతి ఆవు నుండి పిండాన్ని సేకరించి, గర్భధారణ కాలాన్ని పూర్తి చేయడానికి మరొక ఆవులోకి బదిలీ చేసే ప్రక్రియ. ఈ పద్ధతిని జన్యుపరంగా విలువైన ఆడ పశువుల ఉత్పత్తి అభివృద్ధికి, వ్యాధులను అరికట్టుటకు, ప్రణాళికాబద్ధమైన సంయోగం, వ్యవసాయ ఆదాయాన్ని పెంచడానికి మొదలగు వాటికి చాలా విరివిగా వినియోగిస్తున్నారు. అల్ప పునరుత్పత్తి రేట్లు మరియు ఈతకు ఈతకు మధ్య ఎక్కువ కాలం ఉన్నటువంటి పశువులలో ఈ పిండమార్పిడి ప్రక్రియ పశువులకు చాలా ఉపయోగపడుతుంది.

చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఈ ప్రక్రియ అంత విస్తృతంగా వాడుకలో లేదు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ ప్రక్రియ కొరకు ఉండవలసిన సాంకేతిక నైపుణ్యాలు లేకపోవుట మరియు అధిక వ్యయ కారణాల చేత ఈ ప్రక్రియ అంతగా ప్రాచుర్యం పొందలేదు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ సాంకేతిక వాణిజ్యపరంగా అందుబాటులో లేనప్పటికీ, పిండమార్పిడి సాంకేతికత చిన్న జాతుల సంరక్షణ మరియు అభివృద్ధి అవకాశాలను అందిస్తుంది.
సాధారణంగా ఒక ఆవు తన జీవిత కాలంలో సహజ పద్ధతిలోనైనా లేదా కృత్రిమ గర్భోత్పత్తి విధానాన్ని ఉపయోగించినా 8 నుంచి 10 దూడలకు జన్మనిస్తుంది. కానీ పిండ మార్పిడి ప్రక్రియ ద్వారా ఒక మేలుజాతి ఆవు నుంచి 50-100 పిండాలను అభివృద్ధి చేసి, 30-40 దూడలను పొందవచ్చు. ఈ ప్రక్రియ ద్వారా తక్కువ సమయంలోనే మంచి జాతి పశువులను అధిక సంఖ్యలో ఉత్పత్తి చేయవచ్చు. ఈ విధానాన్ని ఒంగోలు, గిర్, పుంగనూరు మరియు సాహివాల్ వంటి దేశీయ పశుజాతులని అభివృద్ధి పరిచేందుకు మన రాష్ట్రంలో అనుసరిపస్తున్నారు,
పిండోత్పత్తి మరియు పిండ మార్పిడి
ఒక మేలు జాతి ఎద్దు వీర్యాన్ని ఒక మేలు జాతి ఆవు గర్భంలో ప్రవేశపెట్టి పిండాలను సేకరించి మరొక ఆవు గర్భంలోకి ప్రవేశపెడతారు. మేలు జాతి ఆవులను ముఖ్యంగా వాటి యొక్క పాల ఉత్పత్తిని బట్టి ఎంపిక చేస్తారు. ఆవుల నుండి దూడలకు సంక్రమించే అవలక్షణాలు కలిగివుండనివి, ఎటువంటి రోగాలు లేనివి, నిర్ణీత సమయానికి ఎదకు వచ్చేవి మరియు జన్యు పరంగా లోపాలు లేని పశువులను ఎంపిక చేస్తారు.

పై ప్రక్రియలో లింగ నిర్ధారిత వీర్యాన్ని కూడా ఉపయోగించవచ్చు. అభివృద్ధి చెందిన పిండాన్ని తక్కువ పాలు ఇచ్చే ఆవుల గర్భంలో ప్రవేశపెడతారు. ఈ రకంగా తక్కువ పాలు ఇచ్చే ఆవుల గర్భంలో ఎక్కువ పాలు ఇచ్చే మేలు రకం దూడను పొందవచ్చు. దీని ద్వారా పుట్టే దూడలకు పూర్తిగా ఏ ఆవు నుంచి అండాలను సేకరించామో ఆ ఆవు యొక్క లక్షణాలు వస్తాయి. మామూలుగా ఒక సంవత్సరంలో లింగ నిర్ధారిత వీర్యం వాడినా లేదా ఎద్దుతో దాటించినా ఒక దూడ మాత్రమే జన్మిస్తుంది. కానీ ఈ ప్రక్రియలో 100 పిండాలను తయారు చేయగలిగి, వాటిని తక్కువ పాల ఉత్పత్తి కలిగిన ఆవుల గర్భంలో ప్రవేశపెడితే 40 దూడల వరకు పొందవచ్చు. పై పద్ధతిలో వచ్చిన పిండాలను తగిన ఆవులు అందుబాటులో ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు బదిలీ చేయవచ్చు. ఒకవేళ ఆవులు అందుబాటులో లేకపోతే వాటిని ద్రవ నత్రజనిలో నిలువ చేసి మరల ఎప్పుడయినా బదిలీ చేయవచ్చు.
పిండ మార్పిడి వలన ఉపయోగాలు
ఈ పద్ధతి ద్వారా తక్కువ సమయంలో జన్యుపరంగా మేలు జాతి దూడలను పొందవచ్చు. మేలు జాతి ఆవులను అభివృద్ధి చేసి తద్వారా పాల ఉత్పత్తిని పెంచవచ్చు. పాల ఉత్పత్తిని బట్టి మేలు జాతి ఆవులను ఎంపిక చేసి వాటిలో పిండ మార్పిడి ప్రక్రియ ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ దూడలను పొందవచ్చు. వాటి నుండి వచ్చిన దూడలు ఎక్కువ పాలను ఇచ్చే గుణాలను కలిగి ఉంటాయి.
కృత్రిమ గర్భధారణ చేసినప్పుడు 50 శాతం ఆడ దూడలు లేదా 50 శాతం మగ దూడలు జన్మించే అవకాశం ఉంటుంది. మగ దూడలను పెంచడం వలన రైతులకు వ్యయప్రయాస మరియు ఆర్థికంగా నష్టపోతారు. పిండమార్పిడి ప్రక్రియకు లింగ నిర్ధారిత వీర్యాన్ని జోడిస్తే 90 శాతం ఆడ దూడలను పొందవచ్చు, మరియు వాటి సంతతిని గణనీయంగా పెంచడం వలన రైతుకు లాభదాయకంగా ఉంటుంది.
కొన్నిరకాల అవలక్షణములు అనగా అండాశయ తిత్తులు, మెయ్య మొదలగునవి తల్లి నుండి దూడలకు జన్యుపరంగా సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పిండ మార్పిడి పద్ధతిలో మేలు రకమైన పశువులను ఎంపిక చేయుట వలన ఇలాంటి అసాధారణతలను అధిగమించవచ్చు.
దేశీయ గోజాతులు ఎన్నో ఉపయోగకరమైన లక్షణాలను కలిగిఉన్నప్పటికీ, విదేశీ ఆవులతో పోల్చితే తక్కువ పాల ఉత్పత్తి ఇవ్వడం వలన వీటి సంతతి అభివృద్ధి సరియైన రీతిలో జరగనందున, వాటిని కోల్పోయే స్థితిలో ఉన్నాము. పుంగనూరు, సాహివాల్ మరియు రెడ్ సింధీ మొదలగు జాతి ఆవుల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతున్నది. కనుమరుగవుతున్న ఈ జాతులను మనం ఈ పిండ మార్పిడి ప్రక్రియ ద్వారా వాటి యొక్క సంఖ్యను వేగంగా పెంచగలము. ఒక ఆవు కొనుగోలుకు చేసే ఖర్చు కన్నా ఈ పద్ధతిలో దూడ పుట్టడానికి అయ్యే ఖర్చు తక్కువగా ఉంటుంది. పైగా ఈ పద్ధతిలో పుట్టిన దూడలు మేలు జాతి పశువుల నుంచి వచ్చినవి కాబట్టి పుట్టుకతో వచ్చు అసాధారనతలు ఉండవు మరియు ఇవి కావలసిన లక్షణాలను కలిగి ఉంటాయి. వ్యాధినిరోధక శక్తి మరియు పాల దిగుబడి ఎక్కువగా ఉన్న పశువులను పెంచడం వలన రైతులు ఆర్థికంగా లాభపడతారు. దీ
డా. కె. గ్రీష్మారెడ్డి (8309205772), పిహెచ్డి. విద్యార్థిని, మందా శ్రీనివాస్, ప్రొఫెసర్, పశుగర్భకోశ శాస్త్ర, ప్రసూతి విభాగము, ఎన్.టి.ఆర్ విశ్వవిద్యాలయం, గన్నవరం, శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, తిరుపతి.

