ఔషధ మొక్క…. గారచెట్టు / ఇంగుడి / రింగ్రి

గారచెట్టు సాధారణంగా వెడల్పులేని ఆకారంలో 10 మీ. ఎత్తు పెరుగుతుంది. కొమ్మలు సుడివలే చుట్టుముట్టి పైకి పోయే పొడవైన, సూటి ఆకుపచ్చ రంగు ముళ్ళు కలిగి వుంటాయి. ముళ్ళ మొదళ్ళ నుండి ముదురు ఆకు పచ్చ రంగు ఆకులు ఏర్పడతాయి. ఒక్కొక్క ఆకు రెండు చిన్న ఆకులు కలిగి వుంటుంది. కాండం కొంచెం నెరిసిన గోధుమ రంగులో చిరిగిన బెరడు కలిగి వుంటుంది. పూగుచ్ఛం కొన్ని పూలగుత్తులను కలిగి వుంటుంది..

సాధారణ నామం : అడవి ఖర్జూర / ముళ్ళచెట్టు శాస్త్రీయ నామం : బలనైటెస్ ఈజిప్టియాకా కుటుంబం: జైగోఫిల్లేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • ఇంగుడి బెరడు, కాయగుజ్జు, గింజలు, గింజల నూనెని ఔషధంగా ఉపయోగిస్తారు. ఇంగుడి తిక్తరసం, లఘుగుణం, ఉష్ణ, కటు, కఫ, వాత హరం గుణాలను కలిగి వుంటుంది.
  • దీనిని లేపనంగా, లోపలికి తీసుకోవడానికి ఉపయోగిస్తారు. లేపనంగా మంటలలో కాలిన శరీరభాగాలకు, గాయాలకు, శిరో రోగాలకు, జుట్టు సమస్యలకు, మానని గాయాలకు, ఎలుక కరిచినపుడు ఉపయోగిస్తారు. కడుపులో నులిపురుగులు, మలబద్ధకం, ఆకలి మందగించడం, పొత్తికడుపునొప్పి, రక్త సంబంధ వ్యాధులు, విపరీతమైన దగ్గు, ఆస్త్మా, బ్రోంకైటిస్, డైసూరియా, ల్యూకోడెర్మా, చర్మ వ్యాధులు, ఎలుకకరిస్తే విష నివారణకు లోపలికి తీసుకోవడానికి ఉపయోగిస్తారు. దీని మోతాదు కషాయం (50-100 మి.లీ.), పొడి (3-6 గ్రా), గింజల నూనె (5-10 చుక్కలు), కాయగుజ్జు (500-1000 మి.గ్రా.) గింజలపొడి (500-1000 మి.గ్రా.)
  • అధిక సపోనిన్స్ కలిగిన కాయగుజ్జు డెంగ్యూ వ్యాధిని వ్యాప్తి చేసే దోమల లార్వాలను చంపుతుంది.

వ్యవసాయరంగంలో …

  • ఇంగుడి ద్రావణం పంట కాలువలలో నత్తల గుంపులు, నిల్వ వుంచిన అలసంద గింజలను నష్టపరిచే పురుగు కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌ని నివారిస్తుంది (రావు, అతని అనుచరులు, 1997, న్వవోగు, అతని అనుచరులు, 2013)
  • ఇంగుడి ద్రావణం నిల్వ ధాన్యంలో ఆశించే కాప్రాబీటల్, ట్రోగోడెర్మా గ్రానేరం ని అరికట్టింది (మొల్మాద;, 2003), ఇంగుడి గింజల హెక్సేన్ ద్రావణం ట్రోగో డెరా గ్రానేరియం మూడవ దశ లార్వాలను సమర్థవంతంగా చంపింది (మొహ్మద్ అండ్ సత్తి, 2013)
  • ఇంగుడి ద్రావణం అతి తక్కువ (10%) మోతాదులో అలసంద గింజల నిల్వ సమయంలో ఆశించే 85% కాల్లనో బ్రూకస్ మాక్యులేటస్ పురుగులను చంపింది (కేబాల, అతని అనుచరులు, 2013)
  • ఇంగుడి గింజల ఎపికార్ప్, మీసోకార్ప్ ద్రావణాలు యాంటిఫీడెంట్ చర్యతో అలసంద గింజల నిల్వ సమయంలో ఆశించే పురుగు కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌ని అరికట్టింది.
  • ఇంగుడి ద్రావణంలో ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, టానిన్స్, సపోనిన్స్, కార్బో హైడ్రేట్స్, టెర్పెనాయిడ్స్ వంటి రసాయనాలున్నాయి (ఉమర్ ముహ్ద్‌గుని, 2016)
  • ఇంగుడి కాయ మీసోకార్ప్ ద్రావణంలో వున్న సపానిన్స్ డెంగ్యూ వాహకం ఈడెస్ ఈజిప్టి దోమ లార్వాలను నాశనం చేశాయి (బిష్ణుచాపగన్ అండ్ జీవ్ వీస్మన్, బెన్‌గురియన్ యూనివర్సిటి, ఇజ్రాయెల్)
  • ఇంగుడి + చింతకాయల ద్రావణాన్ని ఉపయోగించి ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఆస్పర్ౙిల్లస్ పారసైటికస్‌ల విషపూరిత పదార్థాల వల్ల ఆహారం కలుషితమవకుండా కాపాడవచ్చు (ఎల్. నగర్ బి, అతని అనుచరులు, 2013)
  • ఇంగుడి పచ్చి కాయ ద్రావణం పిచికారి చేసిన 3వ రోజు తర్వాత పిండినల్లి ఫెరిస్టా విర్గేటా నివారించబడింది. పిచికారి చేసిన 7వ రోజు పిండి నల్లులు కనిపించలేదు (వబలె, అతని అనుచరులు, 2010).
  • ఇంగుడి ద్రావణం గొర్రెల నాశించే ఈగ ల్యూసిలియా సెరికేటా మూడు దశల లార్వాలను నివారించింది (మొహ్మద్, అతని అనుచరులు, 2016)
  • ఇంగుడి ద్రావణం రైజోక్టోనియా సొలాని శిలీంద్రం పెరుగుదలను గరిష్టంగాను, ఫిథియం అఫానిడెర్మేటం శిలీంద్రాన్ని కనిష్టంగాను అరికట్టింది.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

పండ్లలో చక్కెర శాతం పెంపునకు… పులిసిన పండ్ల రసం ద్రావణం

పులియబెట్టిన పండ్ల రసాల్లో ఉన్న పలురకాల సూక్ష్మజీవుల చర్య వలన ఇవి పంటలలో చక్కెర శాతాన్ని పెంచడానికి దోహదపడతాయి.
కావలసిన పదార్థాలు : బాగా మగ్గిన పండ్లు : 1 కిలో (అరటి, మామిడి, బొప్పాయి, మొ॥); బెల్లం : 1 కిలో.

తయారు చేసే పద్ధతి

  • ఒక కిలో బాగా మగ్గిన పండ్లను బాగా ముద్దగా చేసి దానికి ఒక కిలో మెత్తగా చేసిన బెల్లాన్ని కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని ఒక కుండలో పోయాలి.
  • కుండను ఒక గుడ్డతో మూతకట్టి దానిని ఒక నీడ ప్రదేశంలో వారం రోజులపాటు ఉంచాలి.
  • ఈ విధంగా బాగా పులిసిన ద్రావణం సుమారు 2.5 లీటర్ల వరకు ఉంటుంది.
  • ఈ మిశ్రమాన్ని వడపోసి 100 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరా పంట పొలంలో పిచికారి చేయాలి.

ఉపయోగాలు :

  • పంటకాలంలో 1-2 సార్లు పంటపై పిచికారి చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు. ఈ ద్రావణాన్ని అన్ని పండ్ల తోటలలో వాడవచ్చు.
  • ద్రావణాన్ని తయారు చేసిన వెంటనే ఉపయోగించుకోవాలి. నిల్వ ఉంచరాదు.
Read More

వర్మి కంపోస్టు తయారీలో మెళకువలు

నేల నాణ్యతను, భూ ఫలదతను కాపాడటానికి, ప్రస్తుత విస్తృత వ్యవసాయ సాగు విధానంలో సేంద్రియ ఎరువుల వాడకాన్ని పునరుద్ధరించడం ఎంతో అవసరం. పశువుల గెత్తము లభ్యత నానాటికి తగ్గిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, కొని వేసుకోవటం లాభదాయకం కాదు. కనుక, ప్రత్యామ్నాయంగా కంపోస్టు ఎరువులను సులభపద్ధతుల్లో తయారు చేసుకొని వేసుకోవటం ఎంతో అవసరం. దీని వల్ల వరిసరాల పరిశుభ్రత కూడా వస్తుంది. సాంప్రదాయ వ్యవసాయంలో ఒకప్పుడు నేలలో విరివిగా కనిపించే వానపాములు నేటి ఆధునిక వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వాడకం పెరగడం, సేంద్రియ ఎరువుల వాడకం తగ్గడం వలన వానపాముల సంఖ్య గణనీయంగా తగ్గడం జరిగింది. వానపాములు నేల ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్యపాత్ర వహిస్తాయని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఛార్లెస్ డార్విన్ మొట్టమొదటిగా 1881లో ప్రపంచానికి తెలియజేశారు.

వర్మికంపోస్టుకు అనువైన వానపాములు – రకాలు
వానపాములు వెన్నెముక లేని జీవులు. ఇందులో 3600 రకాలు ఉన్నాయి. వీటిలో సగం మాత్రమే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్నాయి. వీటిని రెండు రకాలుగా విభజించడం జరిగింది.

  1. బొర్రోయింగ్ అనగా బొరియలు చేయు రకము నేలను గుల్లచేసి భూమి లోపలి పొరలలో ఉంటాయి. మన దేశంలో ఈ రకమే ఎక్కువగా ఉంది. నీటి ఎద్దడిని బాగా తట్టుకుని 90 శాతం మట్టిని 10 శాతం వ్యర్థ పదార్థాలను ఆహారంగా తీసుకుంటుంది. 8 నుండి 10 అంగుళాల పొడవు ఉండి సుమారు 15 సంవత్సరాలు జీవిస్తుంది. అయితే ఈ రకం వానపాము వర్మి కంపోస్ట్ తయారీకి అంతగా పనికి రాదు.

ఉదా: ఫెరిటిమా ఎలాంగేటా, ఫెరిటిమా ఏసియాటికా మొదలగునవి

  1. నాన్ బొర్రోయింగ్ అనగా బొరియలు చేయని రకము భూమి పై పొరలలో ఉంటూ బొరియలు చేయని రకము. ఇది వర్మి కంపోస్ట్ తయారీకి బాగా అనుకూలంగా వుండి మట్టిలో గల సేంద్రియ పదార్థాలను తునాతునకలు చేసి జీవన ఎరువును తయారు చేస్తాయి. ఇవి 90 శాతం వ్యర్థ పదార్థాలను 10 శాతం మట్టిని ఆహారంగా తీసుకొని నాణ్యమైన కంపోస్ట్ గా మారుస్తాయి. వీటిలో పునరుత్పత్తి శక్తి ఎక్కువ. కనుక రైతులు ఇటువంటి రకాలను ఎన్నుకోవడం మంచిది. వీటి జీవిత కాలము సుమారు రెండున్నర సంవత్సరాలు.
    ఉదా: ఐసీనియా ఫొటెడ, యుడ్రిలస్ యూజిని మొదలగునవి.

వానపాములను ఉపయోగించి సేంద్రియ వ్యర్థ పదార్ధాల సద్వినియోగం: వానపాముల సంతతిని వృద్ధి చేయడాన్ని వర్మి కల్చర్ అని, అవి విసర్జించే పదార్థాలను వర్మి క్యాస్టింగ్స్ అని, వీటి ద్వారా తయారయ్యే ఎరువును వర్మి కంపోస్ట్ అని అంటారు. మానవునికి ఉపయోగంలేక, వదలివేసిన కుళ్ళిన కూరగాయలు, పండ్లు, ఆకులు, చెత్తా చెదారం, కొబ్బరి పీచు, పశువుల పెంట మొదలైన వాటిని వానపాములు ఆహారంగా తీసుకుంటాయి. ఇవి పర్యావరణంలోని వ్యర్థ పదార్ధాలను తిని, కాలుష్య నివారణకు తోడ్పడటమేగాక విలువైన ఎరువును రైతుకు అందిస్తాయి. వానపాముల ఉనికి, కదలికల వల్ల నేల గుల్లబారుతుంది. ఫలితంగా నేలలో గాలి, నీరు చొరబడే శక్తి పెరుగుతుంది.

వర్మి కంపోస్టు తయారీ విధానం:
తొట్టి సైజు : షుమారు 15 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల ఎత్తు.
తొట్టి తయారీ : సిమెంటు తొట్టిని 3 అడుగుల వెడల్పు x 1.5 అడుగుల ఎత్తులో వీలైనంత పొడవుగా తయారు చేసుకోవాలి. సిమెంటు వరలను కూడా ఇందుకు వాడుకోవచ్చు. ఈ సిమెంటు తొట్టి అడుగుభాగం నున్నగా, గట్టిగా ఉండేటట్లు ప్లాస్టరింగ్ చేయాలి. నీరు తొట్టిలో నిలబడకుండా, తొట్టికి ఒక వైపున చిన్న రంధ్రం ఏర్పాటు చేయాలి. సిమెంటు తొట్టికి ఎండ తగలకుండా, చల్లటి పందిరి నీడను కల్పించాలి. ముందుగా కంపోస్టు చేయవలసిన వ్యర్థపదార్థాలన్నిటినీ (చెత్త, ఆకులు, పంటకోసాక మిగిలిన పంట అవశేషాలు, పిచ్చిమొక్కలు మొదలైనవి) సుమారు ఒక నెల రోజుల పాటు ఒక గొయ్యిలో వేసి, అవి ఒక మాదిరిగా కుళ్ళే వరకు కుళ్ళబెట్టాలి. ఆ తరువాత పాక్షికంగా కుళ్లిన ఈ వ్యర్ధపదార్ధాలను తెచ్చి, వర్మి కంపోస్టు తొట్టిలో వేసి కంపోస్టు చేసుకోవాలి. అయితే తొట్టిలో వీటిని వేయబోయే ముందు తొట్టి అడుగున బెడ్డింగ్ మెటీరియల్ సుమారు 15 సెం.మీ. మందాన తయారు చేసుకోవాలి, ముక్కిన కొబ్బరి పీచు లేదా కొద్దిగా ముక్కిన చెరకు పిప్పిని ముక్కలుగా కొట్టి, సమానంగా తొట్టి అంతా పలుచగా పరచి వెయ్యాలి. బెడ్డింగ్ మెటీరియల్ వేశాక, దాని మీద పాక్షికంగా కుళ్లబెట్టి ఉంచుకున్న వ్యర్థ పదార్ధాలను వెయ్యాలి. తరువాత పేడ నీళ్లు చిలకరించాలి. కొద్దిగా ముక్కిన పేడను (10 సెం.మీ. మందాన) ఈ వ్యర్థ పదార్థాలను వేసిన పొరపైన వెయ్యాలి. పచ్చిపేడను వెయ్యకూడదు. వానపాములను (చదరపు మీటరకు వెయ్యి/1 కిలో చొప్పున) వర్మీ కంపోస్టు తొట్టిలోకి వదలాలి. వర్మికంపోస్టుకు అనువయిన వానపాములు బరియలు చేయని రకాలు: ఐసీనియా ఫోటెడా, యూడ్రిలస్ యూజిని ముఖ్యమైనవి. పాత గోనె సంచులను గాని (లేదా) వరిగడ్డిని గాని తొట్టిపైన కప్పాలి. ప్రతి రోజు పల్చగా నీరు చిలకరిస్తూ ఉండాలి. నీళ్ళు ఎక్కువగా పోయకూడదు. రెండు-మూడు నెలల్లో మంచి, సస్య పోషణ గల వర్మీ కంపోస్టు తయారవుతుంది. సిమెంటు తొట్టి నుండి తయారైన వర్మీ కంపోస్టును తీయటానికి 4-5 రోజుల ముందు, తొట్టిలో నీరు చల్లరాదు. ఇలా చేయటం వల్ల, వానపాములు తేమను వెదుక్కుంటూ తొట్టి అడుగు భాగానికి చేరతాయి. కనుక తయారైన కంపోస్టును తీసుకోవచ్చు. తొట్టిలో నుండి కంపోస్టును బయటకు తీసి, శంఖాకారంగా గుట్టలు, గుట్టలుగా పోసి, ముతక జల్లెడతో జల్లించి, పంట పొలాలకు వేసుకోవాలి. బాగా తయారైన వర్మీ కంపోస్టు, పొడి పొడిలాడుతూ కాఫీ రంగులో ఉంటుంది. సంవత్సరానికి ఈవిధంగా ఒక తొట్టి నుండి 4 సార్లు కంపోస్టు చేసుకోవచ్చు. దీని వల్ల షుమారు 3 టన్నుల కంపోస్టు లభిస్తుంది.

వర్మీ కంపోస్ట్ ఉపయోగాలు :

  • నేల ఉత్పాదకతకు కావాల్సిన అనుకూల లక్షణాలు పెరుగుతాయి.
  • వేసిన పైరుకే కాక తర్వాత 2-3 పైర్లపై దీని ప్రభావం ఉంటుంది.
  • మొక్కలకు కావాల్సిన అన్ని పోషకాలు ఇందులో లభ్యమవుతాయి. పోషకాల సమతుల్యత ఉంటుంది.
  • వర్మీ కంపోస్ట్ తయారు చేయడం సులభం, ఖర్చు తక్కువ
  • రసాయన ఎరువులు వాడాల్సిన ఆవశ్యకత తగ్గి ఖర్చు ఆదా అవుతుంది.
  • పలు రకాల ఎంజైములు, హార్మోన్లు, అమైనోఆమ్లములు తయారై, మొక్కలు చురుకుగా పెరగడానికి తోడ్పడతాయి.
  • రోగ నిరోధక శక్తి పెంచే ఆక్సినోమైట్లు తయారవడం వల్ల పైరు ఆరోగ్యంగా ఉండి పురుగుమందులు వాడాల్సిన ఆవశ్యకత తగ్గి, లాభం చేకూరుతుంది.
  • భూమిలో ఉపయోగకరమైన సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. నేల సహజసిద్ధమైన ఆరోగ్యం కలిగి ఉంటుంది.
  • కూరగాయలు, పండ్లు, ఇతర ఉత్పత్తుల నాణ్యత పెరుగుతుంది. వాటికి మంచి రంగు, రుచీ, వాసన, రవాణాలో నిల్వ ఉండే గుణం పెరుగుతుంది.
  • సేంద్రియ వ్యర్ధాలను వర్మీ కంపోస్టు తయారీకి ఉపయోగించడం వల్ల, మంచి ఎరువు లభ్యమవుతుంది. పరిసరాల కాలుష్య నివారణకు తోడ్పడుతుంది.
  • దిగుబడితో పాటు ఫలసాయం నాణ్యత పెరుగుతుంది.

వర్మీ కంపోస్టుకు ఉపయోగించిన వ్యర్థ పదార్ధాలను బట్టి, స్థానిక వాతావరణం పరిస్థితులను బట్టి, తయారైన కంపోస్టులోని పోషకాల శాతంలో కొద్దిపాటి తేడాలుండవచ్చు. నత్రజని 1.5 నుండి 2.0 శాతం, భాస్వరం 0.5 నుండి 1.5 శాతం, పొటాషియం 0.5 నుండి 1.00 శాతం ఉంటుంది. ఇవికాక కాల్షియం, మెగ్నీషియం, గంధకం, రాగి, ఇనుము, మాంగనీసు, జింకు, మాలిబ్డినం, బోరాన్ పోషకాలు కూడా లభిస్తాయి. సాధారణ పైర్లన్నింటికి ఎకరానికి 1.0 నుండి 1.5 టన్నుల చొప్పున వర్మీ కంపోస్టు వేయవచ్చు. కుండీలలోని మొక్కలకు 200 గ్రా. చొప్పున వేయవచ్చును.

వర్మీ వాష్: వానపాముల శరీర భాగాల నుండి అవి విసర్జించే వర్మి క్యాస్టింగ్స్ నుండి తయారయ్యే ద్రవాన్ని “వర్మీ వాష్” అంటారు. ఇందులో మొక్క పెరుగుదలకు దోహదపడే హార్మోన్లు, అమైనో అమ్లములు, విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

తయారీ విధానం: వానపాములు ఉండడానికి అనువుగా బెడ్ ఏర్పాటు చేయాలి. దీనికి ఒక పెద్ద సైజు మట్టి పాత్ర (కుండ) లేదా పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ము ఉపయోగించుకోవచ్చు. పాత్ర అడుగు భాగంలో ఒక రంధ్రం ఏర్పాటు చేసి, దానిని దూది సహాయంతో మూసి ఉంచాలి. పాత్ర అడుగు భాగాన్ని మొదటి 3-4 అంగుళాలు ఇసుకతో ఆపైన 3 అంగుళాలు చిన్న చిన్న ఇటుక ముక్కలు, రాళ్ళతో నింపాలి. దీనిమీద బాగా మాగిన సేంద్రియపదార్ధాన్ని పాత్రలో నాలుగింట మూడు వంతుల వరకు నింపాలి, ఇందులో వీలయినన్ని ఎక్కువ (150 నుండి 200) వానపాములు వదలాలి. పాత్రలో ఎల్లప్పుడు 50-60 శాతం తేమ ఉండేటట్లు ప్రతిరోజు నీటిని చిలకరిస్తూ ఉండాలి. వానపాముల విసర్జన పూర్తిగా తయారైన తర్వాత ఎక్కువ నీరు పోయాలి. పాత్ర అడుగు భాగంలోని రంధ్రం నుండి టీ డికాక్షన్ వంటి ద్రవం బొట్టు బొట్టుగా స్రవించడం మొదలవుతుంది. దీనిని సేకరించాలి. ఇలాగే మరో రెండు సార్లు నీరు పోసి వచ్చిన ద్రవాన్ని సేకరించాలి. దీనినే వర్మి వాష్ అంటారు. ఇది అత్యంత విలువైన సేంద్రియ ద్రవ ఎరువు. సేంద్రియ పదార్ధమంతా వర్మి క్యాస్టింగ్గా మారి పోయినప్పుడు, దానిని తీసివేసి కొత్తగా సేంద్రియ పదార్థాన్ని వేస్తే వానపాముల నుండి మరల క్యాస్టింగ్స్ తయారవడం ప్రారంభమవుతుంది. ఇదే పద్ధతి పలుమార్లు ఆచరించడం వల్ల అవసరమైనంత వర్మివాష్ లభిస్తుంది.

పోషక విలువలు: నత్రజని – 500 పి.పి.యం., భాస్వరం – 390 పి.పి.యం., పొటాషియం- 460 పి.పి.యం. కాల్షియం-540 పి.పి.యం.. మెగ్నీషియం-110 పి.పి.యం., ఇనుము-273 పి.పి.యం., మాంగనీసు- 180 పి.పి.యం., జింకు – 180 పి.పి.యం., రాగి-21 పి.పి.యం.

వెర్మి కల్చర్: వానపాముల సంతతిని వృద్ధి చేయడాన్ని వర్మికల్చర్ అంటారు. వానపాములను ఎక్కువ సంఖ్యలో అభివృద్ధి చేయడానికి 1:1 నిష్పత్తిలో పేడ మరియు ఎండిన ఆకులను కలుపుకోవాలి. ఇలా కలుపుకొన్న, ప్రతీ 10 కిలోల వ్యర్థ పదార్ధాలకు 50 వానపాములు చొప్పున వదులుకుని, నీడలో పెట్టుకొని అనుకూలమైన వాతావరణ పరిస్థితులు కల్పిస్తే (ఉష్ణోగ్రత 15-30° సెంటీగ్రేడ్, తేమ శాతం 70-80%) రెండు నెలల్లో వానపాముల సంఖ్య వంద రెట్లు పెరుగుతుంది.

డా.ఎం.ఎం.వి. శ్రీనివాసరావు, ప్రధాన శాస్త్రవేత్త(సస్యపోషణ), డా.కె. లక్ష్మణ, ప్రధాన శాస్త్రవేత్త(విస్తరణ), డా.కే. తేజేశ్వర రావు, ప్రధాన శాస్త్రవేత్త(సస్యపోషణ), ఏరువాక కేంద్రం మరియు వ్యవసాయ పరిశోధన స్థానం, విజయనగరం. మొబైల్ నెంబర్ : 9440123223

Read More

మొక్కల ఆరోగ్యానికి ‘వర్మివాష్’

వర్మి వాష్ తయారీ విధానం: 200 లీ. డ్రమ్ముని తీసుకుని, దాని అడుగు భాగం నుండి కొంచెం పైన కుళాయి బిగించాలి. డ్రమ్ములోపల 15 సెం.మీ. వరకు ఇసుకపోసి, ఇసుకపై డ్రమ్ముపై వరకు ఎర్రమట్టి పోయాలి. దానిపైన పేడ, కూరగాయల వ్యర్థాలను వేసి వానపాములను వదలాలి. ప్రతిరోజూ డ్రమ్ములో 2 లీ. నీటిని పోస్తూ ఉండాలి. ఇలా 15 రోజులు చేసిన తర్వాత డ్రమ్ములోని నీటిని కుళాయి ద్వారా పాత్రలో సేకరించి 15 రోజుల కొకసారి మొక్కలపై పిచికారి చేయాలి. డ్రిప్ ద్వారా వారానికొకసారి పంపించాలి. దీనివలన మొక్కలు ఆరోగ్యవంతంగా పురుగులు, తెగుళ్ళు సోకకుండా పెరుగుతాయి.

Read More

‘అమృత మట్టి’తో అమృతాహారం!

పర్యావరణానికి, వినియోగదారుల ఆరోగ్యానికి ఎలాంటి నష్టం కలిగించని పద్థతుల్లో పంటల సాగు ఇప్పటి అవసరం. అంతేకాదు.. పోషకాల సాంద్రత చాలా ఎక్కువగా కలిగిన అధిక దిగుబడులు సాధించాలి! రైతు ఆర్థికంగా నిలదొక్కుకోగలగాలి!! ఈ లక్ష్యాల సాధనకు రైతులకు దారి చూపేదే ‘అమృత మట్టి’తో పర్యావరణ అనుకూల (నేచ్యు-ఎకో) సేద్యం. సేంద్రియ సేద్యాన్ని మరో మెట్టుపైన నిలబెడుతుంది ఈ సేద్య పద్ధతి.

పర్యావరణానికి హాని లేకుండా, వినియోగదారుల ఆరోగ్యానికి మేలు చేకూర్చే విధంగా సాగు చేయటమే నేచ్యు-ఎకో పద్ధతి ప్రత్యేకత. ‘అమృత మట్టి’ ద్వారా ఈ పద్ధతిలో పండించిన ఆహారోత్పత్తుల్లో పోషకాల సాంద్రత చాలా ఎక్కువగా ఉందని పరీక్షల్లో నిరూపితమైంది. సంప్రదాయ (రసాయనిక) పద్ధతుల్లో పండించే కూరగాయలతో పోల్చితే అమృతమట్టి ఉపయోగించి పండించిన కూరగాయలు అధికంగా పోషక విలువలను కలిగి ఉంటాయి. ఇవి ఐదు రెట్ల మాంసకృత్తులు, 20 శాతం కాల్షియంను అదనంగా కలిగి ఉంటాయి. సాధారణంగా మాంసాహారంలోనే లభించే విటమిన్ బి-12 ఉనికిని అమృతమట్టి ఉపయోగించి పండించిన కూరగాయల్లో కనుగొనడం విశేషం.

ఉత్పాదకాలను డబ్బు పోసి కొని వాడడానికి బదులుగా.. పొలాల చుట్టు పక్కల్లో లభించే వనరులను ఉపయోగించుకోవటం, సాగు భూమికి ఎలాంటి నష్టం జరగకుండా మంచి దిగుబడులు సాధించడమే లక్ష్యంగా ఈ పద్ధతికి రూపకల్పన చేశారు ప్రొఫెసర్ శ్రీపాద్ ఎ.దబోల్కర్.

అమృతమట్టిని ఉపయోగించి… భూమిలో జీవన ద్రవ్యం, సేంద్రియ కర్బనాలను పెంచటం ద్వారా రసాయనిక వ్యవసాయంలో కన్నా తొలి ఏడాదే ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని ప్రొ. దబోల్కర్ నిరూపించారు. చీడ పీడల బారి నుంచి పంటలను రక్షించుకునేందుకు దబోల్కర్ వ్యవసాయ పద్ధతిలో ఎటువంటి రసాయనిక కీటక నాశనులు, క్రిమి సంహారకాల పిచికారీ అవసరం లేదు. పోషకాలను అందించేందుకు రసాయనిక ఎరువులను వాడాల్సినవసరం లేదు. పొలం అంతటా మట్టి పరుపులను (రైజ్డ్ బెడ్స్) తయారుచేసుకుని అమృత జలాన్ని, అమృత మట్టిని వినియోగించి పంటలు పండిస్తారు.

అమృతమట్టి తయారుచేసే పద్ధతి….
అమృతమట్టి తయారీ వివిధ దశలతో కూడుకున్న ప్రక్రియ. దీనికోసం ముందుగా అమృత జలాన్ని తయారు చేసుకోవాలి.

అమృత జలం తయారీ విధానం:
ఒక లీటరు గోమూత్రం, ఒక కిలో తాజా ఆవు పేడ, 50 గ్రా.బెల్లాన్ని, 10 లీటర్ల నీటిని ఒక తొట్టెలో కలపాలి. మూడు రోజులు నిల్వ ఉంచాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు మూడుసార్లు కలపాలి. మూడురోజుల తర్వాత పదిపాళ్లు నీటికి ఒక పాలు అమృత జలాన్ని కలిపి పంటలకు వాడుకోవచ్చు.

అమృతమట్టి తయారీ విధానం:
తగినంత అమృత జలం పోసిన పాత్రలో పచ్చి, ఎండిన ఆకులు కలిపి వేసి 24 గంటలపాటు ఉంచాలి.
బెడ్‌ల తయారీ: 10 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 1 అడుగు ఎత్తు ఉండేలా బెడ్‌ను నిర్మించుకోవాలి. బెడ్‌లో మె°దటి పొరగా ఆకులు నానబెట్టిన అమృత జలాన్ని పోయాలి. దీనిపైన నేలపై పొర నుంచి సేకరించిన మట్టిని ముందు నేలపై పొరలాగా పరవాలి. దీనిపైన మళ్లీ అమృత జలాన్ని పోయటం, పైన మట్టిని పరవటం ఇలా… బెడ్‌ను పొరలు పొరలుగా పేర్చుకుంటూ రావాలి. తర్వాత పంట వ్యర్థాలతో ఆచ్ఛాదన కల్పించాలి.
ప్రతి వారం రోజులకు బెడ్‌లో ఉన్న కంపోస్టును కలపాలి. సూక్ష్మజీవుల చర్యలు జరిపేందుకు తగినంత తేమ ఉండేలా అమృత జలంతో బెడ్‌ను తడుపుతుండాలి. ఈ మిశ్రమం పూర్తిస్థాయి కంపోస్టుగా మారేందుకు 30 రోజుల సమయం పడుతుంది.

విభిన్న రకాల పంటలకు చెందిన విత్తనాలను ఎంచుకొని బెడ్‌పై నాటుకోవాలి. ఎంపిక చేసుకున్న విత్తనాలను అమృత జలంలో ఎనిమిది గంటలు నానబెట్టిన తర్వాత బెడ్‌లోఉన్న కంపోస్టుపై విత్తుకోవాలి. విత్తిన తర్వాత ఆకులతో ఆచ్ఛాదన కల్పించాలి. బెడ్‌పై అమృత జలాన్ని పిచికారీ చేయటం ద్వారా విత్తనాలు మొలకెత్తేందుకు అవసరమైన తేమను అందించాలి.

21 రోజుల పాటు ఇలా చేయటం ద్వారా అన్ని విత్తనాలు మొలకెత్తేలా చూడాలి. ఆ తరువాత వివిధ దశల్లో పెరిగే మొక్కలకు కత్తిరింపులు చేపట్టాలి. మొలకెత్తిన 21 రోజులకు మొక్కల్లో పావు వంతు భాగాన్ని కత్తిరించాలి. 42వ రోజు రెండోసారి, 63వ రోజు పూత దశలో మూడోసారి కత్తిరించాలి. మూడో కత్తిరింపులో బెడ్‌పైన మొక్కలను అర అంగుళం వదిలి పైభాగం మొత్తం కత్తిరించాలి. ఇలా కత్తిరించిన భాగాలను అమృత జలంలో 8 గంటలు నానబెట్టి అమృత మట్టిలో కలపాలి. బెడ్స్‌పైన ఆచ్ఛాదన కల్పించాలి. బెడ్‌పైన అలా తయారైన కంపోస్టును వారానికి ఒకసారి కలపాలి. నాలుగు వారాలపాటు ఇలా చేస్తే… అమృత మట్టి సిద్ధమైనట్టే.

Read More

ప్రకృతి వ్యవసాయంతో సమగ్ర పరిష్కారాలు

– వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌

వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రకృతి వ్యవసాయం సమగ్ర పరిష్కారాలు అందిస్తుందని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్‌ పేర్కొన్నారు. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని జిల్లాల్లో మూడు రోజుల పాటు శిక్షణ శిబిరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. కొందరు రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని చేయటాన్ని అభినందించారు. ఈ సమావేశంలో రైతు సాధికార సంస్థ వైస్‌ చైర్మన్‌ విజయ్‌ కుమార్‌ పాల్గొన్నారు. రసాయనాల వాడకంతో ఆహారంలో పోషకాలు తగ్గుతున్నాయని తెలిపారు. భూసారం పెరగడానికి, రైతు శ్రేయస్సుకు ప్రకృతి వ్యవసాయం అవసరమని వివరించారు. దీనిలో సత్ఫలితాలను సాధిస్తున్న గుంటూరు జిల్లా నూతక్కి రైతు శ్రీనివాసులు రెడ్డి, ఎన్టీఆర్‌ జిల్లా వీరపనేనిగూడెం రైతు హేమలత విజయాలను అధికారులు వివరించారు. సమావేశంలో వ్యవసాయశాఖ డైరెక్టర్‌ ఢిల్లీరావు, ఉద్యానశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసులు, రైతు సాధికార సంస్థ సీఈఓ బి. రామారావు పాల్గొన్నారు.

Read More