చిరుధాన్యాల సాగుకు సవాళ్లేమిటి?
వ్యవసాయ విశ్వవిద్యాయలం అధ్యయనం
పోషకాహారాలైన చిరుధాన్యాల సాగు పెంపుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. రాష్ట్రంలో ఏటా 2.10 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతుండగా.. ఇందులో 6 లక్షల ఎకరాల్లోనే (3%) చిరుధాన్యాలు పండుతున్నాయి. ఉత్పత్తులు 5.3 లక్షల టన్నుల వరకే ఉంటున్నాయి. ఈ క్రమంలో చిరుధాన్యాల సాగు, వినియోగం పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆదేశాలు ఇచ్చింది. దీంతో వర్సిటీ ఆహార, పోషకాల శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెస్సీ, బీఎస్సీ వ్యవసాయ, హోంసైన్స్ విద్యార్థులు సర్వే చేస్తున్నారు. ఈ నెలాఖరుకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.
సమగ్ర సమాచార సేకరణ
ప్రస్తుతం చిరుధాన్యాలు సాగు చేస్తున్న రైతులు, వారి స్థితిగతులు, సాగు విధానాలు, పంటలను ఆశిస్తున్న తెగుళ్లు, దిగుబడులు, మార్కెటింగ్, మద్దతు ధరలు, లాభనష్టాలు, రైతులు ఆశిస్తున్న సహకారం తదితర అంశాలపై సర్వే చేస్తున్నారు. రైతు ఉత్పత్తి సంఘాలు, ప్రభుత్వ శాఖలు, పారిశ్రామిక వేత్తలు, అంకుర వ్యవస్థాపకుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఇతర పంటలను సాగు చేస్తున్న రైతులు చిరుధాన్యాల వైపు ఎందుకు రావడం లేదు? నాబార్డు, రైతు ఉత్పత్తి సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు వారిలో అవగాహన కోసం ఏమైనా చర్యలు చేపడుతున్నాయా అనే కోణంలోనూ సర్వే సాగుతోంది. భారత చిరుధాన్యాల సంస్థ ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన కిసాన్ మేళాకు హాజరైన వివిధ రాష్ట్రాల రైతులు, అంకుర సంస్థల వ్యవస్థాపకులు, రైతు ఉత్పత్తి సంఘాల నుంచి వ్యవసాయ, హోంసైన్స్ కళాశాల విద్యార్థినులు సమాచారం తీసుకున్నారు.

