పశ్చిమాసియాలో యుద్ధం వలన పసుపు ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు తగ్గుతూ క్వింటాకు రూ.4 వేలకు పైగా రైతు నష్టపోతున్నాడు. పసుపు విక్రయాలు అత్యధికంగా జరిగే ఆసియాలోని మార్కెట్లలో నిజామాబాద్ ఒకటి. ఇక్కడి యార్డులో కొనుగోలు చేసే పంటను విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఏటా ఫిబ్రవరి నుంచి పంట మార్కెట్‌కు వస్తుంది. 2024లో రూ.171 కోట్ల విలువైన 1.45 లక్షల టన్నుల పసుపును భారత్ ఎగుమతి చేసింది. ఇందులో నిజామాబాద్‌లో కొనుగోలు చేసే నాణ్యమైన సరకు కూడా ఉంది. ఈ ఏడాది యుద్ధ ప్రభావంతో గల్ఫ్, ఇతర దేశాలకు ఎగుమతులు నిలిచాయి. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల ట్రేడర్లు పంటను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు.