ముద్దచర్మ వ్యాధి నియంత్రణకు టీకా
‘బయోలంపీ వ్యాక్సిన్’ను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ బయోవెట్
ఆవిష్కరించిన ఏపీ సీఎం చంద్రబాబు
ప్రపంచంలోనే తొలి దివా మార్కర్ వ్యాక్సిన్
పాల ఉత్పత్తిని దెబ్బతీస్తూ.. పాడిపశువుల పాలిట మహమ్మారిగా తయారైన ముద్ద చర్మ వ్యాధి (లంపీస్కిన్ డిసీజ్ -ఎల్‌ఎస్‌డీ) నియంత్రణకు టీకా అందుబాటులోకి వచ్చింది. భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ బయోవెట్ తయారు చేసిన ఈ టీకాను బుధవారం విజయవాడలో జరిగిన పశుసంవర్ధక రంగ ఏఐ టెక్ 2.0 సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. లంపీస్కిన్ వ్యాధి నియంత్రణకు టీకాను ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా బయోవెట్ సంస్థ రూపొందించడం సంతోషంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి ఈ టీకా ఎంతో దోహదపడుతుందని ప్రశంసించారు. భారత్ బయోటెక్ సీడీఓ డాక్టర్ రేచస్ ఎల్లను సీఎం చంద్రబాబు అభినందించారు.
అత్యంత సురక్షిత టీకా
బయోవెట్ ఆధ్వర్యంలో రూపొందించిన బయో లంపీ వ్యాక్సిన్ ప్రపంచంలోనే తొలి.. అత్యంత సురక్షితమైన దివా – మార్కర్ వ్యాక్సిన్ అని సంస్థ ప్రతినిధులు సీఎంకు వివరించారు. లంపీ స్కిన్ నిర్ధారణ, నియంత్రణకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. హిస్సార్ లోని ఐసీఏఆర్- ఎన్‌ఆర్‌సి (నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్వైన్స్) అందించిన ఎల్‌ఎస్‌డీ వైరస్/ రాంచీ/ 2019 వ్యాక్సిన్ స్ట్రెయిన్‌తో బయోవెట్ సంస్థ దీన్ని అభివృద్ధి చేసినట్లు వివరించారు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) ఆమోదం లభించినట్లు పేర్కొన్నారు. టీకాల కోసం విదేశాలపై ఆధారపడకుండా మన వ్యాక్సిన్ మన దేశంలోనే అభివృద్ధి చేయాలనే బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, బయోవెట్ వ్యవస్థాపకుడు కృష్ణ ఎల్ల ఆలోచనల నుంచి టీకా రూపొందించినట్లు సంస్థ ప్రతినిధులు వివరించారు.
ఏటా 50 కోట్ల డోసులు
దేశ పశు అవసరాలకు 30 కోట్ల డోసులు అవసరం. బయోవెట్ సంస్థ ఏడాదికి 50 కోట్ల డోసులు ఉత్పత్తి చేయనుంది. మూడు నెలల కంటే ఎక్కువ వయసున్న ఆవులు, గేదెలకు ఏడాదికి ఒక డోసు ఇవ్వాలి. మూడేళ్లపాటు వరుసగా టీకా ఇస్తే.. యూరోపియన్ దేశాల్లో లంపీ వ్యాధి నియంత్రణ అయిందని కంపెనీ ప్రతినిధులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీ ఆర్థిక సంఘం మాజీ వైస్ చైర్మన్ కుటుంబరావు. బయోవెట్ సీఈఓ శ్రీనాథ్, వైస్ ప్రెసిడెంట్ (కమర్షియల్) బాలాజీరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు కిలారి, హెచ్‌ఆర్ హెడ్ అమూల్య తదితరులు పాల్గొన్నారు.
లంపీ స్కిన్‌తో ఏడాదిలో రూ.20,040 కోట్ల నష్టం
- లంపీ స్కిన్ వ్యాధి 2019లో దేశంలో ప్రవేశించింది.
- 2022-23లో తీవ్రంగా వ్యాప్తి చెందడంతో సుమారు 2 లక్షల పశువులు మృతి చెందాయి. పశుసంవర్ధక రంగానికి రూ.20,040 కోట్ల నష్టం వాటిల్లింది.
- లంపీ వ్యాధి సోకిన ఆవులు, పశువుల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. చర్మంపై గడ్డలు ఏర్పడతాయి. దోమలు, పురుగులు వాటిని కుట్టినప్పుడు తీవ్ర రక్తస్రావమవుతుంది.
- పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఎదకు రావు. పునరుత్పాదక సామర్థ్యం తగ్గిపోతుంది. శ్వాస, లాలాజల స్రావాలు మరింత ఎక్కువై.. పశువుల మరణానికి దారితీస్తుంది.


